ఎడ్యూర‌ప్ప వాగ్దానానికి ఏపీ నేత‌లు మ‌ద్ద‌తు ఇస్తారేమో..!

క‌ర్ణాట‌కలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌న్న‌ది భాజ‌పా పంతం..! ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ త‌న ప‌ట్టు మ‌రోసారి నిలుపుకునే దిశ‌గా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్ల‌లో ఉంది. భాజ‌పాకి ఎక్క‌డా ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌న వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు సిద్ధ‌రామ‌య్య‌. దీంతో భాజ‌పా నేత ఎడ్యూర‌ప్ప ఇష్ట‌మొచ్చిన‌ట్టు హామీలు ఇచ్చేస్తున్నారు. తాము అధికారంలోకి వ‌స్తే ఆల్మ‌ట్టీ ఎత్తు పెంచుతామ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ఆల్మ‌ట్టీ ఎత్తు 519 మీట‌ర్ల నుంచి 524కు పెంచుతామ‌ని ఎడ్యూర‌ప్ప అంటున్నారు. దీని ద్వారా ప్ర‌స్తుతం 120 టి.ఎమ్‌.సి.ల డామ్ నీటి నిల్వ సామ‌ర్థ్యం 200 టి.ఎం.సి.లు చేస్తామ‌ని ప్ర‌చారం చుస్తున్నారు.

ఇది ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే హామీ, ప‌క్క రాష్ట్రాల హ‌క్కుల‌కు గండికొట్టే హామీ. నిజానికి, ఇప్ప‌టికే కృష్ణాన‌దిపై క‌ర్ణాట‌క‌లో నిర్మించిన డామ్ ల పుణ్య‌మా అని ఆంధ్రాకు నీరు వ‌చ్చేస‌రికి ఏ అక్టోబ‌రో న‌వంబ‌రో అవుతోంది. ఇదే ఆల్మ‌ట్టీ ఎత్తు పెంపు ప్ర‌తిపాద‌న గ‌తంలో కూడా ఓసారి వ‌స్తే… అప్ప‌ట్లో చంద్ర‌బాబు నాయుడు క‌ర్ణాట‌క వెళ్లి, ధ‌ర్నా చేసి వ‌చ్చారు. అప్ప‌ట్లో అదో సంచ‌ల‌న ఘ‌ట‌న‌గా నిలిచింది. ఇప్పుడు ఎన్నిక‌ల ల‌బ్ధి కోసం మ‌రోసారి ఆల్మ‌ట్టీ ఎత్తు పెంచుతామంటున్నారు. నిజానికి, క‌ర్ణాట‌క‌లో తాజాగా వెలువ‌డిన కొన్ని స‌ర్వేల ఫ‌లితాల ప్ర‌కారం… అక్క‌డ భాజ‌పాకి ఎదురీత త‌ప్ప‌ని వాతావ‌ర‌ణ‌మే ఉంది. దీంతో ప్ర‌జ‌ల‌ను ఎలాగోలా రెచ్చ‌గొట్టేందుకు ఇలాంటి హామీల‌ను ఇస్తున్నారు.

ఏపీ ఏమాత్రం ఆద‌ర‌ణ లేక‌పోయినా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే కంక‌ణ‌బ‌ద్ధులై ఉన్నామ‌ని చెప్పే భాజ‌పా నేత‌ల‌కు ఈ హామీ వినిపిస్తోందా..? ప‌క్క‌రాష్ట్రంలో వారి పార్టీ ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను గండికొట్టే హామీలు ఇస్తుంటే ఏపీ నేత‌లు ఏమీ మాట్లాడ‌రేం…? లేదంటే, రాయ‌ల‌సీమ‌లో రెండో రాజ‌ధాని కావాల‌ని డిమాండ్ చేసిన ఏపీ భాజ‌పా నేత‌లు ఎడ్యూర‌ప్ప‌కు మ‌ద్ద‌తుగా నిలిస్తారేమో..! క‌ర్ణాట‌క వెళ్లి ఆల్మ‌ట్టీ ఎత్తు పెంచుతామ‌ని వీరు కూడా గొంతు క‌లుపుతారేమో..! ఇప్ప‌టికే కృష్ణా న‌దీ జ‌లాలు రోజురోజుకీ త‌గ్గుతున్నాయి. ఒక‌వేళ ఆల్మ‌ట్టీ ఎత్తు ఎడ్యూర‌ప్ప చెప్పిన‌ట్టుగా నిజంగా పెంచితే… గ‌తంలో కృష్ణా న‌ది అనేది ఉండేదీ, అది ఆంధ్రాలో కూడా ప్ర‌వ‌హించేంద‌ని చెప్పేకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది..! ఎడ్యూర‌ప్ప హామీపై ఏపీ భాజపా నేత‌లు నోరు మెదప‌రా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.