చంద్రబాబు జోక్యం, ఆరాపై గంటా గరం గరం!

పైకి అంతా చాలా పక్కాగానే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తన పాలన మీద తన మంత్రి వర్గ సహచరుల్లో గానీ, అధికారుల్లో గానీ.. ఏ కొంత అయినా అసంతృప్తి ఉన్నట్లయితే, అది ఏ రూపంలోనూ ప్రచారంలోకి రాకుండాఉండడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఉంటారు. పబ్లిసిటీకిఉన్న వేల్యూ గురించి ఆయనకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియదనడంలో సందేహం లేదు. అందుకే ఒకసారి నెగటివ్‌ పబ్లిసిటీ చిన్నది వచ్చినా.. దాన్ని పూడ్చుకోవడానికి చాలా ఎక్కువ కష్టపడాలని ఆయనకు తెలుసు. అలాంటివి రాకుండా చూసుకుంటారు. కానీ, ఆయన తీరు మీద, మంత్రుల్ని డమ్మీలుగా చేస్తున్న తీరు మీద, అలాగే తమ వ్యవహారాల గురించి జోక్యం చేసుకుంటున్న తీరు మీద కొందరు మంత్రులు అసహనానికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో , కేబినెట్‌లో చంద్రబాబునాయుడు పట్ల వీర భక్తిని ప్రదర్శించే వారు కొందరు, ప్రదర్శన కోసం భక్తిని చూపించేవారు కొందరు సహజంగానే ఉంటారు. అయితే చంద్రబాబు తీరుతో విసిగిపోతున్న కొందరు మంత్రులు తమ ప్రెవేటు భేటీల్లో ఆ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా విశాఖకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, సీఎం తీరుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో షికారు చేస్తన్నాయి.

మంత్రులతో ఇటీవల చంద్రబాబు సమావేశం పూర్తయిన తర్వాత.. బయటకు వచ్చిన గంటా శ్రీనివాసరావు… ”ఏంటి ఆయన ఉద్దేశం నన్ను ఉండమంటారా? పొమ్మంటారా?” అంటూ ఆగ్రహంగా అన్నట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. విశాఖకు చెందిన ఒక భూకుంభకోణంలో ప్రధానంగా గంటా పేరు కూడా ముడిపెట్టి ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు మాత్రం తేలలేదు. మరో కోణంలోంచి చూసినప్పుడు ఏదో ఒక భూకుంభకోణం, లేదా మరో అవినీతి స్కాంతో ముడిపెట్టకుండా.. ఏ మంత్రి వ్యవహారమూ ఉండదు. వారి పాత్ర ఎంత ఉన్నా సరే.. రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు. అయితే విశాఖ ప్రాంతంలోని భూ కుంభకోణం విషయంలో గంటా పేరు ముడిపడి ఉండగా.. దానిని గురించి చంద్రబాబునాయుడు మాట్లాడిన తీరు గంటా శ్రీనివాసరావును మనస్తాపానికి గురిచేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగిలిన మంత్రులముందే చంద్రబాబు దాన్ని గురించి ప్రశ్నించడం ఆయనకు నచ్చలేదని సమాచారం.

అలాగే మిగిలిన కొందరు మంత్రుల్లో కూడా చంద్రబాబునాయుడు తీరు, ధోరణుల మీద అసంతృప్తి ఉన్నదని, ఎవరికి వారు బయటపడకుండా రోజులు నెట్టుకొస్తున్నారని కూడా అమరావతి వర్గాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ప్రపంచదేశాలను ఇంప్రెస్‌ చేసి ఇటువైపు ఆకర్షించడానికంటె ముందు.. తన కేబినెట్‌ కొలీగ్స్‌ ఎవ్వరిలోనూ అసంతృప్తి లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమని కొందరంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]