జంట పార్టీల హోదా ద్రోహం – మొహం లేస్తున్న కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కేటగిరి కావాలా వద్దా అనేవిషయం మీద రాష్ట్రవ్యాప్తంగా బ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. మొదటి బ్యాలెట్ ను తిరుపతిలో 28 న బ్యాలెట్ నిర్వహిస్తారు.

ప్రత్యేక హోదా కావాలన్న ప్రజాభిప్రాయమే ఈ బ్యాలెట్ లో కూడా వెల్లడౌతుంది. అంతమాత్రాన రాష్ట్రానికి హోదా ఏదీ లభించదు. అయితే, దుర్మార్గమైన ఏక పక్ష విభజన ద్వారా తుక్కుతుక్కయిపోయిన కాంగ్రెస్ పార్టీ తనను తాను కూడగట్టుకోడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడవచ్చు.

బిజెపి మద్దతు లేకపోతే విభజన జరిగేదేకాదు. ఆవిషయం కూడా గట్టిగా చెప్పుకోలేనంతగా కాంగ్రెస్ బిక్కచచ్చిపోయింది. హోదా మాత్రమే సంజీవని కాదని చంద్రబాబు నాయుడు శృతి మొదలుపెట్టగా, హోదా వల్ల కలిగే ప్రయోజనాలకు మించి ఎపిలో అభివృద్ధి చేస్తామని వెంకయ్యనాయుడు కొత్త రాగం అందుకున్నారు. ఇదేమి న్యాయమంటే కోప్పడటం కూడా ప్రారంభించారు.

ఇంతవరకూ ఇష్టంలేని కాపురం చేస్తున్నట్టు కనిపించిన తెలుగుదేశం, బిజెపి పార్టీలు ఈ పరిణామంతో ఒకరినొకరు గట్టిగా పట్టుకోవలసిన పరిస్ధితి కనిపిస్తోంది.

తెలుగుదేశం మీద ద్వేషమే ఏకైక ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపాలనపై గడపగడపకూ ప్రశ్నాపత్రాలు ఇచ్చి తన కేడర్ లో ఉత్తేజాన్ని నింపుకోగలిగింది. జగన్ ఎంత మాట్లాడితే ఆపార్టీ అంతగా నష్టపోతుంది. ఎందుకంటే ప్రజా సమస్యలపై ప్రభుత్వవైఫల్యాలతో విమర్శలు మొదలు పెట్టి జనాన్ని ఆకర్షించగల జగన్ అదేధోరణి మీద ఫోకస్ చేయలేరు. తనవస్తువును చంద్రబాబు తన్నుకుపోయారన్న ఆక్రోశమే ఆయన విమర్శల్లో బయటపడుతూవుంటుంది. వ్యక్తిగత ద్వేషాల ఆధారంగా ప్రజలు ఒకవైపు మొగ్గు చూపరన్న వాస్తవాన్ని అర్ధం చేసుకోలేకపోవడమే జగన్ వైఫల్యం.

ఈ నేపధ్యంలో హోదాపై ప్రజల్ని మోసగిస్తున్న తోడు దొంగల పట్ల ప్రజానీకంలో వున్న ఆగ్రహాన్ని సొమ్ము చేసుకోవాలన్న కాంగ్రెస్ ఎత్తుగడ బాగానే వుంది. ఎపి ఎమైపోయినా పరవాలేదు తెలంగాణా ఇచ్చేయాలని నిర్ణయించుకున్న సోనియా నిర్ణయాన్ని అమలు చేయడానికి ఆమె తాబేదారులు అన్నిపాపాలూ చేశారు. విధిలేని పరిస్ధితులు కల్పించి అన్నిపార్టీలనుంచీ విభజనకు లేఖలు తీసుకున్నారు. సీమాంధ్రలోని కాంగ్రెస్ మాటను కాంగ్రెస్ పెద్దలు ఎవరూ పట్టించకోలేదు. ఆవిధంగా పార్టీ హైకమాండ్ చేసిన పాపానికి ఎపి కాంగ్రెస్ కు ఫేసే లేకుండా పోయింది.

ఇపుడు తెలుగుదేశం, బిజెపి లు ఉమ్మడిగా చేసిన హోదా ద్రోహం వల్ల కాంగ్రెస్ కు తల ఎత్తుకునే అవకాశం వచ్చింది. అపరాధభావన కొంత తొలగింది.

ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టిన కాంగ్రెస్, రాష్ట్ర వ్యాప్తంగా కొటి సంతకాల సేకరణ, నీరు, మట్టి సేకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించింది.

ప్రత్యేక హోదాపై ప్రజల తీర్పును అనుసరించే దమ్ము, ధైర్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయా ? అని ఎపి-పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సవాల్ విసురుతున్నారు. అంతేకాక ప్రజా బ్యాలెట్ లో ప్రత్యేక హోదా వద్దని అని మెజారిటీ ప్రజలు కోరుకుంటే చంద్రబాబు, వెంకయ్యనాయుడులకు సన్మానం చేస్తామని కూడా ఆయన అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com