తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయ అభివృద్ధి విషయంలో పదేళ్లుగా నెలకొన్న స్తబ్దతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. భద్రాద్రి రాముడి ఆలయ పునర్నిర్మాణం,పరిసరాల అభివృద్ధి కోసం ఏకంగా రూ. 586 కోట్ల భారీ వ్యయంతో మాస్టర్ ప్లాన్ను ఆమోదించారు. తొలి విడదల నిధులు విడుదల చేశారు.
సెంటిమెంట్ కారణంగా పట్టించుకోని కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదేళ్ల పాలనలో యాదాద్రిని అద్భుతంగా నిర్మించినప్పటికీ, భద్రాచలం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ మొదటి రెండేళ్లు పాటించినా, ఆ తర్వాత క్రమంగా దూరమయ్యారు. ప్రతి ఏటా బడ్జెట్లో వంద కోట్లు కేటాయిస్తామని ప్రకటించినా, ఆ నిధులు ఎప్పుడూ ఆలయ అభివృద్ధికి చేరలేదు. భద్రాచలం వెళ్తే పదవి పోతుందనే ముఖ్యమంత్రి సెంటిమెంట్ కారణం వల్ల కేసీఆర్ అటువైపు చూడలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.
అలాంటి సెంటిమెంట్లను పట్టించుకోని రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే భద్రాచలంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ విస్మరించిన క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అటు హిందూ ఓటు బ్యాంకుకు, ఇటు స్థానిక ప్రజలకు బలమైన సంకేతం పంపాలని ఆయన భావిస్తున్నారు. మూడు దశల్లో చేపట్టబోయే ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా గోదావరి కరకట్ట నిర్మాణం, భక్తుల కోసం అధునాతన వసతులు, ఆలయ ప్రాంగణ విస్తరణ వంటివి ఉన్నాయి. మొత్తం రూ. 586 కోట్ల ప్రాజెక్టులో తొలి దశలో కేటాయించిన రూ. 351 కోట్లతో అత్యవసర పనులను ప్రారంభించనున్నారు. వర్షాకాలంలో భద్రాచలాన్ని ముంచెత్తుతున్న గోదావరి వరదల నుంచి పట్టణాన్ని కాపాడేందుకు రక్షణ గోడల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆలయ మాడ వీధుల నిర్మాణం, అన్నదాన సత్రాలు, పార్కింగ్ వసతుల కల్పన వంటివి రెండో దశలో చేపట్టనున్నారు.
భక్తితో పాటు రాజకీయం కూడా !
కేసీఆర్ ఏ క్షేత్రాలను నిర్లక్ష్యం చేశారో, వాటినే లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి తన ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు. యాదాద్రి కంటే భద్రాచలం పురాతనమైనదని, దానికి సరైన గుర్తింపు లేకపోవడం అన్యాయమని రేవంత్ భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి భద్రాచలం రూపురేఖలు మారిస్తే, అది రేవంత్ రెడ్డి సర్కార్కు అతిపెద్ద రాజకీయ ఆస్తిగా మారుతుందనడంలో సందేహం లేదు.


