అన్న క్యాంటీన్లలాగే రైల్వేజోన్ తెస్తారట బీజేపీ నేతలు..!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలకు గుక్క తిప్పుకోలేని పరిస్థితిని కల్పిస్తోంది హైకమాండ్. రాజ్యసభలో… రాజ్‌నాథ్ సింగ్.. రైల్వేజోన్ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. అసలు గడ్డు కాలంలో ఉన్న తమకు.. మార్కెట్ చేసుకోవడానికి ఇంత కన్నా మంచి ప్రకటన దొరకదేమోనని బీజేపీ నేతలు త్వరపడ్డారు. కృతజ్ఞతాయాత్ర పేరుతో.. శనివారం సాయంత్రం విశాఖ నుంచి ఢిల్లీకి బయలు దేరారు. వారి దురదృష్టం ఏమిటంటే… వారు అటు రైలెక్కగానే.. ఇటు సుప్రీంకోర్టులో కేంద్రం హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్ బయటకు వచ్చింది. అందులో రైల్వేజోన్ సాధ్యం కాదని.. కేంద్ర హోంశాఖ స్పష్టంగా చెప్పంది. దీంతో ఢిల్లీకి బయలుదేరిన బీజేపీ నేతలకు షాక్ తగిలినట్లయింది.

తమ కృతజ్ఞతా యాత్రకు.. సొంత పార్టీ నుంచే కౌంటర్ రావడంతో.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ మీడియా ముందుకు వచ్చి.. టీడీపీపై మండిపడ్డారు. బీజేపీ ఎక్కడ రైల్వేజోన్‌ ఇస్తుందేమోనని టీడీపీ నేతల్లో భయం మొదలైందని కొత్త కోణం ఆవిష్కరిచారు. ఏదోలా రాజకీయ లబ్ది పొందాలని టీడీపీ ప్రయత్నిస్తోందని తేల్చేశారు. అంతే కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. రైల్వేజోన్ తెచ్చి చూపిస్తామని.. సవాల్ చేశారు. కేంద్రం స్పందన.. ఎప్పుడూ తేడాగానే ఉంటోందని అనుమానం వ్యక్తం చేసిన జర్నలిస్టులకు… మైండ్ బ్లాంక్ అయ్యేలా… సమాధానం ఇచ్చారు విష్ణుకుమార్ రాజు. అన్నక్యాంటీన్లు ఏర్పాటు ఎలా సాధ్యమయిందో… రైల్వేజోన్ కూడా అలాగే తెస్తామని చెప్పేశారు. అన్న క్యాంటీన్‌కు.. రైల్వేజోన్‌కు ముడిపెట్టడం అంటే.. మోకాలికి.. బోడిగుండుకు లంకె పెట్టడమే అయినా.. విష్ణుకుమార్ రాజు.. దానికే ఓటేశారు.

అన్న క్యాంటీన్లలో రూ. 5కి భోజనం టెక్నికల్‌గా సాధ్యంకాదు కానీ… ఇదొక రాజకీయ నిర్ణయమట. విశాఖ రైల్వే జోన్ కూడా టెక్నికల్‌గా సాధ్యం కాదు కానీ… రాజకీయ నిర్ణయంగా బీజేపీ ఇస్తుందనేది… విష్ణుకుమార్ రాజు లాడిక్. కేంద్రం రైల్వేజోన్‌ ఇచ్చి తీరుతుందని, రైల్వేజోన్‌ ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా కేంద్ర అధినాయకత్వం హామీ ఇచ్చిందని ఎమ్మెల్సీ మాధవ్‌ కాన్ఫిడెంట్‌గా చెప్పుకొస్తున్నారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అధికారులు పాత రిపోర్టును జత చేయడం వల్ల సమస్య వచ్చిందని, రాజ్యసభలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాటలను జతచేస్తూ కేంద్ర హోంశాఖ మరో అఫిడవిట్‌ దాఖలు చేస్తుందని మాధవ్‌ సొంత తెలివి తేటలు చూపించారు. కానీ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మెకాన్ ఇచ్చిన మధ్యంతర నివేదికనే… కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించడానికి సిద్ధపడలేదు. ఇక రైల్వేజోన్ విషయంలో ఏం స్పందిస్తుంది. తమను తాము డిఫెండ్ చేసుకోవానికి.. బీజేపీ నేతలకు రకరకాల స్కిట్లు చేయాల్సిన పరిస్థితిని..బీజేపీ అగ్రనాయకత్వం కల్పిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com