భాజ‌పా మంత్రులు రాజీనామాకు ఎందుకు సిద్ధ‌ప‌డ్డ‌ట్టు..?

తెలుగుదేశం – భాజ‌పా పొత్తు ఏ క్ష‌ణ‌మైనా తెంచుకోవ‌డం ఖాయ‌మ‌నే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అధినేత ఆదేశిస్తే.. వెంట‌నే రాజీనామాలు చేసేందుకు సిద్ధం అంటూ కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు రాజీనామా జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. టీడీపీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ కూడా ఇలాంటి ప్ర‌క‌ట‌నే చేశారు. చంద్రబాబు ఆదేశం కోసం వెయిటింగ్ అంటున్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలూ మంత్రులూ ఇలా సంసిద్ధంగా ఉంటే.. అంత‌కంటే ముందుగా తాము రాజీనామాల‌కు సిద్ధ‌మై ఉన్నామ‌ని అంటున్నారు ఏపీ భాజ‌పా మంత్రులు! ఇవాళ్ల జ‌రుగుతున్న అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పొత్తు ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి ఏదైనా కీలక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని ఏపీ భాజ‌పా నేత‌లు అంచనా వేస్తున్నారు. ఒక‌వేళ అలాంటి ఏదైనా జ‌రిగితే.. వెంట‌నే రాజీనామాలు చేసేందుకు భాజ‌పా మంత్రులు సిద్ధంగా ఉన్నారు.

చంద్ర‌బాబు నుంచి అలాంటి ప్ర‌క‌ట‌న ఏదైనా ఉంటే, మ‌రుక్ష‌ణ‌మే రాజీనామాలు చేయాలంటూ భాజ‌పా మంత్రుల‌కు ఢిల్లీ నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ కు హైక‌మాండ్ నుంచి స‌మాచారం వ‌చ్చింద‌ట‌. దీంతో ఆయ‌న అమ‌రావ‌తిలో భాజ‌పా ఎమ్మెల్యేలూ ఎమ్మెల్సీలూ మంత్రుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు హ‌రిబాబుకి ఫోన్ చేస్తే… అధిష్ఠానం ఆదేశాలు అలాగే ఉన్నాయ‌నీ, స్పీక‌ర్ ను స‌మ‌యం అడిగి రాజీనామాలు చేయాలంటూ ఆయ‌న కూడా మంత్రుల‌కు సూచించారు.

ఇంత‌కీ, ఏపీ భాజ‌పా మంత్రులు రాజీనామాకు ఎందుకు సిద్ధ‌ప‌డ్డ‌ట్టు..? ఏపీ ప్ర‌యోజ‌నాలను ప‌ట్టించుకోని కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా టీడీపీ కేంద్ర‌మంత్రులు రాజీనామా చేస్తామంటే.. దాన్లో ప్ర‌జాప్ర‌యోజ‌నాల కోణం చాలా స్పష్టంగా ఇమిడి ఉంది. మ‌రి, ఏపీలో భాజ‌పా మంత్రులు రాజీనామాల సంసిద్ధ‌త‌కు నేప‌థ్య‌మేంటీ..? ఎవరి మీద ఆగ్రహంతో ఏం సాధించాల‌ని రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డుతున్నారు..? త‌మ పార్టీతో పొత్తు తెంచుకుంటామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టిస్తే, వెంట‌నే రాజీనామాలు చేసేస్తారు. అంటే, కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ఏపీ భాజ‌పా మంత్రులను రాజీనామాలకు ప్రేరేపిస్తున్న కార‌ణం, అంతకుమించి ఏదైనా ఉందని వారు చెప్పగలరా..? పొత్తు తెగితే ప‌ద‌వుల్లో ఉండ‌కూడ‌ద‌న్న ఒకేఒక్క ల‌క్ష్యం క‌నిపిస్తోంది. అంతేగానీ.. భాజ‌పా గుత్తాధిప‌త్యం కింద న‌లిగిపోతున్న ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు వారికి ఇప్ప‌టికీ ప‌ట్ట‌నే ప‌ట్ట‌వన్న‌మాట‌! అధిష్టానం ఏం చెబితే అది చేయాల‌న్నదే త‌ప్ప‌… ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఒక‌రిగా, సగటు తెలుగువారిగా ఆలోచించే శ‌క్తి వీరికి లేక‌పోవ‌డం శోచ‌నీయం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.