ప్రొ.నాగేశ్వర్ : కాంగ్రెస్‌తో ప్రత్యేక హోదా సాధ్యమా..?

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా నినాదాన్ని గట్టిగా వినిపించారు. తాను రాహుల్ గాంధీలా మోసం చేయబోనని… అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకహోదాను ఇవ్వకపోతే.. ఏపీ గడ్డపైనే అడుగుపెట్టబోనని శపథం చేస్తున్నారు. ప్రత్యేకహోదా అంశం ఆంధ్రప్రదేశ్‌లో సెంటిమెంట్‌గా మారింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే.. వారే ప్రత్యేకహోదా ఇస్తారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ… ప్రత్యేకహోదా ఇవ్వబోమని చెప్పేసింది. కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం ఉన్న మరో పార్టీ కాంగ్రెస్. అందుకే రాహుల్ గాంధీ గట్టిగా.. ప్రత్యేకహోదా నినాదాన్ని వినిపిస్తున్నారు.

“ప్రత్యేకహోదా”ను కాంగ్రెస్ ఎందుకు చట్టంలో పెట్టలేదు..?

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు జరుగుతున్నాయి. ఏపీలో నిరసనలు చేయడం వల్ల మాత్రం ప్రత్యేకహోదా రాదు. ప్రత్యేకహోదా ఇవ్వాల్సింది కేంద్రం. అందుకే కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా ప్రత్యేకహోదా అంశాన్ని ప్రచారాస్త్రం చేసుకుంటోంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో సమాధానం చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. విభజన చట్టం చేసినప్పుడే.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాను ఎందుకు చట్టంలో ప్రవేశ పెట్టలేదు…? చాలా మంది నిపుణులు… చట్టంలో ప్రత్యేకహోదా పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ సహా.. పార్లమెంట్‌లో ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆర్టికల్ 3 ప్రకారం..రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించుకున్న తర్వాత… ఇక విభజన ఆపడం అసాధ్యం. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా కొన్ని పార్టీలు మభ్య పెట్టాయి. అస్త్రాలున్నాయని ప్రచారం చేశారు. అసెంబ్లీలో ఆపుతాం అని.. ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఎలా ఆపుతారు..అది అభిప్రాయం మాత్రమే.. అని చెప్పినా వినిపించుకోలేదు. ఆ రోజు ప్రజల్లో ఉన్న భావోద్వేగాల ప్రకారం.. రాజ్యాంగం చెప్పినా కూడా అంగీకరించే పరిస్థితి లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ప్రకారం.. పార్లమెంట్‌లో సింపుల్ మెజార్టీతో రాష్ట్రాన్ని విభజించవచ్చు. దీన్ని సుప్రీంకోర్టులో ఆపుతామన్నారు… ఆగలేదు.

విభజన చట్టాన్ని సవరించేందుకు ఎందుకు ప్రయత్నించలేదు..?

రాజకీయ పార్టీలు.. సీమాంధ్ర ప్రజల్ని మోసం చేశాయి. ఇది ఒక్క పార్టీ అని కాదు.. అన్ని పార్టీలు ప్రజల్ని మోసం చేశాయి. ఆర్టికల్ త్రీ ప్రకారం రాష్ట్రాన్ని విభజించేటప్పుడు.. అనివార్యమైన అన్ని చర్యలు తీసుకోవచ్చు. దీనికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. అందుకే ఆ రోజే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని.. చట్టంలో ఎందుకు పెట్టలేదు..? దీనికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. అన్న పార్టీలు సమాధానం చెప్పాలి. తెలియదా..అంటే… అందరికీ తెలుసు. విశ్లేషకులు అందరూ… పదే పదే చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వం ఇప్పటికైనా.. ఈ దిశగా చర్యలు తీసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ కోసం.. తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. అదే విధంగా.. విభజన చట్టాన్ని సవరించాలని… అందులో ప్రత్యేకహోదాను పెట్టాలని.. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క పార్టీ కూడా.. డిమాండ్ చేయలేదు. పార్లమెంట్‌లో పోరాడలేదు. కనీసం ప్రస్తావించను కూడా ప్రస్తావించలేదు.

అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఎలా ఇస్తారు..?

ఇప్పటికైనా ఎంతో అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే..దీనికి కాంగ్రెస్ పార్టీనే సూత్రధారి. కానీ ఇప్పటికైనా.. ఎలా ప్రత్యేకహోదా ఇస్తారనే.. విషయాన్ని ఇస్తారు. ఎలాంటి నిర్దిష్టమైన కార్యచరణ ద్వారా..ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తారనే అంశాన్ని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించాలి. రేపు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత… వాళ్లు ఒప్పుకోలేదు.. వీళ్లు ఒప్పుకోలేదు..ఆ కమిషన్ ఒప్పుకోలేదు..ఈ కమిషన్ ఒప్పుకోలేదు.. అని సాకులు చెప్పి మోసం చేయరని గ్యారంటీ ఏమిటి..?. ప్రత్యేకహోదా గురించి మాట్లాడే ఎవరైనా.. చట్టబద్ధమైన.. రాజ్యాంగబద్ధమైన ఎలాంటి ప్రక్రియ ద్వారా ప్రత్యేకహోదా ఇస్తామంటున్నారో స్పష్టంగా ప్రకటించాలి. న్యాయనిపుణులతో కమిటీ వేస్తారా..?.. ఏ పార్టీ అయినా ఎందుకు మాట్లాడదు. మేమిస్తమని ప్రతి పార్టీ చెబుతుంది. కానీ ఎలా అమలు చేస్తారో చెప్పడం లేదు..!

ఎలా తెస్తారో ప్రజలు ప్రశ్నించాలి..!

కేంద్ర ప్రభుత్వం పధ్నాలుగో ఆర్థిక సంఘం నిబంధన మేరకు..స్పెషల్ స్టేటస్ అనే కాన్సెప్టే లేదని చెబుతోంది. లేదని చెప్పినప్పుడు… ఎందుకు… అన్ని రాజకీయ పార్టీలు ఇస్తామని ఎలా చెబుతున్నాయి…?. తీసుకొస్తామని ఎలా చెబుతున్నాయి..? ముందుగా ఈ విషయంపై రాజకీయ పార్టీలు ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎలా చేస్తామో చెప్పకుండా… చేస్తాం.. చేస్తాం అని ప్రజల్ని మభ్యపెట్టడం కరెక్ట్ కాదు. ప్రత్యేకహోదా ఎలా తీసుకొస్తారో… హామీ ఇచ్చే పార్టీల్ని కూడా ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.