వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్ ఆర్థిక వ్యవహారాల్లో వ్యూహకర్తగా వ్యవహరించి ఇప్పుడు బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి త్వరలో ఒక భారీ డిజిటల్ మీడియా సంస్థను స్థాపించబోతున్నారు. సొంతంగా ఒక డిజిటల్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాలనే ఆయన ఆలోచన వెనుక ఉన్నది కేవలం వ్యక్తిగత అవసరమే.
విజయసాయిరెడ్డి వ్యక్తిగత ట్రాక్ రికార్డు చూస్తే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఆయన ఏ-2 . క్విడ్ ప్రో కో లావాదేవీలను చక్కబెట్టడంలో, సూట్‌కేస్ కంపెనీల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు సీబీఐ చార్జిషీట్లలో స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్థాపించే మీడియా సంస్థ, సమాజానికి ఏ తరహా నిజాయితీని అందిస్తుందనేది పెద్ద ప్రశ్న. తన బంధువుల పేరిట, బినామీల పేరిట ఇప్పటికే ఒక భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించారనే ఆరోపణలు ఉన్న తరుణంలో, ఈ డిజిటల్ మీడియా ఆ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచంగా మార్చుకోనున్నారు.
గతంలో ‘సాక్షి’ మీడియాను స్థాపించినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. అవినీతి సొమ్ముతో స్థాపించిన పత్రికగా దానిపై ముద్ర పడింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో రాబోయే సంస్థ కూడా మరో ‘సాక్షి’ తరహా చీడపురుగులా మారుతుందే తప్ప, పక్షపాత రహిత వార్తలను అందిస్తుందని ఎవరూ ఆశించడం లేదు. కేవలం ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం , తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడమే లక్ష్యంగా ఈ డిజిటల్ వేదికలు పనిచేస్తాయి. నిజాయితీ లేని వ్యక్తుల చేతుల్లో మీడియా ఉంటే అది వ్యవస్థకే ప్రమాదకరం.
రాజకీయాల్లోకి రాకముందు చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉన్న విజయసాయిరెడ్డి, అంకెలను ఎలా మార్చాలో, అక్రమాలను ఎలా సక్రమం చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. ఇప్పుడు అదే నైపుణ్యాన్ని మీడియా రంగంలో కూడా ఉపయోగించి ‘ఫేక్’ ప్రచారాలకు తెరలేపుతారు. నిజమైన జర్నలిజం అనేది ప్రజల పక్షాన ఉండాలి, కానీ ఒక పార్టీ ప్రయోజనాల కోసం, ఒక వ్యక్తి అక్రమాలను సమర్థించుకోవడం కోసం పెట్టే సంస్థలు పత్రికా విలువలను మంటగలుపుతాయి. విజయసాయి లాంటి వారు మీడియాలోకి వస్తే జరిగేది అదే.


