చంద్రబాబు : కభీ మీఠా.. కభీ ఖారా…

చంద్రబాబునాయుడు బుధవారం నాడు నిప్పులు చెరిగారు. అయితే నేరుగా తన రాజకీయ ప్రత్యర్థుల మీద కాకపోయినప్పటికీ.. వారిని ఉద్దేశించి.. తన మంత్రివర్గ సహచరులతోనే మాట్లాడుతూ తీవ్రస్థాయిలో మాటలు రువ్వారు. ప్రభుత్వం ఎవ్వరికీ లోబడి పనిచేయడం అసాధ్యం.. అని చాలా స్పష్టంగా తేల్చిచెప్పారు. సంక్షేమం విషయంలో కొన్ని వర్గాల నుంచి కొందరు వ్యక్తుల విజ్ఞప్తులు, కోరికలు బాగానే ఉండవచ్చు గాక , వారి డిమాండ్లు సహేతుకమే కావచ్చు గాక.. కానీ వాటి మిష మీద ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయాలని ప్రయత్నిస్తే.. కుదరదని ఆయన చాలా విస్పష్టంగా తేల్చిచెప్పారు. ఒకవైపు కాపు వర్గం అభిమానాన్ని చూరగొనడానికి తెలుగుదేశం పార్టీ అధినేతగా తనప్రయత్నాలు కొనసాగిస్తూనే.. ఆ వర్గంలో మంచి పేరు ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని, అలాగే మందకృష్ణ మాదిగను కూడా ఉద్దేశించి.. ”వారు ప్రభుత్వాన్ని డిక్టేట్‌ చేయజాలరు..” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి అని మనం గుర్తించాలి. అలాగే సరిగ్గా ఇరవై రోజుల కిందట తన ప్రభుత్వం రాయబారుల్ని పంపి బుజ్జగించడానికి ప్రయత్నించిన ముద్రగడ పద్మనాభం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కఠినమైనవి. జగన్‌ చెబితే రాసినట్లుగా ముద్రగడ లేఖ ఉన్నదంటూ ఆయన చాలా తీవ్రమైన కామెంట్లు విసిరారు.
మొత్తానికి బుధవారం నాడు చంద్రబాబు వైఖరిని లోతుగా గమనిస్తే ఆయన ఎలాంటి శషబిషలు మొహమాటం లేకుండా  చాలా కఠినంగా మాట్లాడినట్లుగా అర్థమవుతోంది. ఒక ప్రభుత్వాధినేతకు ఇలాంటి వైఖరి చాలా అవసరం. నెగటివ్‌గా చూసినప్పుడు ఇది కఠినమైన వైఖరి అనిపిస్తుంది గానీ.. పాజిటివ్‌గా చూసినప్పుడు ఇదే దృఢమైన వైఖరి అని కూడా మనకు తెలుస్తుంది. కోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వాధినేత ఆ మాత్రం దృఢంగా ఉండడం ప్రభుత్వానికి చాలా అవసరం. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆ ముద్రగడ, మంద కృష్ణ ల గురించి కాదు గానీ అధినేత దృఢంగా లేరని అర్థమైతే.. ప్రతివాళ్లూ వచ్చి తోక జాడించే ప్రమాదం ఉంటుంది.

అయితే ఇక్కడే మనం మరో విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంది. చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబులోని నాయకత్వ పటిమ, దృఢమైన వైఖరి కేంద్రంతో వ్యవహరించేటప్పుడు, వారినుంచి నిధులను రాబట్టుకునే ప్రయత్నం జరగవలసిన సందర్భంలో ఏమైపోతున్నాయి.
అటు రైల్వే, ఇటు సాధారణ బడ్జెట్‌లలో కూడా కేంద్రం మనల్ని దారుణంగా వంచించినప్పటికీ.. చంద్రబాబునాయుడు ఇంతే పదునుగా వారిని వీసమెత్తు మాట అనలేకపోతున్నారు ఎందుకు. కేంద్రం విషయానికి వచ్చే సరికి మాత్రం.. మనం వారితో పోరాడి సాధించేది ఏమీ లేదు. వారితో మంచిగా ఉండి వీలైనంత సాధించుకోవాలి. అని ఆయన గత ఏడాదిన్నరగా చిలక పలుకులు పలుకుతూనే ఉన్నారు. కానీ ఇన్నాళ్లూ మంచిగా ఉండి ఏం సాధించారు?  హళ్లికి హళ్లి.. సున్నకు సున్న ! మంచిగా ఉండడం తప్పు అని మనం సలహా ఇవ్వక్కర్లేదు. కానీ మరీ మెతక వైఖరి కాస్తా చేతగాని తనం అని కేంద్రం భావించే పరిస్థితి కల్పించకూడదని చంద్రబాబునాయుడు తెలుసుకోవాలి. అలా కేంద్రంతో కభీ కభీ ఎక్కువ మీఠాగా ఉండడం మానుకోవాలి.

అందుకే చంద్రబాబు నాయుడు వైఖరిని గమనించినప్పుడు.. కభీ మీఠా.. కభీ ఖారా అనే అనిపిస్తుంది. ఒక రాష్ట్రానికి నాయకుడిగా నిశ్చితమైన వైఖరిని ఆయన అనుసరిస్తే తప్ప.. మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అనుకోవడం భ్రమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com