చంద్ర‌బాబుకు `తిరుమ‌ల‌` పిత‌లాట‌కం

ముఖ్య‌మంత్రి ప‌దవిలో ఉన్న‌వారికెవ‌రికైనా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధ్య‌క్ష ప‌ద‌విని భ‌ర్తీ చేయ‌డం పెద్ద స‌వాలు. ఇటీవ‌లి కాలంలో ఇది మ‌రీ కీల‌కంగా మారిపోయింది. బంధాలు-అనుబంధాల స్థాయిని నిర్ణ‌యించే ద‌శ‌కు ఎదిగింది. కొంత‌కాలం రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్ పేరు తెర పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఆయ‌న్ను స‌ముదాయించిన‌ట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేట్ చానెల్‌లో వ‌చ్చిన ఇంట‌ర్వ్యూలోనే ముర‌ళీమోహ‌న్ ఈ విష‌యాన్ని స్వ‌యంగా చెప్పారు. ఆ ప‌ద‌వి ద‌క్క‌నందునే ఆయ‌న టీడీపీతో దూరంగా ఉంటున్నారా అన్న ప్ర‌శ్న‌కు ఆ స‌మాధానం వ‌చ్చింది. అయినా ముర‌ళీమోహ‌న్ తితిదే ప‌ద‌విపై ఆశ వ‌దులుకోలేదు. దేవ‌దేవుని ఆశీస్సులుంటే ప‌ద‌వి అదే వ‌స్తుంద‌న్న ధీమాతో ఆయ‌నున్నారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఎన్టీఆర్‌, ఎఎన్నార్ త‌ర్వాత అత్యంత క్ర‌మ‌శిక్ష‌ణ‌గా మెలిగే న‌టుల్లో ముర‌ళీమోహ‌న్ పేరు ప్ర‌థ‌మ స్థానంలో నిలుస్తుది. సంస్కృతీ, సంప్ర‌దాయాల ప‌ట్ల అవ‌గాహ‌న‌, దైవ‌భ‌క్తి మెండుగా ఉన్న ఆయ‌న కంటే ఆ ప‌ద‌వికి రాజ‌కీయ రంగంలో ప్ర‌స్తుతం అర్హులు లేర‌నే చెప్ప‌చ్చు.

కొద్ది రోజుల క్రితం చంద్ర‌బాబు బావ‌మ‌రిది, ఎన్టీఆర్ కుమారుడు హ‌రికృష్ణ పేరు తెర‌పైకొచ్చింది. తితిదే చైర్మ‌న్‌గా ఆయ‌న్ను నియ‌మించ‌వ‌చ్చ‌ని వార్త‌లు సామాజిక మాధ్యమంలో చ‌క్క‌ర్లు కొట్టాయి. అది నిజ‌మా! కాదా!! అనే అంశానికి ఇంత‌వ‌ర‌కూ క్లారిటీ రాలేదు. ఇప్పుడు తాజాగా సామాజిక మాధ్య‌మం కోడై కూస్తున్న అంశమే ఆస‌క్తిక‌రంగా ఉంది. గ‌ల్ఫ్ దేశాల్లో ఉన్న ఓ జ‌ర్న‌లిస్టు పెట్టిన పోస్టు దీనికి కార‌ణం. హ‌రికృష్ణ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పంచ‌న చేర‌తాడ‌నేది దీని సారాంశం. ఇదీ రాజ‌కీయ‌పుటెత్తుగ‌డేనా అనే సందేహ‌మూ లేక‌పోలేదు. ఇలా ఓ వార్త‌ను గాలిలోకి వ‌దిలితే త‌న ప‌ని పూర్త‌వుతుంద‌ని హ‌రికృష్ణ భావించారా అనేది ఓ అనుమానం. హ‌రికృష్ణ ఈ ప‌ద‌వివై ఎందుకంత ప‌ట్టుగా ఉన్నారు? ఎందుకంటే.. చంద్ర‌బాబుకు 2019ఎన్నిక‌ల్లో నెగ్గాలంటే త‌న కుమారుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చార చేయాలి. దీనివల్ల టీడీపీకి బ‌లం పెరుగుతుంది. ప్ర‌తిప‌క్షం ఓట్ల‌ను కొంత చీల్చగ‌లిగితే టీడీపీ విజ‌యం సునాయాసమ‌వుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారనేది ఓ వాద‌న‌. 2009 ఎన్నిక‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారం వ‌ల్ల గెల‌వాల్సిన స్థానాల్లో కూడా టీడీపీ ఓడిపోయింద‌నే విశ్లేష‌ణ‌లు వచ్చిన అంశాన్ని విస్మ‌రించ‌లేరు. లోపాయ‌కారీగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు పొందుతూనే, ఈసారీ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించితే టీడీపీకి తిరుగుండ‌ద‌ని టీడీపీ మ‌ద్ద‌తుదారులు భావిస్తున్నారు. ఈ కార‌ణంగానే ఒత్తిడిపెంచితే తితిదే ప‌ద‌వి త‌న వ‌శ‌మ‌వుతుంద‌ని హ‌రికృష్ణ భావిస్తూ ఉండ‌వ‌చ్చు. అందుకే వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతాన‌నే ఫీల‌ర్లు వ‌దిలితే ప‌ని సుల‌భ‌మ‌వుతుంద‌ని భావిస్తూ ఉండ‌వ‌చ్చు. గ‌తంలో కూడా హ‌రికృష్ణ రాజ్య‌స‌భ ఎంపీ బేరంతో వైయ‌స్ జ‌గ‌న్‌ను సంప్త‌దించారనీ, కానీ విజ‌య‌సాయిరెడ్డికి ఇవ్వాల్సి ఉన్నందున త‌రువాత చూస్తాన‌న‌డంతో ఆయ‌న వెన‌క్కి త‌గ్గార‌నీ వార్త‌లొచ్చాయి.

ఇది చాలు క‌దా.. ఎవ‌రైనా ప‌ద‌వుల కోసం రాజ‌కీయ‌పుటెత్తుగ‌డ‌లు వేస్తార‌ని చెప్ప‌డానికి. కుటుంబీకుడైన‌ప్పటికీ.. హ‌రికృష్ణ కంటే.. త‌న‌ను ఎప్పటినుంచో న‌మ్ముకుని ఉన్న ముర‌ళీమోహ‌న్ వైపే చంద్ర‌బాబు మొగ్గుచూప‌డం మేలు.

-సుమ‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.