కేంద్రంపై చంద్ర‌బాబు పోరు తీరు మారింది..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీరులో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది. అదీ గ‌డ‌చిన మూడురోజులుగానే..! కేంద్రంపై ఇత‌ర టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తుంటే.. కాస్త సంయ‌మ‌నం పాటించండి అని చెప్పేవారు. తొంద‌ర‌ప‌డి ఆరోప‌ణ‌లు చెయ్యొద్ద‌నేవారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన‌వి చాలా ఉన్నాయ‌నీ, ఇలాంట‌ప్పుడు భాజ‌పాతో వైరం పెంచుకోవ‌డం స‌రికాద‌ని అనేవారు. కానీ, ఇప్పుడు ఆయ‌నే నేరుగా కేంద్రంపై విమ‌ర్శ‌ల ఘాటు పెంచుతున్నారు. ఆత్మ‌గౌర‌వాన్ని కంచ‌ప‌రిస్తే స‌హించేది లేద‌ని అంటున్నారు. ప్ర‌త్యేక హోదా వాద‌న‌ను పూర్తిస్థాయిలో వినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అనంత‌పురంలో కియా కార్ల ప‌రిశ్ర‌మకు సీఎం శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి, కేంద్రం మోసింద‌న్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్ర‌కారం ఇక‌పై ఎవ్వ‌రికీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని కేంద్రం చెప్పింద‌నీ, కాబ‌ట్టి దానికి స‌మాన‌మైన ప్ర‌తిఫ‌లం ఇస్తామ‌ని హామీ ఇచ్చింద‌న్నారు. కానీ, ఇంత‌వ‌ర‌కూ ఏమీ ఇవ్వ‌లేద‌నీ, ఇప్పుడు వేరే రాష్ట్రాల‌కు హోదా పొడిగిస్తున్నార‌నీ, అలాంట‌ప్పుడు మ‌న‌కు ఎందుకు ఇవ్వ‌రంటూ చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. హామీల సాధ‌న‌, హోదా మ‌న హ‌క్కు అనీ, దాన్ని కేంద్రం గుర్తించాల‌న్నారు. మ‌న హ‌క్కుల సాధ‌న కోసం కేంద్రాన్ని నిల‌దీయ్యాలా వద్దా, పోరాటం చేయాలా వ‌ద్దా అంటూ చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను కోరారు. హోదా విష‌య‌మై కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేక‌, కొన్ని పార్టీలు త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని కూడా చంద్ర‌బాబు అన్నారు.

మొత్తానికి, ప్ర‌త్యేక హోదా డిమాండ్ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. పేరు ఏదైతేనేం ప్ర‌యోజ‌నాలే ముఖ్యం అని చెప్తూ వ‌చ్చిన చంద్ర‌బాబు కూడా ఇప్పుడు హోదా కోసం పోరాటం అంటున్నారు. నిజానికి, కేంద్రంపై సీఎం ఇంత నేరుగా ఇటీవ‌లి కాలంలో మాట‌ల దాడి పెంచింది లేదు. ఓప‌క్క రాష్ట్ర భాజ‌పా నేత‌లు కవ్వింపు విమ‌ర్శ‌లూ ఆరోప‌ణ‌లూ ఎన్ని చేస్తున్నా.. మిత్ర‌ధ‌ర్మం పాటిస్తూ వ‌స్తున్నామ‌నే చెప్పారు. ఒక‌సారి వ‌ద్ద‌నుకుంటే త‌రువాత వేరేలా మాట్లాడ‌గ‌లం అని కూడా అన్నారు. సో.. మొత్తంగా ఈ ప‌రిస్థితి చూస్తుంటే టీడీపీ, భాజ‌పాల మ‌ధ్య పొత్తును ప్ర‌భావితం చేసే మార్గంలోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నాయి. అంతేక‌దా.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను బేఖాత‌రు చేస్తున్న భాజ‌పాతో పొత్తు కొన‌సాగితే, టీడీపీకి కూడా భ‌విష్య‌త్తులో కొంత ఇబ్బందే అవుతుంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.