హామీల‌న్ని నెర‌వేర్చేశాం… చంద్ర‌బాబు

అంద‌రూ అనుకున్న‌ట్టే ఆంధ్రా సిఎం అంటున్నారు. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి తానిచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేదు అనే మాట రాకుండా… ఆద‌రా బాద‌రా తానిచ్చిన వాటిలో ప్ర‌ధాన‌మైన హామీలకు ప‌చ్చ‌జెండా ఊపిన‌ ఆంధ్రా సిఎం… ఇంకా అవి అమ‌ల్లోకి రావ‌డం ప్ర‌శ్నార్ధ‌కంగా ఉండ‌గానే తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరిపోయాయంటూ చెప్ప‌డం షురూ చేసేశారు. అటు కాపుల‌ను బిసీల్లోకి చేర్చ‌డం,. ఇటు నిరుద్యోగ‌భృతిపై నిర్ణ‌యం… నేప‌ధ్యంలో తామిచ్చిన హామీల్లో పెండింగ్ ఏమీ లేన‌ట్టు మాట్లాడుతున్నారు.

శ‌నివారం అసెంబ్లీలో మాట్లాడిన చంద్ర‌బాబు… తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చాం అని చెప్పారు. నిజానికి కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని త‌ననెవ‌రూ అడ‌గ‌లేద‌ని అన్నారాయ‌న‌. అయిన‌ప్ప‌టికీ త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా వారి ప‌రిస్థితి చూసి, తానే బిసిల్లో చేరుస్తామ‌నే హామీ ఇచ్చాం అన్నారు. ఈ విష‌యంలో గ‌త ప్ర‌భుత్వాలు జీవోలు జారీ చేసినా అవి ఆచ‌ర‌ణ‌కు నోచుకోలేద‌న్నారు. జ‌స్టిస్ మంజునాధ క‌మిష‌న్ 4 నుంచి 5శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిందిగా సూచించింద‌ని చెప్పారు. ఇత‌ర కులాల‌కు ఇబ్బందుల్లేకుండా కాపుల‌ను బిసిల్లో చేర్చామ‌న్నారు. అలాగే అగ్ర‌వ‌ర్ణాల్లోని పేప‌ద‌ల‌కు కూడా న్యాయం చేస్తామ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

తానిచ్చిన వాటిల్లో అత్యంత ప్ర‌ధాన‌మైన హామీ ల‌ను విప‌క్షం స‌భ‌లో లేని స‌మ‌యం చూసి చ‌క్క‌బెట్టేసిన తేదేపా ప్ర‌భుత్వం… ఆ హామీలు వాస్త‌వ‌రూపం దాల్చ‌డంపై దృష్టి సారించాల్సి ఉంది. మొత్తంగా రిజ‌ర్వేష‌న్లు 50శాతం దాట‌కూడ‌ద‌నే సుప్రీం ఆదేశాలున్న ప‌రిస్థితుల్లో బాబు ప్ర‌భుత్వం ఈ రిజ‌ర్వేష‌న్లు ప‌క్కాగా అమ‌ల‌య్యేందుకు త‌గిన ప‌రిష్కార మార్గం క‌నిపెడితేనే… తామిచ్చిన హామీ నెర‌వేరిన‌ట్టు. అంతే త‌ప్ప తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసేసి కేంద్రానికి పంపించేసి ఆ త‌ర్వాత నెపాన్ని పైవారి మీద‌ నెట్టేద్దామ‌నే ఆలోచ‌న చేస్తే మాత్రం అది ఎదురు త‌న్న‌డం ఖాయం అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.