కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై ముద్ర‌గ‌డ అసంతృప్తి..!

కాపులకు ఐదుశాతం రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తూ బిల్లును చంద్రబాబు స‌ర్కారు ఆమోదించింది. దీంతో ఆ వ‌ర్గ టీడీపీ నేత‌లు ముఖ్య‌మంత్రిని ప్ర‌త్యేకంగా క‌లుసుకుని అభినంద‌న‌లు తెలిపారు. కాపుల‌ను బీసీల్లో చేర్చ‌డం ద్వారా స‌ర్వ‌త్రా ఆనందోత్సాహాలు వ్య‌క్త‌మౌతున్నాయ‌ని మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు అన్నారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీని పూర్తి చేశామ‌నే హ‌ర్షాతిరేకాలు అధికార పార్టీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మౌతుంటే… కాపు ఉద్య‌మ నేతల స్పంద‌న మ‌రోలా ఉంది! త‌మ వ‌ర్గానికి ముఖ్య‌మంత్రి ఎంతో చేస్తార‌ని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తే, కంటితుడుపు చ‌ర్య‌గా తాజా నిర్ణ‌యం ఉందంటూ కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఐదు శాతం రిజ‌ర్వేష‌న్లు త‌మ‌కు ఎన్న‌టికీ ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యం కాద‌న్నారు. పల్స్ సర్వేలో కూడా కొంతమంది అభిప్రాయాలను మాత్రమే తీసుకున్నారన్నారు. శాస‌న స‌భ‌లో హ‌డావుడిగా బిల్లు ప్ర‌వేశ‌పెట్టేసి, ఆమోదించిన మాత్రాన స‌రిపోద‌నీ, దీని వ‌ల్ల‌ కాపుల‌కు ఒరిగేది ఏముంటుంద‌ని ప్ర‌శ్నించారు. ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను తొమ్మ‌ిదో షెడ్యూల్ లో చేర్చిన‌ప్పుడే త‌మ‌కు నిజ‌మైన పండుగ అని ముద్ర‌గ‌డ అభిప్రాయ‌ప‌డ్డారు. తాజా రిజ‌ర్వేష‌న్లు కాపులు పోరాట ఫ‌లిత‌మ‌ని చెప్పారు.

ఇదే సంద‌ర్భంలో తమ ఉద్య‌మం వెన‌క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఉన్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై కూడా మాట్లాడటం విశేషం. ముఖ్య‌మంత్రి నుంచి ఏనాడైనా ఒక్క రూపాయి ఆశించిన సంద‌ర్భంగానీ, సాయం కోరిన సంద‌ర్భంగానీ ఉందా అంటూ ముద్ర‌గ‌డ ప్ర‌శ్నించారు. త‌మ ఉద్య‌మం వెన‌క జ‌గ‌న్ ఉన్నారంటూ టీడీపీ నేత‌లు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం చాలా బాధాక‌ర‌మైన విష‌యం అన్నారు. ఆనాడు, 1994లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తాను ఉద్య‌మించాన‌నీ, అప్ప‌ట్లో అసెంబ్లీలో త‌మ త‌ర‌ఫున చంద్ర‌బాబు మాట్లాడార‌నీ, తమపై జరిగిన లాఠీఛార్జీని ఖండించార‌ని గుర్తు చేశారు. అప్ప‌ట్టో మీ పార్టీ కేడ‌ర్ అంతా ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇచ్చార‌నీ, ఆరోజు అధికార కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఉద్య‌మించ‌మ‌ని త‌న‌కు చంద్ర‌బాబు చెప్పారా.. నిధులు స‌మ‌కూర్చారా అని అన్నారు. ఆనాడు మీరు మాకు నిధులు స‌మ‌కూర్చిన‌ట్ట‌యితే.. ఇప్పుడు త‌మ‌కూ జ‌గ‌న్ నిధులు ఇచ్చిన‌ట్టుగానే భావించొచ్చ‌న్నారు. ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోమ‌ని అడిగితే లేనిపోని వంక‌ల‌తో ఇత‌రుల‌ను అవ‌మానించే ప‌ని చెయ్యొద్ద‌న్నారు.

టీడీపీ స‌ర్కారు ప్ర‌క‌టించిన నిర్ణ‌యంపై ముద్ర‌గ‌డ సంతృప్తిగా లేరు. తమ వెనక జగన్ ఉన్నారన్న ఆరోపణపైనే ఆయన ప్రధానంగా మాట్లాడటం విశేషం. ఇక, ఇత‌ర కాపు సంఘాల నేత‌లు కూడా ఈ నిర్ణ‌యంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34 శాతం కాపులు ఉంటే, ఈ 5 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను ఏ విధంగా అమ‌లు చేస్తార‌నీ, ఎవ‌రికి వ‌ర్తింప‌జేస్తార‌ని కాపు నేత‌లు అంటున్నారు. ఈ నిర్ణ‌యంపై ఎవ‌రైనా కోర్టుకు వెళ్తే ప‌రిస్థితి ఏంట‌నీ, కాబ‌ట్టి దీనికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ‘తీర్మానం చేసిన వెంట‌నే కేంద్రాన్ని చంద్ర‌బాబు సంప్ర‌దించారా..? పోల‌వ‌రం ముంపు మండ‌లాల విష‌యంలో త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకునేలా కేంద్రంపై ఏ స్థాయిలో ఒత్తిడి చేశారో, ఇప్పుడూ అదే స్థాయి చొర చూపాల‌న్న‌’ది కొంత‌మంది కాపు నేత‌ల అభిప్రాయం. మొత్తంగా, ముద్రగడతోపాటు ఆ వర్గంలో కొంతమంది నేతలు కాస్త సంత్రుప్తిగా లేరనేది అర్థమౌతోంది. అయితే, ముద్రగడ తదుపరి కార్యాచరణ ఏదైనా ఉంటుందా అనే అంశంపై ఆ వర్గ నేతల నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదనే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.