ఆ స్ఫూర్తి కోస‌మే చంద్ర‌బాబు ప్ర‌య‌త్న‌మా..?

ఆంధ్రాకి కేంద్రం చేసిన అన్యాయాన్ని ఎండ‌గ‌ట్టాల‌న్న ల‌క్ష్యంతో ధ‌ర్మ‌పోరాట స‌భ‌ల‌ను టీడీపీ ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీలు అమ‌లు అనేవి ఎన్నిక‌ల ప్ర‌చారాంశాలుగా మారిపోయాయి. కాబ‌ట్టి, వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల వ‌ర‌కూ ఈ పోరాట దీక్ష‌ల‌ను కొన‌సాగించాల్సిన అవ‌స‌రముంది. ఈ క్ర‌మంలో క‌ర్నూల్లో జరిగిన ఒక స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివ్రుద్ధి, నాలుగేళ్లపాటు రాష్ట్ర అభివ్రుద్ధి కోసం కేంద్రంతో సాగించిన ప్రయత్నాలని ప్రధానంగా ప్రస్థావించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నాలెడ్జ్ ఎకాన‌మీకి ప్రాధాన్య‌త ఇచ్చాన‌నీ, తద్వారా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గ‌జ కంపెనీలు వ‌చ్చాయ‌న్నారు. ఇవ‌న్నీ త‌న కోసం చేసిన‌వి కాద‌నీ, తెలుగు జాతి కోసం చేశాన‌న్నారు.

ఒక ముఖ్య‌మంత్రిగా తాను కేంద్రంపై పోరాటం చేస్తున్నాన‌నీ, దానికి ప్ర‌ధాని బ‌దులు చెప్పాల్సి ఉంద‌న్నారు. ఇచ్చిన హామీల‌ను ఎందుకు అమలు చేయ‌డం లేద‌నేది ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన బాధ్య‌త కేంద్రానికి లేదా అంటూ ప్ర‌శ్నించారు. తాను ఢిల్లీకి వెళ్లి, రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని జాతీయ మీడియాకి వివ‌రించాక మ‌ద్ద‌తు పెరిగింద‌ని చెప్పారు. ఆంధ్రాకి కేంద్రం చేసిన అన్యాయమేంటో అందరికీ తెలిసిందన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం చేసినా చెయ్య‌క‌పోయినా ఆంధ్రా అభివృద్ధి ఆగ‌ద‌ని భ‌రోసా ఇస్తున్నా అన్నారు. ఇదే సంద‌ర్భంలో హ‌క్కుల విష‌యంలో రాజీప‌డేది లేదన్నారు.

విభ‌జ‌న హేతుబ‌ద్ధ‌త లేకుండా జ‌రిగింద‌నీ, దాంతో క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అనుభ‌వజ్ఞుడైన నాయ‌కుడి సార‌థ్యం అవ‌స‌ర‌మ‌ని ప్ర‌జ‌ల‌ను త‌న‌ను ఎన్నుకున్నారు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భాజ‌పాని తాను న‌మ్మాన‌నీ, అది త‌న త‌ప్పా అంటూ ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం నాలుగు సంవ‌త్స‌రాలు ప్ర‌య‌త్నించ‌డం త‌ప్పు అవుతుందా అని అడుగుతున్నా అన్నారు. ఢిల్లీకి 29 సార్లు వెళ్లి, ఓపిగ్గా మ‌న బాధ‌లు చెప్పుకున్నా.. మ‌న‌పై క‌నిక‌రం క‌ల‌గ‌లేదంటే.. భాజపా తీరుపై ఒక్క‌సారి ఆలోచించాల్సిన అవ‌స‌రముంద‌న్నారు.

హైద‌రాబాద్ అభివృద్ధి, విభ‌జ‌న త‌రువాత నాలుగేళ్ల ప్ర‌య‌త్నం… ఈ రెండు అంశాల‌నే ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ప్ర‌స్థావించారు. నిజానికి, ఈ రెండు అంశాల‌పైనే టీడీపీ ఎన్నిక‌ల పోరాటం కూడా ఆధార‌ప‌డి ఉంద‌ని చెప్పొచ్చు. ప్ర‌జ‌ల్లో స్ఫూర్తి నింపేందుకు వీటి ప్రాతిప‌దిక‌నే టీడీపీ ప్ర‌య‌త్నం ఉంటుంద‌నీ అనిపిస్తోంది. ఇదే స్ఫూర్తిని దాదాపు ఏడాదిపాటు కొనసాగించడమంటే.. కచ్చితంగా ఒక సవాలే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.