రాజ‌ధాని భూముల‌పై ప‌వ‌న్ కు సీఎం స‌మాధానం..!

‘రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మించ‌డానికి ల‌క్ష‌ల ఎక‌రాల్లో భూమి అవ‌స‌ర‌మా, రెండువేల ఎక‌రాల భూమి స‌రిపోతుంద‌ని ముఖ్య‌మంత్రే చెప్పారు, ఆ త‌రువాత రైతుల ద‌గ్గ‌ర ల‌క్ష‌ల ఎక‌రాలు ఎందుకు సేక‌రించారు’… జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ఇవి. స‌భ త‌రువాత కూడా ఇదే అభిప్రాయాన్ని వేర్వేరు సంద‌ర్భాల్లో వ్య‌క్తం చేశారు. దీనికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మాధానం ఇచ్చారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన రాష్ట్ర స్థాయి ఉగాది వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ముందుగా ప్ర‌త్యేక హోదా, కేంద్రం తీరుపై ఆయ‌న స్పందించారు.

భాజ‌పా కూడా యుద్ధం చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తోంద‌నీ, ఇంత‌కీ వారు యుద్ధం చేయాల‌నుకుంటున్న‌ది రాష్ట్రం మీదా, తెలుగు జాతి మీదా అంటూ మండిప‌డ్డారు. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌తోపాటు న్యాయ‌బ‌ద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన ప్ర‌యోజ‌నాలు ద‌క్కే వ‌ర‌కూ టీడీపీ పోరాటం ఆగ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే నాడు భాజ‌పాతో పొత్తు పెట్టుకున్నామ‌నీ, కానీ ఇప్పుడు వారు రాష్ట్రంలో త‌మిళ‌నాడు త‌ర‌హా రాజ‌కీయాలు చేసేందుకు చూస్తున్నార‌ని ఆరోపించారు. కొంత‌మంది ఇదే సంద‌ర్భంలో కేంద్రానికి వ‌త్తాసు ప‌లుకుతూ త‌మ కేసుల నుంచి విముక్తి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ వైకాపా మీద ఆరోప‌ణ‌లు చేశారు. తాను ఎక్క‌డా భేష‌జాల‌కు పోకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, కానీ మ‌న ఆత్మ గౌర‌వాన్ని కించ‌ప‌ర‌చే విధంగా కేంద్రం తీరు ఉంటోంద‌న్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లకు ప‌రోక్షంగా స‌మాధానం ఇస్తూ… రాజ‌ధాని నిర్మాణానికి ఇన్ని ఎక‌రాల భూములు ఎందుకు అని కొంత‌మంది ప్ర‌శ్నిస్తున్నారు అన్నారు. ప్ర‌పంచంలో గొప్ప‌గొప్ప న‌గ‌రాలు ఆకాశంలో లేవ‌ని అన్నారు. ప్ర‌స్తుతం తాత్కాలిక స‌చివాల‌యం నిర్మించామ‌నీ, అది స‌రిపోతుంది అనుకుంటే ఇక క‌ట్ట‌డాల‌తో ప‌నేముంటుందని చెప్పారు. కానీ, ముంబై, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు త‌ర‌హాలో ఆంధ్రుల‌కు కూడా ఆ స్థాయి రాజ‌ధాని న‌గ‌రం ఉండాలో లేదో ఆలోచించాల‌ని ప‌రోక్షంగా ప‌వ‌న్ కు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒక్క పిలుపుతో స్వ‌చ్ఛందంగా రైతులు ముందుకొచ్చి 33 వేల ఎక‌రాలు భూమిని రాజ‌ధాని కోసం ఇచ్చార‌ని చెప్పారు. ఇదీ ప‌వ‌న్ కు సీఎం ఇచ్చిన స‌మాధానం. అయితే, ఇప్ప‌టికీ ప‌వ‌న్ వాద‌న ఏంటంటే… ముందుగా ఒక మోడ‌ల్ నిర్మించి, దాన్ని ప్ర‌జ‌ల‌కు చూపించి, ఆ త‌రువాత ఎంతైనా విస్త‌రిస్తే బాగుంటుంది క‌దా అని అంటారు, అదెలా సాధ్యం..? ముందుగా మోడ‌ల్ నిర్మాణం అంటే ఏంటో మ‌రి..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.