చి.ల.సౌ… అన్న‌పూర్ణ‌కు లాభ‌సాటి వ్యాపారం

న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తిన సినిమా… `చిలసౌ`. సుశాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంపై నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఎవ‌రికీ ఎలాంటి అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే అన్న‌పూర్ణ స్డూడియోస్ చేతికి ఈ సినిమా వెళ్లిందో.. అప్పుడే ఈసినిమాకి ప్ర‌మోష‌న్ ల‌భించింది. సినిమా చూసిన చైతూ.. `మా సంస్థ నుంచి విడుద‌ల చేస్తాం` అని మాట ఇవ్వ‌డ‌మే కాకుండా… రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో అన్న‌పూర్ణ స్డూడియోస్ బ్యాన‌ర్‌పై రెండు సినిమాలు చేయ‌డానికి ఎగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడు. అలా… `చిల‌సౌ` ప్ర‌మోష‌న్ల‌కు కాస్త బ్యాగేజీ వ‌చ్చిన‌ట్టైంది. అయితే ఈ సినిమాని అన్న‌పూర్ణ వాళ్లేం కొన‌లేదు. జ‌స్ట్ ప్ర‌చారం చేసి, అమ్మిపెడ‌తారంతే. అందులో అన్న‌పూర్ణ స్డూడియోస్‌కి వాటా ఇవ్వాలి.

ఆ వాటా ఎంత‌న్న‌ది తేలిపోయినా… అంకె ఎంత‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు. ముందు నిర్మాత‌ని సేఫ్ జోన్‌లో చేర్చ‌డ‌మే ల‌క్ష్యం కాబ‌ట్టి.. లాభాలొచ్చాకే వాటాలెంత‌న్న‌ది తేలుతుంది. అయితే టేకొవ‌ర్ చేసుకున్న ద‌గ్గ‌ర్నుంచి ప్ర‌మోష‌న్ల ఖ‌ర్చు మొత్తం అన్న‌పూర్ణ సంస్థే చూసుకోనుంది. ఈరోజుల్లో చిన్న సినిమాకి కాస్త ప్రచారం చేసుకోగ‌లిగితే, స‌ద‌రు సినిమా బాగుంటే.. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వ‌చ్చినా… తొలి రెండు రోజుల్లోనే పెట్టుబ‌డి మొత్తం తిరిగొస్తుంది. ఓవ‌ర్సీస్‌లో క్లీన్ అండ్ నీట్ సినిమాల‌కు ఆద‌ర‌ణ ఎక్కువ‌. అక్క‌డ కూడా మంచి వ‌సూళ్లే ద‌క్కే అవ‌కాశాలుంటాయి. అక్కినేని ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగిపోయి ప్ర‌మోష‌న్ చేస్తుంది కాబ‌ట్టి… ఓపెనింగ్స్ బాగుండే అవ‌కాశాలున్నాయి. ఎలా చూసినా… అన్న‌పూర్ణ‌కు ఇది లాభ‌సాటి వ్యాపార‌మే. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కూడా ఇంతే క‌దా? చిన్న సినిమాల్ని టేకొవ‌ర్ చేసుకొని, కావ‌ల్సినంత ప్ర‌చారం చేసి, ఆ లాభాల్లో వాటా ద‌క్కించుకొంటోంది. ఇప్పుడు అన్న‌పూర్ణ కూడా అదే బాట‌లో వెళ్తోందన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.