కోబ్రా వలకు చిక్కిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

కోబ్రాపోస్ట్ తాజాగా మరోసారి మీడియా ఛానెల్స్ పై పడింది. డబ్బులిస్తే చాలు, ఇచ్చినవారి రాజకీయ డిమాండ్ కు అనుకూలంగా, విలువల్ని పక్కనపెట్టి మీడియాలో కథనాలు ప్రసారం చేసేందుకు, ప్రచురించేందుకు సిద్ధమౌతున్న సంస్థల గుట్టురట్టు చేస్తోంది. ‘ఆపరేషన్ 136’ పేరుతో ఇప్పటికే కొన్ని ఛానెల్స్ బండారం బయటపెట్టింది. ఏడు టీవీ ఛానెల్స్, ఆరు పత్రికలు, మూడు వెబ్ పోర్టల్స్ తోపాటు ఒక ఏజెన్సీని తొలివిడతగా బయటపెట్టింది. ఇప్పుడు రెండో విడత ‘ఆపరేషన్ 136’లో అదే తరహా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ కోబ్రా పోస్ట్ వలకి చిక్కింది. డిమాండ్లకు అనుగుణంగా ఎలాంటి కథనాలనైనా ప్రసారం చేస్తామంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మార్కెటింగ్ ఛీఫ్ మేనేజర్ ఈ వీ శశిధర్ ఓపెన్ అయిపోయారు.

కోబ్రాపోస్ట్ రిపోర్టర్ శశిధర్ ని కలవగానే.. ఆ పత్రికకు ఉన్న రాజకీయ సంబంధాల గురించి ఆయన మాట్లాడారు. తమకు కాంగ్రెస్, భాజపాలతో సంబంధాలున్నాయనీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో మరింత సాన్నిహిత్యం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రసారాల ఈవెంట్ రైట్స్ తమవే అని మాట్లాడారు. ఛానెల్ నుంచి సాంకేతికంగా ఏపీ ప్రభుత్వానికి కావాల్సిన సపోర్ట్ చేస్తుంటామన్నారు. ఆ తరువాత, కోబ్రాపోస్ట్ రిపోర్టర్ అసలు విషయానికి వచ్చారు. ఎవ్వరినీ ఉద్దేశపూర్వకంగా కించపరచాలన్న ఉద్దేశం కాదుగానీ, ఒక సెటైర్ లాంటివి కావాలని అడిగారు. పప్పు బ్రాండిగ్ కంటిన్యూ కావాలనీ, దాని ద్వారా తమ రాజకీయ లబ్ధి ఉందని రిపోర్టర్ ఎరవేశారు. అలాంటి పొలిటికల్ సెటైర్ కార్టూన్లు తమ దగ్గర ఉన్నాయనేశారు శశిధర్. స్టోరీ బోర్డీ లాంటివి క్రియేట్ చేస్తామనీ, ఇలాంటి చాలా బాగా ప్రెజెంట్ చేయగలమన్నారు. పప్పు పేరుతో ఏదైనా క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

రెండో దశలో రాజకీయ ప్రత్యర్థులపై సున్నితంగా విరుచుకుపడాలనీ, ఆ తరువాత మూడో దశలో దుమ్మెత్తిపోయాల్సి ఉంటుందనీ, ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతూ ఉంటాయి కాబట్టి.. అని రిపోర్టర్ అడగ్గానే ఓకే అంటూ తలాడించారు. అంతేకాదు, ఫండ్స్ ఏవిధంగా వస్తాయీ, ఏదైనా ఇష్యూ అయితే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా పేరు బయటకి రాకుండా వ్యవహరించాలనీ, తమ రాజకీయ ప్రత్యర్థులు, తమ లక్ష్యాలను అనుగుణంగా కథనాలు వేయాలంటూ జరిపిన బేరసారాలకు ఏబీఎన్ మార్కెటింగ్ మేనేజర్ ఓకే ఓకే అంటూ చెప్పడం విశేషం. అంతేకాదు, ఈ క్రమంలో మరోసారి రాజకీయ సంబంధాలను ఊటంకిస్తూ… వెంకయ్య నాయుడు తమ ఎండీకి క్లోజ్ అనీ, ఒకే సామాజిక వర్గమని చెప్పారు. గతంలో తమ ఛానెల్ ని బ్యాన్ చేసినా ఇక్కడ తట్టుకుని నిలబడిందన్నారు. సంఘటన్ పేరును ఎక్కడా రానీయకుండా చూసుకుంటామని అండర్ కవర్ లో ఉన్న కోబ్రాపోస్ట్ ప్రతినిధికి భరోసా ఇచ్చారు.

డబ్బు కోసం సిద్ధాంతాలనూ, విలువల్నీ పక్కన పడేయడానికి మరో మీడియా సంస్థ కూడా సిద్ధంగా ఉందంటూ, ఇదిగో సాక్ష్యం అంటూ కోబ్రాపోస్ట్ ఈ కథనాన్ని వెలుగులోకి తెచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com