రెబెల్స్ బుజ్జ‌గింపులు @ పార్క్ హాయ‌త్‌..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ హ‌డావుడి తార‌స్థాయికి చేరుకున్న త‌రుణ‌మిది..! టిక్కెట్లు రానివారంతా క‌వ్వింపు చ‌ర్య‌లు దిగుతున్నారు. చివ‌రికి సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి లాంటివారిని కూడా పార్టీ ప‌క్క‌న పెట్టిన ప‌రిస్థితి. అసంతృప్తుల్లో చాలామంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగుతామంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో హుటాహుటిని వీరంద‌రినీ బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం రంగంలోకి దిగింది. శ‌నివారం రాత్రి మొద‌లైన ఈ బుజ్జ‌గింపులు ఆదివారం కూడా ఉంటాయ‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ లోని హోట‌ల్ పార్క్ హాయ‌త్ ఈ బుజ్జగింపుల‌కు వేదిక‌గా మారింది.

ఈ బుజ్జ‌గింపుల క‌మిటీలో ముగ్గురు కీల‌క నేత‌లున్నారు. పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, క‌ర్ణాట‌క మంత్రి డీకే శివ‌కుమార్‌, యానాం నుంచి కృష్ణారావు… ఈ ముగ్గురూ క‌మిటీ స‌భ్యులు. రెబెల్స్, స్వ‌తంత్రంగా బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మౌతున్న అభ్య‌ర్థుల‌కు సంబంధించిన ఒక జాబితాతో వీరు ప‌ని మొదలుపెట్టిన‌ట్టు స‌మాచారం! అసంతృప్తులంద‌రినీ పార్క్ హాయ‌త్ కి ర‌మ్మంటూ ఆహ్వానించార‌ని తెలుస్తోంది. ఈ ముగ్గురు నేత‌లూ ఒక్కో అసంతృప్త నాయ‌కుడితో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌బోతున్నారు. ఇప్ప‌టికే జిల్లాల వారీగా జాబితాలో ఉన్న నేత‌ల‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్టుగా కూడా తెలుస్తోంది. శ‌నివారం రాత్రి మూడు జిల్లాల‌ అసంతృప్త నాయ‌కుల‌తో భేటీ జరిగిన‌ట్టు తెలుస్తోంది. మిగ‌తావారితో ఆదివారం భేటీలు కొన‌సాగుతాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఈ త‌రుణంలో రాష్ట్ర నేత‌లు రంగంలోకి దిగితే స‌మ‌స్య ప‌రిష్కారం ఉండ‌ద‌నీ, అందుకే ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌వారిని రంగంలోకి దించితే బుజ్జ‌గింపులు సాఫీగా జ‌రుగుతాయ‌నేది పార్టీ వ్యూహంగా క‌నిపిస్తోంది. పార్టీలో భ‌విష్య‌త్తుపై న‌మ్మ‌కం ఇవ్వ‌డం, వివిధ మార్గాల ద్వారా ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌నే భ‌రోసా క‌ల్పించడం… ఇలాంటి హామీల ద్వారా రెబెల్స్, స్వ‌తంత్రుల‌ను పోటీ నుంచి విర‌మింప‌జేసే ప్ర‌య‌త్నం ఈ క‌మిటీ చేయ‌బోతోంది. ఇంకోటి… ఈ అసంతృప్త నాయ‌కుల‌ను ఆయా నియోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్థుల‌తో మాట్లాడించి, రెబెల్స్ ను కూడా క‌లుపుకుని ప్రచారంలో ముందుకు సాగే వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌న్న‌ది ఈ క‌మిటీ ల‌క్ష్యం. చివ‌రి ద‌శ బుజ్జ‌గింపులు ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తాయో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com