ఎడిటర్స్ కామెంట్ : ప్రజాస్వామ్యమా ? పన్ను స్వామ్యమా ?

” Collecting more taxes than is absolutely necessary is legalized robbery…” అంటే అవసరమైన దానికంటే ఎక్కువ పన్నులు వసూలు చేయడం చట్టబద్ధమైన దోపిడీ. అమెరికాకు 30వ అధ్యక్షుడు అయిన కాల్విన్ కూలిడ్జ్ చెప్పిన మాట ఇది. శతాబ్దం కింద చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆ మాట సజీవంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ చట్టబద్ధమైన దోపిడీకి హద్దూ..పొద్దూ లేకుండా పోతోంది. ప్రజలు ఉన్నది పన్నులు కట్టడానికే.. తాము కట్టించుకోవడానికే అన్నట్లుగా ప్రభుత్వాలు చెలరేగిపోతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్‌లో ఇది ఇప్పుడు వెర్రి తలలు వేస్తోంది. జీఎస్టీ సంస్కరణలు తీసుకు వచ్చిన తర్వాత ఇది మరీ వెర్రి తలలు వేస్తోంది. సగటు జీవి కష్టపడే సంపాదనలో సగం వరకూ పన్నుల రూపంలో వసూలు చేసేస్తున్నారు. మిగిలిన సగంతోనే జనం గడపాల్సి వస్తోంది.

జీఎస్టీ గండంలో ఇరుక్కున్న సామాన్యుడు !

” మేం తినే ప్రతి భోజనంలో కొంత నిర్మలా సీతారామన్ తింటున్నట్లుగా ఉందని ” సోషల్ మీడియాలో కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. కేంద్రం ఇటీవల పెంచిన జీఎస్టీ పన్నుల గురించి లెక్క లేనన్ని సెటైర్లు వేస్తున్నారు. పెరుగు మీద కూడా ఐదు శాతం టాక్స్ విధించారు. అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరితే పన్నెండు శాతం టాక్స్ కట్టాలి. చివరికి శ్మశానాల సేవలపైనా పద్దెనిమిది శాతం పన్ను వేశారు. ఇవి తాజా పన్నుల విధింపులు.. పెంపులు. ప్రజలు ఏడ్వలేక నవ్వుతూ సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రజలను ఎందుకు పిండుకోవాలనుకుంటుందనేది ఎక్కువ మంది ఆవేదన చెందుతున్నమాట. నిజానికి ఇదే మొదటి ట్యాక్స్ అయితే వారు ఆందోళన చెందేవారు కాదేమో. కానీ ఇది మొదటిది కాదు.. అలాగని చిట్టచివరిదీ కాదు. ఇంకా ఎన్ని వాతలుంటాయో.. ఎలాంటి వాటి మీద ఉంటాయో చెప్పడం కష్టం. కానీ మధ్య తరగతి జీవి మాత్రం ఈ పన్నుల చక్రబంధంలో ఇరుక్కుని నలిగిపోతున్నాడు.

సంపాదిస్తే ఆదాయపు పన్ను.. ఖర్చు పెడితే జీఎస్టీ… పెట్రోల్, డిజిల్ టాక్సులు ఎక్స్ ట్రా !

దేశంలో ఇన్‌కంట్యాక్స్ కట్టే వాళ్లు తక్కువగా ఉన్నారని ప్రభుత్వం బాధపడిపోతూ ఉంటుంది. నిజంగా ఇన్ కంట్యాక్స్ కట్టేవాడంటే.. ప్రభుత్వానికి దేవుడే. ఎందుకంటే అతని దగ్గర పన్నుల మీద పన్నులు వసూలు చేస్తారు. ఓ మధ్య తరగతి జీవి రూ. ఐదు లక్షల జీతం వచ్చిందనుకుంటోంది. అందులో రెండున్నర లక్షలకు పన్నేస్తారు. ఎంత ఆదాయం పెరిగితే అంత శ్లాబ్ పెరుగుతుంది. పొరపాటున పది లక్షలు సంపాదించుకున్నారంటే అది ముఫ్పై శాతం అవుతుంది. అంత మేర ఆదాయపు పన్ను శాలరీ నుంచే కట్ చేసుకుని కేంద్రం తీసేసుకుంటుంది. హమ్మయ్య.. పన్ను కట్టేశా ఇక మిగిలిన డబ్బులతో ఎవరికీ పన్నులు కట్టకుండా గడపొచ్చనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదు. అసలు పన్నుపోటు ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఏ వస్తువు కొన్నా ఇప్పుడు జీఎస్టీ ఉంది. జీఎస్టీ లేని వస్తువంటూ లేదు. ఒక వేల బిల్లు వేయని దగ్గర కొన్నా.. ఆ వస్తువులో జీఎస్టీ పన్ను కూడా కలిపేసి ఉంటుంది. అంటే… సంపాదించుకున్నదానికి పన్ను కట్టడమే కాకుండా.. ఖర్చు పెడుతున్న ప్రతీ దానికి పన్నులు కట్టాలన్నమాట. తినే తిండి దగ్గర్నుంచి ప్రతీ దానికి పన్ను కట్టాలి. అంతేనా.. ఇంకా బల్క్‌గా ప్రజల్ని దోచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పన్నులు ఉండనే ఉన్నాయి. దీనికి జీఎస్టీలో చోటు లేదు. అంటే విడిగా పన్నులు బాదేస్తారన్నమాట. దీని ద్వారా కేంద్రానికి ఏటా మూడు, నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే ప్రజల సంపద ఎంతగా పీల్చుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదాయపు పన్ను కట్టి.. బయట ఏం కొన్నాజీఎస్టీలు కట్టి.. చివరికి అరవై శాతం పన్నులు కట్టి పెట్రోల్, డీజిల్ లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పోనీ అంతటితో ఆ విషాదం ఆగిపోతుందా.. అంటే… ఆ పన్నులు పిండుకున్నదంతా కేంద్రమే. ఇంకా రాష్ట్రాలు.. స్థానిక సంస్థలు ఉండనే ఉన్నాయి. మనకు తెలియకుండానే మనం వేలకు వేలు పన్నుల రూపంలో చెల్లిస్తూ పోతూండాలి. ఆ సైకిల్ ఎక్కడ అంత మవుతుందో తెలియదు. కానీ ఎంత కట్టినా.. మీరు ఫలనా పన్ను బాకీ ఉన్నారని సమాచారం రావడం మాత్రం ఖాయం.

రాష్ట్రాల్లో మరింత పన్ను దోపిడి !

కేంద్రం ఒక్కటే ఇలా పన్నులు వసూలు చేస్తుందనుకుంటే కాస్త బెటరే అనుకోవచ్చు. కానీ రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకూ ఎన్ని రూపాల్లో మధ్యతరగతి జీవి మీద పన్నుల పేరుతో దాడి జరుగుతుందో అంచనా వేస్తే విరక్తి పుట్టడం సహజం. రాష్ట్రాలు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. పెట్రోల్, డిజిల్‌పై అదనపు భారం వేయడమే కాకుండా మద్యం ధరలతో మధ్య తరగతి జీవితాలను పేదరికంలోకి నింపేస్తోంది. ఒక్కో ప్రభుత్వం రూ. ముఫ్పైవేల కోట్ల ఆదాయాన్ని మీద ఆశిస్తోందంటే… ప్రజల ఆదాయాన్ని ఎలా పీలుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాలే కాదు.. ఇక స్థానిక సంస్థలూ పిండేస్తాయి. ఆ పన్ను.. ఈ పన్ను అని నెల నెలా వసూళ్లకు దిగుతాయి. ఏపీ లాంటిరాష్ట్రాల్లో చెత్తపన్ను విధించారు. కట్టకపోతే ఇంటి ముందు చెత్త పోస్తామన్న హెచ్చరికలు కూడా చేశారు. ఎలాగైనా సరే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అంటే కేంద్రం నుంచి ప్రారంభించి .. మున్సిపాలిటీలు.. పంచాయతీల వరకూ అన్ని చోట్ల పన్నులు పిండుకుంటున్నారు.

లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు.. అదంతా ప్రజల సొమ్మే !

కేంద్రానికి ఆదాయపు పన్ను.. పరిశ్రమల మీద పన్నులు.. వ్యాపారసంస్థల మీద పన్నులు ఇలా అన్నీ వచ్చేది కాక జీఎస్టీ ద్వారా నెలకు రూ. రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చే చాన్స్ ఉంది. ఇంకా నెలకు రెండులక్షల కోట్ల స్థాయిదాటలేదు కానీ.. నేడో రేపో చేరుకునే అవకాశం ఉంది. ఇంకా పెట్రోల్, డీజిల్ మీద ఆదాయం నెలకు రూ. ముఫ్పై వేల కోట్లకుపైగానే ఉంటుంది. ఇన్‌కంట్యాక్స్ సహా వివిధరకాల పన్నుల మీద ఇంకా భారీగా వసూలవుతుంది. రాష్ట్రాలు కూడా పోటాపోటీగా పన్నులువసూలు చేస్తున్నాయి. ఇంత ఆదాయాన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నది సగటు మానవుడి ప్రశ్న. లక్షల కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి చేరుతున్నాయి. కానీ ప్రజలకు ఎంత చేరుతుంది..? అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ అదంతా ప్రజలు కష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్మే. ఈ దేశంలో పుట్టినందుకు పాలకులకు కట్టాల్సి వస్తోంది.

పన్నులన్నీ ఏం చేస్తున్నారు ? పని చేయని వాళ్లకు కొంత.. దోపిడీకి కొంత..!

ఇన్ని లక్షల కోట్ల పన్నులు ప్రజల ఆదాయం నుంచి లాగేసుకుంటున్న ప్రభుత్వాలు ఆ సొమ్మును ఏం చేస్తున్నాయి. ఇప్పుడు దేశంలో కనీసం పది శాతం మందికైనా ఉచిత విద్య..వైద్యం అందిస్తున్నాయా..?. అందించే విద్య అయినా కాస్త క్వాలిటీగా ఉంటుందా.. తప్పని సరిగా చేయాలన్నట్లుగా చేస్తోంది కానీ ప్రభుత్వం బాధ్యతగా పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. అదే సమయంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తమ సొంత సొమ్ములా ఖర్చు చేసేస్తున్నాయి. అత్యంత నిరుపేదలను ప్రభుత్వాలు కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాయి. అత్యంత ధనికులు.. రాజకీయ పార్టీల ఆర్థిక అవసరాలకు ఖజానాలాగా ఉపయోగపడుతూ… తమ ఖజానాను నింపుకుంటున్నాయి. కానీ మధ్య తరగతి జీవులు మాత్రమే.. ఎటూ కాకుండా పోయారు. ఇరవై నాలుగు గంటలు కష్టపడటం… వారి సంపాదన నుంచి ప్రభుత్వానికి ఆదాయం అందించడం.. తప్ప వారికి మరో వ్యాపకం లేకుండా పోయింది. ఓ మాదిరి సంపాదన పరుడైతే చాలు ప్రభుత్వానికి పండగే. . ఇంత చేసినా వారి పట్ల ప్రభుత్వాల కనీస బాధ్యతగా ప్రవర్తిస్తున్నాయా అన్నది సందేహం. అలాంటి బాధ్యత ఉంటే నిత్యావసర వస్తువల ధరలను అయినా అందుబాటులో ఉంచేవారు. కనీసం ఉంచడానికి ప్రయత్నించేవారు. కానీ పెట్రోల్, డీజిల్ నుంచి ఏడాదికి రూ. మూడు లక్షల కోట్లను పిండుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలు… వాటి ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి జీవనం భారం అవుతుందనే ఆలోచనను మాత్రం చేయడం లేదు. పన్నుల్లో దేశాభివృద్ధికి ఖర్చు పెడుతున్నదెంత అంటే.. చెప్పడం కష్టం.

పన్నులు పిండుకోవడంలో అందరూ అందరే !

జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు. వారి ఆమోదంతోనే పన్నులు పెంచుతారు. కానీ కేంద్రం వసూలు చేస్తుంది కాబట్టి నింద కేంద్రం మీద పడుతుంది. విచిత్రంగా కొన్ని రాష్ట్రాలు కూడా జీఎస్టీ పెంపును వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తాయి. కానీ ఆయా రాష్ట్రాలు పన్నులు తగ్గించవు. పెట్రోల్, డీజిల్ అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు.. రూపాయి తగ్గించడానికి సాధ్యం కాదని ప్రకటనలు చేస్తూ ఉంటాయి. ఇందులో తప్పు వాళ్లదీ వీళ్లదని కాదు. అందరూ ప్రజల సొమ్మును దోపిడి చేస్తున్నవారే. చాలా దేశాల్లో ఇలా పన్నుల మీద పన్నులు పిండుకోవడం అనేది ఉండదు. ఉంటే జీఎస్టీ ఉంటుంది లేకపోతే.. ఆదాయపు పన్ను ఉంటుంది. రెండింటిలో ఏదో ఒక్కటి మాత్రమే వూలు చేస్తారు. అది కూడా పక్కాగా వసూలు చేసుకుంటారు. బాధ్యతగా ఖర్చు పెడతారు. అలాంటి వ్యవస్థలు ఉన్న చోట్ల పన్నులు కాస్త ఎక్కువైనా కట్టి ప్రజలు సంతోషంగా ఉంటారు. కానీ ఇండియా లాంటి పన్ను స్వామ్యం దేశాల్లో పరిస్థితి పన్నులు కట్టుకోవడానికే ప్రజలు బతుకుతున్నట్లుగా మారిపోతోంది.

ప్రజలే చైతన్యవంతులు కావాలి !

దేశం.. రాష్ట్రాలు అప్పులు చేసి.. రాజకీయ అవసరాల కోసం సంక్షేమ పథకాలు పెట్టి డబ్బులు పంచి పెట్టి.. ఓట్లు వేయించుకుని సహజ వనరుల్ని దోపిడీ చేసి తమకు తాము పాలకులు ధనవంతులవుతున్నారు. కానీ ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం రాను రాను పడిపోతున్నాయి. సంపాదనలో అత్యధిక భాగం పన్నులు కట్టుకోవాల్సి వస్తోంది. రాష్ట్రాలు.. కేంద్రం చేసే అప్పులకూ ప్రజలే పన్నుల రూపంలో కట్టాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా.. తాము నిలువు దోపిడి అవుతున్న విషయం ప్రజలకు స్పష్టత లేదు. అంతగా అవగాహన రాలేదు. మా బతుకింతే అని పేదలు రాజీ పడిపోతున్నారు. ఆలోచించే తీరిక లేకుండా కష్టపడి మధ్యతరగతి ప్రజలు పన్నులు కడుతున్నారు. పాలకవర్గాలతో సన్నిహితంగా ఉన్న వారు మరింత ధనవంతులైపోతున్నారు. ఈ అంతరాలు ఇలా పెరిగిపోతే జరిగేది దేశాభివృద్ధి కాదు.. వినాశనం. ఆ విషయాన్ని సంకుచిత మనస్థత్వం కలిగిన పాలకులు అర్థం చేసుకోడం కష్టం. ప్రజలు అలాంటి వారిని ఆదరించినంత కాలం ఈ పన్నుపోట్లు తప్పవు. ప్రజలు కట్టే పన్నులతో రాజకీయ ఖర్చులు చేసుకోవడం ఆగదు. మనమింతే.. మన పాలకులూ ఇంతే !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close