మోడీ ప్రభావం హిందీ రాష్ట్రాల్లో తగ్గలేదా..?

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వంద సీట్లు తగ్గుతాయంటూ…ఎన్నికలకు ముందు ఉన్న అంచనాలన్నింటినీ…జాతీయ మీడియా చానళ్లు తోసిపుచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా.. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని.. ఫలితాలు ప్రకటించాయి. బీజేపీ విజయంలో ఈ సారి హిందీ బెల్ట్ రాష్ట్రాలే కీలకంగా మారాయని చెబుతున్నాయి.

హిందీ బెల్ట్‌లో 2014 నాటి ప్రభంజనం ఉందా..?

ఐదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ… రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్‌లలో అధికారాన్ని కోల్పోయింది. కర్ణాటకలోనూ… అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అదే సమయంలో.. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమి.. సవాల్ విసిరింది. ఇలాంటి సమయంలో బీజేపీకి చిక్కులు తప్పవని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఎగ్జిట్ పోల్స్… దేశ ప్రజలకు ఓ రకంగా.. షాక్ ఇచ్చాయనే చెప్పుకోవాలి. ఐదు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన… మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో కూడా… బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

బీజేపీకి ఎన్నో మైనస్‌లు ఉన్నా… ఈ ఫలితాలు ఎలా సాధ్యం..?

2014లో మోదీ.. ప్రభంజనం కనిపించింది. ఆయన గుజరాత్ మోడల్ అభివృద్ధి.. ఇచ్చిన హామీలు… ప్రజలందర్నీ… ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది వారికి మోదీ తమ బతుకులు మార్చడానికి వచ్చిన నేతగా భావించారు. దానికి తగ్గట్లుగానే ఫలితాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్ ఘడ్ లాంటి… 95 శాతానికిపైగా విజయం సాధించింది. ఈ సారి కూడా.. ఎగ్జిట్ పోల్స్.. అంతే మొత్తానికి బీజేపీకి సీట్లు వస్తాయని అంచనా వేశాయి. యూపీలో..చాలా ఎగ్జిట్ పోల్స్.. లెక్కలు.. బీజేపీకే అధిక సీట్లు ఇచ్చాయి. ఎస్పీ – బీఎస్పీ కూటమి.. ఉపఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. బీజేపీ కంచుకోటలు కూడా కాపాడుకోలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం.. బీజేపీ ఘన విజయాలు ఖాయమని…నేషనల్ మీడియా చెబుతోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్‌లలోనూ.. బీజేపీకి అధిక సీట్లు వస్తాయని.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నారు. అదీ కూడా.. 2014లో వచ్చినట్లుగా.. క్లీన్ స్వీప్ అన్నట్లుగా ప్రకటిస్తున్నారు.

జాతీయ మీడియా బీజేపీ అదుపాజ్ఞల్లో ఉందో లేదో 23న తేలుతుందా..?

బీజేపీ బూమ్ ఉన్న 2014లో.. కర్ణాటకలో బీజేపీకి కేవలం 17 సీట్లు మాత్రమే వచ్చాయి. ఐదేళ్ల పాలనలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో.. అదీ కూడా… జేడీఎస్ – కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తున్న సమయంలో కూడా… గతం కన్నా.. ఎక్కువగా… ఇరవైకిపైగా వస్తాయని.. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం… అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి ఒక్కటంటే.. ఒక్క సీటు వచ్చిన ఒడిషాలో.. ఈ సారి పదికిపైగా సీట్లు వస్తాయని.. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తమిళనాడులోనూ…డీఎంకే కూటమి .. భారీగా సీట్లు సాధిస్తుందని అంచనా వేసినప్పటికీ.. బీజేపీ కూటమికి కూడా.. రెండంకెల సీట్లు వస్తాయని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం ఆశ్చర్యకమే. గత రెండేళ్ల నుంచి జరిగిన ఏ ఎన్నికలోనూ… బీజేపీ ఘన విజయం సాధించిన దాఖలాల్లేవు. కానీ వివిధ టీవీ చానళ్లు ఎగ్జిట్ పోల్స్ మాత్రం 2014 నాటి ఫలితాలను బీజేపీ సాధిస్తుందన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. జాతీయ మీడియా మొత్తం బీజేపీ చెప్పుచేతుల్లో ఉందని..కొన్ని రోజులు గా..విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఫలితాల తర్వాత అది నిజమో కాదో తేలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com