2026 సంవత్సరం భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైనదిగా మారబోతోంది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క అసోంలో మాత్రమే అధికారంలో ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో బలం అంతంత మాత్రంగానే ఉంది. కానీ కూటములతో అయినా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో మైనర్ భాగస్వామిగానే ప్రభావంలేకుండా ఉంది.
ప్రాంతీయ పార్టీల బలానికి సవాల్
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ తన పట్టు నిలుపుకోవాలని చూస్తుున్నారు. తమిళనాడులో డిఎంకే మరోసారి అధికారం చేపట్టడానికి తమకు తిరుగులేదని అనుకుంటోంది. అయితే ఏఐఏడీఎంకే ,టీవీకే గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. బీజేపీతో పొత్తుతో అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం మూడో ప్రత్యామ్నాయంగా దూసుకురావడం సమీకరణాలను మారుస్తోంది. కేరళలో ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి.. స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలతో అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకుంది. అస్సాంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది.
జాతీయ పార్టీలకు సవాల్
బీజేపీకి ఈ ఎన్నికలు దక్షిణాదిలో , తూర్పు భారత్లో తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఒక పరీక్ష వంటివి. అసోంలో గెలుపు ఆ పార్టీకి అత్యంత కీలకం. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి కేరళ, అసోంలలో పుంజుకోవడం అనివార్యం. 2025లో ఎదురుదెబ్బలను తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ 2026 ఫలితాలు కాంగ్రెస్ ఉనికికి, కూటమిలో దాని బేరసారాల శక్తికి ప్రాధాన్యతనిస్తాయి. ముఖ్యంగా కేరళలో యూడీఎఫ్ గెలవడం కాంగ్రెస్కు అత్యవసరం. తమిళనాడులో డీఎంకేతో జత కట్టి అధికార కూటమిలో ఉన్నామని అనిపించుకుంటోంది. మరోసారి అధికారం చేపట్టేలా స్టాలిన్ కు ఎంతో కొంత సహకారం అందించాల్సి ఉంటుంది.
కూటముల సమీకరణాలు
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బెంగాల్లో టీఎంసీ, కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదరకపోవడం, తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ బంధం వంటివి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతాయి. ఒకవేళ ప్రాంతీయ పార్టీలు బలంగా నిలబడితే, కేంద్రంలోని బీజేపీపై ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో బీజేపీ గనుక అస్సాంను కాపాడుకుని, బెంగాల్లో మెరుగుపడితే అది ఆ పార్టీకి పెద్ద బూస్ట్ అవుతుంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కేవలం స్థానిక నాయకత్వాలను ఎన్నుకోవడమే కాదు, 2029 సార్వత్రిక ఎన్నికలకు ఒక దిక్సూచిలా పనిచేయనున్నాయి. అందుకే ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు చాలా కీలకంగా మారాయి.
