భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ గురించి హోం మంత్రికే తెలీదా ?

గ‌డ‌చిన వారం రోజులుగా హైద‌రాబాద్ లో ఒక‌టే హ‌డావుడి! రోడ్ల‌న్నీ చ‌క‌చ‌కా బాగు చేసేస్తున్నారు. న‌గ‌రాన్ని యుద్ధ ప్రాతిప‌దిక సుంద‌రీక‌రించేస్తున్నారు. బిచ్చ‌గాళ్లు క‌నిపించ‌కూడ‌దంటూ ఆదేశాలు జారీ చేశారు. గోల్కొండ ప్రాంతంలో దోమ‌ల‌పై యుద్ధం ప్ర‌క‌టించారు! ఈ నెల 28 నుంచి మూడురోజుల‌పాటు న‌గ‌రంలో గ్లోబ‌ల్ ఎంట్ర‌ప్రిన్యువ‌ర్ స‌మిట్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇలా చెప్ప‌డం కంటే… ఇవాంకా వ‌స్తున్నార‌ని చెబితేనే అంద‌రికీ ఈజీగా అర్థ‌మౌతుంది! నిజంగానే, ఈ ఏర్పాట్ల‌న్నీ స‌మిట్ పేరుతో జ‌రుగుతున్నా, ఇవాంకా ట్రంప్ ప‌ర్య‌ట‌న అన్న‌దే ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇంకోప‌క్క భ‌ద్ర‌తా ఏర్పాట్లు భారీ ఎత్తున జ‌రుగుతున్నాయి. న‌గ‌రంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికే కొన్ని ఆంక్ష‌లు అమ‌ల్లోకి వచ్చేస్తున్నాయి. గోల్కొండ ప్రాంతంలో దుకాణాలు మూసేస్తున్నారు. విచిత్రం ఏంటంటే… న‌గ‌రంలో ఇంత జ‌రుగుతున్నా వీటిపై రాష్ట్ర హోంమంత్రికి స‌రైన అవ‌గాహ‌న‌ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. స‌మాచారం లేక‌పోతే లేక‌పోవ‌చ్చు… ఆ విష‌యాన్ని ఆయ‌నే బ‌య‌ట‌పెట్ట‌డాన్ని ఏమ‌నుకోవాలి?

ఇవాంకా ట్రంప్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు ఎలా ఉన్నాయ‌ని హోంమంత్రి నాయ‌ని న‌ర్సింహారెడ్డిని ప్ర‌శ్నిస్తే.. మ‌న‌కు తెల్వ‌దు అని స‌మాధానం ఇచ్చారు. యానంగ వ‌స్తందో యానంగ పోతందో తెల్వ‌దనీ, అంతా అమెరికా నుంచి వ‌చ్చిన‌వాళ్ల చేతుల్లోనే ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అమెరికా వాళ్లు ఇప్పటికే న‌గ‌రానికి వ‌చ్చేశార‌నీ, అంతా వాళ్లే చూసుకుంటున్నార‌నీ, మ‌న‌కేం తెల్వ‌ద‌ని నాయ‌ని అన్నారు.

గ్లోబ‌ల్ స‌మిట్ అనేది చిన్న కార్య‌క్ర‌మం కాదు క‌దా! ఈ మూడు రోజులూ ప్ర‌పంచ‌దేశాల ఫోక‌స్ అంతా ఇక్క‌డే ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా ఇవాంకా రాక‌తో అంత‌ర్జాతీయ మీడియా కూడా ఈ స‌ద‌స్సుపైనే ప్ర‌త్యేకంగా దృష్టి పెడుతుంది. ఇలాంటి కార్య‌క్ర‌మం గురించి రాష్ట్ర హోంమంత్రికి స‌రైన అవ‌గాహ‌న లేదంటే ఏమ‌నుకోవాలి..? భ‌ద్ర‌తా ఏర్పాట్లు గురించి అడిగితే మ‌న‌కు తెల్వ‌ద‌ని ఆయ‌న చెబితే ఎలా అర్థం చేసుకోవాలి..? అంటే, ఆయ‌న‌కు స‌రైన స‌మాచారం ఇవ్వ‌కుండా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారా అనే అభిప్రాయం కూడా క‌లుగుతుంది క‌దా. ఒక‌వేళ‌, వాస్త‌వ ప‌రిస్థితి అదే అయినా… క‌నీసం నాలుగు ప‌డిక‌ట్టు ప‌దాలైనా మాట్లాడేసినా స‌రిపోయేది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నాం, పోలీసు శాఖ వారితో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాం… ఇలాంటి మాట‌లు చెప్పేసినా స‌రిపోయేది! అంతేకానీ, మ‌న‌కు తెల్వ‌దు అన‌డం నాయ‌ని నిస్స‌హాయ‌త‌ను వ్య‌క్తం చేస్తున్న‌ట్టుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com