మోడీ, షరీఫ్ ముచ్చట్లతో మళ్ళీ శాంతి చర్చలు మొదలవుతాయా?

భారత్, పాక్ దేశాల మధ్య సంబంధాలగురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మూడడుగులు ముందుకి ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగుతుంటాయి. అయినా పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. గమ్మతయిన విషయం ఏమిటంటే అందుకు పాక్ కూడా ఎప్పుడూ సానుకూలంగానే స్పందిస్తుంటుంది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంటే, మరోవైపు సరిహద్దులలో పాక్ దళాల కాల్పులు, భారత్ పై ఉగ్రవాదుల దాడులు, కాశ్మీర్ వేర్పాటువాదులతో పాక్ చర్చలు సమాంతరంగా సాగిస్తుంది. దానితో కధ మళ్ళీ మొదటికి వస్తుంటుంది. అయినా భారత్ తన ప్రయత్నాలు మానుకోదు. అలాగే పాకిస్తాన్ కూడా భారత్ ప్రయత్నాలను కాదనకుండా శాంతి చర్చలకి సిద్దం అవుతోంటుంది.

వాతావరణ మార్పులపై పారిస్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరయిన ప్రధాని నరేంద్ర మోడి, ఆ సమావేశానికి వచ్చిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎదురయినప్పుడు ఆప్యాయంగా పలకరించి కాసేపు ఆయనతో మాట్లాడారు. వారి ఫోటోని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాశ్‌స్వరూప్ వెంటనే ట్వీటర్ లో పెట్టారు. వారిరువురూ దేని గురించి మాట్లాడుకొన్నారో తెలియదు కానీ వారి ఆ చిన్నపాటి సమావేశానికి భారత్ చాలా ప్రాధాన్యత ఇస్తోందని పాకిస్తాన్ కి సూచిస్తున్నట్లు భావించవచ్చును.

ఈ ఏడాది జూలై నెలలో వారిరువురూ రష్యాలో జరిగిన ఒక సమావేశంలో కలిసారు. అప్పుడు వారిరువురు మధ్య జరిగిన సమావేశం కారణంగా మళ్ళీ రెండు దేశాల సరిహద్దు దళాల ఇన్-చార్జ్ ల మధ్య సమావేశం జరిగింది. ఆ తరువాత ఆగస్ట్ నెలలో రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో జరగవలసిన చర్చలకు ముందు కాశ్మీర్ వేర్పాటువాదులతో మాట్లాడితీరాల్సిందేనని పాకిస్తాన్ మొండి పట్టుపట్టడంతో చర్చలు రద్దయ్యాయి.

ఆ తరువాత అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి, తమ దేశంలో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. అప్పుడు భారత్ కూడా ధీటుగా స్పందిస్తూ “పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ దే! దానిని పాక్ హస్తాల నుండి విడిపించడమే తమ లక్ష్యం!” అని భారత్ ప్రకటించింది. “అటువంటి ప్రయత్నం ఏదయినా చేసినట్లయితే భారత్ పై అణుబాంబు ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని” పాక్ ఆర్మీ జనరల్ హెచ్చరించారు. ఈ పరిణామాలన్నీ భారత్-పాక్ దేశాల సంబంధాలను కోలుకోలేని విధంగా దెబ్బ తీశాయి.

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పారిస్ లో సమావేశానికి బయలుదేరే ముందు “భారత్ తో బేషరతుగా చర్చలకు సిద్దం!” అని ప్రకటించడంతో, ప్రధాని నరేంద్ర మోడి ఆయనతో మాట్లాడారు. బహుశః త్వరలో మళ్ళీ ఇరుదేశాల మధ్య ఏదో ఒక స్థాయిలో చర్చలు మొదలవవచ్చును. అప్పుడు మళ్ళీ ఏదో ఒక ఘటన జరగగానే అర్ధాంతరంగా చర్చలు నిలిచిపోవచ్చును. గత ఐదారు దశాబ్దాలుగా ఇదే సాగుతోంది. ఇక ముందు ఇలాగే సాగవచ్చును. కానీ ఆ చిన్న ప్రయత్నం వలన ఇరు దేశాల మధ్య మరో యుద్ధం జరగకుండా నివారించబడుతోంది లేదా మరో యుద్ధం మరికొంత కాలం వాయిదా వేయబడుతోంది. అందుకే చర్చలు ఫలించకపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com