తాడేపల్లి ప్యాలెస్ గోడల మధ్య ఇప్పుడు నిశ్శబ్దం కంటే అనుమానాల హోరే ఎక్కువగా వినిపిస్తోంది. ఒకప్పుడు అధికారం వెలుగులతో కళకళలాడిన ఆ ప్రాంగణంలో, ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ కారణం ఒక్కటే.. మనలో ఉన్న ఆ కోవర్టు ఎవరు అన్న ప్రశ్నే. అవును, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుసగా వేస్తున్న సెల్ఫ్ గోల్స్ వెనుక ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కి చెందిన ఒక శక్తివంతమైన కోవర్టు ఉన్నాడనే అనుమానం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కోటరీని పట్టి పీడిస్తోంది. ఆ అదృశ్య హస్తం ఎవరో తేల్చకపోతే పార్టీ ఉనికికే ప్రమాదమని భావిస్తున్న తరుణంలో, తాడేపల్లిలో ఒక భారీ సెర్చింగ్ ఆపరేషన్ మొదలైందని చెబుతున్నారు.
నమ్మకానికి తూట్లు పొడుస్తున్నదెవరు?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ అంటేనే మాట తప్పను.. మడమ తిప్పను . కానీ, ఏడేళ్లుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో జగన్ అనుసరించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. 2014లో అమరావతికి మద్దతు పలికి, 2019 ఎన్నికల ముందు కూడా అదే స్టాండ్ మీద ఉండి, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల మంత్రం పఠించడం.. ఇప్పుడు మళ్లీ మావిగన్ అనడం వెనుక ఎవరి సలహాలు ఉన్నాయి.. ఐదు కోట్ల మంది సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న అంశంలో ఇంతటి గందరగోళం సృష్టించడం వల్ల వైసీపీకి భారీ నష్టం జరిగిందని పార్టీ అభిమానులే వాపోతున్నారు.
సెల్ఫ్ గోల్స్ వెనుక మాస్టర్ మైండ్?
తాజాగా తెరపైకి వచ్చిన మావిగన్ ప్రతిపాదన వైసీపీని మరింత ఆత్మరక్షణలో పడేసింది. రాజధాని విషయంలో ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించాల్సింది పోయి, పదే పదే కొత్త ప్రతిపాదనలతో పార్టీ ఇమేజ్ను దెబ్బతీయడం వెనుక ఒక పథకం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. జగన్ చుట్టూ ఉన్న అతి కొద్దిమంది సభ్యుల కోటరీ ఇచ్చే సలహాలే ఆయనను ప్రజలకు దూరం చేస్తున్నాయా.. ఆ కోటరీలోనే టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరించే కోవర్టులు ఎవరైనా చొరబడ్డారా అనే ప్రశ్న ఇప్పుడు తాడేపల్లిలో చర్చనీయాంశంగా మారింది. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం చివరికి చంద్రబాబు నాయుడుకే రాజకీయంగా ప్లస్ పాయింట్ అవుతుండటం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తోంది.
కోవర్టు కోసం వేట – సస్పెన్స్ పీక్స్!
ప్రస్తుతం వైసీపీలో ఒక రహస్య విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జగన్ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న స్క్రిప్టును ఎవరు సిద్ధం చేస్తున్నారనేది ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అమరావతి వంటి సెన్సిటివ్ ఇష్యూలో పార్టీని ఇరుకున పెట్టేలా గైడ్ చేసిన వ్యక్తులపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ కోవర్టును పట్టుకోకపోతే 2029 నాటికి పార్టీకి మిగిలేది శూన్యమేనని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పార్టీలో కోవర్టుల వేట సాగుతుంటే, మరోవైపు వైసీపీ వీరాభిమానులు అయోమయంలో మునిగిపోయారు. తమ నాయకుడు తీసుకునే నిర్ణయాలు ఎందుకు ఇలా రివర్స్ అవుతున్నాయో అర్థం కాక వారు సతమతమవుతున్నారు.
