శత్రువు కళ్లు గప్పి రహస్యంగా చేయాల్సిన యుద్ధ ప్రణాళికలు, ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికా నిఘా వర్గాల చేతుల్లో నుంచే జారిపోతున్నాయి. వారి ప్లాన్లు అసలు చేయక ముందే ఇరాన్ కు చేరిపోతున్నాయి. అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడంలో పెంటగాన్ విఫలమైంది. టెలిగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు బహిర్గమయ్యాయి.
టెలిగ్రామ్ లీకులతో భారీగా నష్టం
టెలిగ్రామ్ లీక్ ఉదంతం ఇజ్రాయెల్ వ్యూహాలను తలకిందులు చేసింది. అమెరికా నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఈ రహస్య పత్రాలు మిడిల్ ఈస్ట్ స్పెక్టేటర్ అనే టెలిగ్రామ్ ఛానల్లో ప్రత్యక్షమవ్వడం అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యానికి పరాకాష్టగా నిలిచింది. ఈ లీక్ అయిన పత్రాలలో ఇజ్రాయెల్ తన వైమానిక దళాన్ని ఏ విధంగా సిద్ధం చేస్తోంది, ఏయే రకమైన క్షిపణులను ఉపయోగిస్తోంది, ఇరాన్‌పై దాడికి ఏ స్థాయిలో రిహార్సల్స్ నిర్వహిస్తోందనే వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా రాక్స్, హారిజన్ వంటి అధునాతన లాంగ్ రేంజ్ క్షిపణుల గురించి సమాచారం బయటకు రావడం ఇజ్రాయెల్ సైన్యానికి శరాఘాతమైంది.
ఇరాన్‌కు పక్కా సమాచారం
ఇరాన్ యొక్క గగనతలం లోపలికి వెళ్లకుండానే, సుదూరం నుంచి దాడి చేయగల ఇజ్రాయెల్ సామర్థ్యాన్ని ఈ పత్రాలు బట్టబయలు చేశాయి. శత్రువుకి తమ యుద్ధ నీతి తెలిసిపోవడంతో ఇజ్రాయెల్ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను అప్పటికప్పుడు సవరించుకోవాల్సి వచ్చింది. ఈ ఉదంతం అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల మధ్య విశ్వసనీయతపై కూడా నీలినీడలు కమ్ముకునేలా చేసింది. ఇజ్రాయెల్ చేసే ప్రతి చిన్న కదలికను అమెరికా ఉపగ్రహాల ద్వారా నిశితంగా గమనిస్తోందని ఈ పత్రాల ద్వారా స్పష్టమైంది. తమ మిత్రదేశమే తమపై గూఢచర్యం చేస్తోందా అన్న అనుమానాలు ఇజ్రాయెల్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ పత్రాలు కావాలని లీక్ అయ్యాయా లేదా హ్యాకింగ్ వల్ల బయటకు వచ్చాయా అన్న కోణంలో అమెరికా ఎఫ్.బి.ఐ దర్యాప్తు జరుపుతోంది. దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం, ఒక ఇంటెలిజెన్స్ అధికారి ద్వారానే ఈ సమాచారం బయటకు వెళ్లినట్లు అనుమానాలు బలపడుతున్నాయి.
యుద్ధ రహస్యాలు ఇంతా ఈజీగా లీక్ అవుతాయా?
సాధారణంగా ఇలాంటి పత్రాలు టాప్ సీక్రెట్ కేటగిరీలో ఉంటాయి, వీటిని మిత్రదేశాల కూటమి అయిన ఫైవ్ ఐస్ తప్ప వేరే ఎవరూ చూడకూడదు. కానీ, ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల ఎన్నో ప్లాన్లు మార్చుకోవాల్సి వచ్చింది. ఆధునిక కాలంలో యుద్ధం కేవలం యుద్ధభూమిలో మాత్రమే కాదు, డిజిటల్ స్క్రీన్ల మీద కూడా జరుగుతుందని ఈ లీక్ నిరూపించింది. అత్యంత శక్తివంతమైన దేశాలు కూడా ఒక చిన్న సోషల్ మీడియా యాప్ వల్ల ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ ఉదంతం హెచ్చరిస్తోంది.
