తెగ‌తెంపులు దిశ‌గా అడుగులేస్తున్న భాజ‌పా..!

సీఐఐ భాగస్వామ్య వేదిక‌గా భాజపా నేత‌ల మాట‌ల్లో తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది..! టీడీపీ విషయంలో ఆ పార్టీ వ్యూహం ఏంటనేది కూడా అర్థమౌతోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దేశాభివృద్ధి కోసం ఆలోచిస్తున్నార‌నీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రం కోసం 24 గంట‌లు క‌ష్ట‌ప‌డుతున్నారనీ, ఏపీలో ఏ కార్య‌క్ర‌మ‌మైనా కేంద్ర రాష్ట్రాల సంయుక్త శ్ర‌మ‌కు ఫ‌లితం అనేట్టు గతంలో మాట్లాడేవారు. కానీ, సీఐఐ స‌ద‌స్సులో భాజ‌పా అధ్య‌క్షుడు హ‌రిబాబు ఈసారి అలా మాట్లాడ‌లేదు! పేరుపేరునా ఒక్కో మీడియా సంస్థ‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఇదంతా కేంద్రం చొర‌వ‌, భాజ‌పా చొర‌వ అని మాత్ర‌మే చెప్పారు. దీన్లో రాష్ట్రం చేసిందేం లేద‌నీ అన్నారు. రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు రావాలంటే హోదా ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని, స‌రైన వ‌స‌తులు ఉంటే వ‌స్తాయ‌ని హ‌రిబాబు చెప్పారు. కేంద్రం ప‌దేళ్ల‌లో చేయాల్సిన‌వ‌న్నీ మూడేళ్ల‌లోనే చేసి చూపింద‌నీ, ప‌రిస్థితి ఇలా ఉంటే ఆందోళ‌న‌లు ఎందుక‌ని ప్ర‌శ్నించారు..! కేంద్ర‌మంత్రుల చొర‌వ వ‌ల్ల‌నే ఆంధ్రాకి ప్ర‌ముఖ సంస్థ‌లు వ‌స్తున్నాయ‌న్నారు. సో… ఇదండీ హ‌రిబాబు వ‌రస‌!

అయితే, మీడియాతో ఆఫ్ ద రికార్డ్ గా ఎమ్మెల్సీ మాధ‌వ్ మాట్లాడుతూ కొన్ని కీల‌క‌మైన అంశాలు చెప్పారు. మార్చి నెల‌లో భాజ‌పా కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. అదేంట‌నేది అప్పుడే తెలుస్తుంద‌న్నారు. టీడీపీ కేంద్ర‌మంత్రులు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేస్తార‌నీ, ఆ త‌రువాత తాము చేయాల్సింది చేస్తామ‌ని అన్నారు. ఏపీ విష‌యంలో భాజ‌పా స్ప‌ష్టంగానే ఉంద‌నీ, అందుకే ఏపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. కాబట్టే టీడీపీపై ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా ఎమ్మెల్సీ సోము వీర్రాజును కేంద్రం వారించ‌డం లేద‌న్న‌ట్టు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

అంతేకాదు, రాయ‌ల‌సీమ‌లో రెండో రాజ‌ధాని ఉండాలీ ప్రత్యేక నిధులు కేటాయించాలనే డిమాండ్లు ఎందుకు తెర‌మీదికి తెస్తున్నార‌న్న అంశంపై కూడా ఆఫ్ ద రికార్డ్ గానే మాధ‌వ్ అస‌లు విష‌యం చెప్పేశారు! జ‌ర‌గాల్సిన‌వ‌న్నీ జరుగుతాయి, అధిష్టానం వ్యూహం ప్ర‌కార‌మే జ‌రుగుతాయ‌న్న‌ట్టుగా ఆయ‌న చెప్ప‌డం విశేషం. టీడీపీతో తెగ‌తెంపుల‌కు భాజ‌పా ఉవ్విళ్లూరుతోంద‌న్న‌ది రానురానూ స్ప‌ష్ట‌మౌతున్న విష‌యం. రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కూ జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం చొర‌వే అని హ‌రిబాబు చెప్ప‌డం, దాన్లో రాష్ట్ర ప్ర‌భుత్వ కృషీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాన్ని మాట‌వ‌ర‌స‌కైనా ప్ర‌స్థావించ‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఇదే స‌మ‌యంలో, రాజ‌కీయంగా భాజ‌పా ఏం చేయ‌బోతోందో అనే లీకులు ఎమ్మెల్సీ మాధ‌వ్ మాట‌ల్లో స్ప‌ష్టంగానే ఉన్నాయి. సో.. మార్చి 5 త‌రువాత జ‌రిగే పార్ల‌మెంటు స‌మావేశాల్లో కూడా ఆంధ్రాకు సంబంధించి అద్భుతాలు జ‌రిగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.