గ‌వ‌ర్న‌ర్ మాట‌ల్లో అప్ప‌గింతల‌ ధోరణి..?

గ‌వ‌ర్న‌ర్ గా న‌ర‌సింహ‌న్ ప‌దేళ్ల ప‌ద‌వీ కాలం ముగిసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ఉద్య‌మం మాంచి పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ఆంధ్రాకి వ‌చ్చారు. ఆ త‌రువాత‌, రాష్ట్ర ఏర్పాటు.. కేంద్రంలో భాజ‌పా స‌ర్కారు అధికారంలోకి రావ‌డం జ‌రిగాయి. భాజ‌పా స‌ర్కారుతో కూడా ఆయ‌న స‌త్సంబంధాలు కొనసాగిస్తూ వ‌చ్చారు. అయితే, ఈ నెల‌తో ఆయ‌న రెండో ద‌ఫా ప‌ద‌వీ కాలం ముగిసింది. కానీ, ఆయ‌న్ని కొన‌సాగిస్తార‌న్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ మ‌ధ్య ఢిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్ కూడా పుష్ప‌గుచ్చంతో గ‌వ‌ర్న‌ర్ ను క‌లుసుకోవ‌డంతో న‌ర‌సింహ‌న్ కొన‌సాగింపు ఖాయ‌మైన‌ట్టే అన్న‌ట్టుగా క‌థ‌నాలొచ్చాయి.

అయితే, తాజాగా గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు తీరు చూస్తుంటే… వీడ్కోలుకు సిద్ధ‌మౌతున్న‌ట్టుగానే అనిపిస్తోంది. స‌హ‌జంగానే ఆయ‌న మీడియాకు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌రు. ఏది మాట్లాడినా ప్రెస్ మీట్ల‌లోనే త‌ప్ప‌, ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌కు దూరంగా ఉంటారు. అయితే, రెండో ద‌ఫా ప‌ద‌వీ కాలం పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఇప్పుడు వ‌రుస పెట్టి ప్ర‌ముఖ ప‌త్రిక‌ల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ప‌దేళ్ల ప‌ద‌వీ కాలం అనుభ‌వాల్ని పంచుకున్నారు. తెలంగాణ ఉద్య‌మం ముగిసిన అధ్యాయం అన్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌లిసి ముందుకు సాగాల‌నీ, అభివృద్ధిలో పోటీ ప‌డాల‌ని ఆకాంక్షించారు. ఇద్ద‌రు చంద్రులూ దార్శినికుల‌నీ.. ప్ర‌జ‌ల‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించ‌గ‌ల స‌త్తా ఉన్నవార‌ని కొనియాడారు. త‌న‌కు రెండు ప్ర‌భుత్వాలూ అధికారులూ పోలీసులూ ప్ర‌జ‌లూ ఎంతో చేదోడువాదోడుగా నిలిచార‌న్నారు.

న‌ర‌సింహ‌న్ మాట‌ల్లో అప్ప‌గింత‌ల స్వ‌రం ధ్వ‌నిస్తోంది. ఎందుకంటే, ముందెన్నడూ లేని విధంగా త‌న ప‌దేళ్ల ప‌ద‌వీ కాలం గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అనే అనుమానం క‌లుగుతోంది. దీంతో న‌ర‌సింహ‌న్ కొన‌సాగింపు తాత్కాలిక‌మేనా అనిపిస్తోంది. ఈ అభిప్రాయానికి బ‌లం చేకూర్చే వాద‌న కూడా వినిపిస్తోంది! న‌ర‌సింహ‌న్ కు మోడీ స‌ర్కారుతో కూడా మంచి సంబంధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే క‌దా! న‌ర‌సింహ‌న్ కు అత్యంత స‌న్నిహితుడైన అజిత్ ధోవ‌ల్ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా ఉన్నారు. సో.. ఆయ‌న ద్వారా ఉప రాష్ట్రప‌తి రేసులో న‌ర‌సింహ‌న్ నిలిచే అవ‌కాశం ఉంద‌నే క‌థ‌నం కూడా ఇప్పుడిప్పుడే ప్ర‌చారంలోకి వ‌స్తోంది. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల‌కు విడివిడిగా ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్టూ చెబుతున్నారు.

సో.. ఇవ‌న్నీ చూస్తుంటే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కొన‌సాగింపు తాత్కాలికం అనిపిస్తోంది. రొటీన్ కి భిన్నంగా వివిధ మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం, కాంట్రోవ‌ర్సీకి అవ‌కాశం లేకుండా ఇద్ద‌రు చంద్రుల గురించీ మాట్లాడం, తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు గురించి ఆకాంక్షిస్తున్న తీరు… ఇవ‌న్నీ వీడ్కోలు వ‌చ‌నాల్లేనే వినిపిస్తున్నాయి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com