ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అక్ర‌మ నిర్మాణాలు ఇప్పుడే క‌నిపిస్తున్నాయా..?

విజ‌య‌వాడలో గ‌త చంద్ర‌బాబు స‌ర్కారు నిర్మించిన‌ ప్ర‌జావేదిక కూల్చివేత‌పై స్పందించారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌ని ప్ర‌దేశం అంటూ మ‌న‌దేశంలో లేద‌ని వ్యాఖ్యానించారు! పెద్దా చిన్నా అని తేడా లేకుండా నిబంధ‌న‌లు ఉల్లంఘించే అంద‌రిపైనా స‌మానంగా చ‌ర్య‌లుండాల‌న్నారు. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత అనేది ఒక్క ప్ర‌జావేదిక‌కే ప‌రిమితం కాకుండా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్న అన్ని నిర్మాణాల‌ను కూల్చిన‌ప్పుడే ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధిపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌న్నారు. అనుమ‌తుల్లేకుండా చాలా భ‌వ‌నాలున్నాయ‌నీ, అవి ఎవ‌రికి చెందిన‌వి అనే అంశంతో ప్ర‌మేయం లేకుండా చ‌ర్య‌లు ఉంటే బాగుంటుంద‌న్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. స‌రిగ్గా రెండ్రోజుల కింద‌ట జ‌రిగిన ప్రెస్ మీట్ లో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇదే మాట చెప్పారు.

ఇప్పుడు ప్ర‌భుత్వం కూల్చ‌డం మొద‌లుపెట్ట‌గానే అదే స‌రైన చ‌ర్య అంటూ స‌మ‌ర్థిస్తున్న పార్టీలన్నీ ఇంత‌క‌ముందు ఇవే అక్ర‌మ నిర్మాణాల‌పై ఎందుకు స్పందించ‌లేదు? ఎందుకు నాటి ప్ర‌భుత్వాల ముందు ఇలాంటి వాద‌న‌లు వినిపించ‌లేదు? జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్ కూడా దీనికి అతీతం కాదు! గ‌త టీడీపీ స‌ర్కారు హ‌యాంలో రాజ‌ధాని భూముల కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ పోరాటం చేశారు. అక్ర‌మంగా రైతుల ద‌గ్గ‌ర్నుంచీ లాక్కుంటే చూస్తూ ఊరుకోన‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. బ‌లవంతంగా లాక్కుంటే యుద్ధ‌మే అన్నారు. ఆ త‌రువాత‌, చాలా స‌మ‌స్య‌ల గురించి అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి చ‌ర్చించారు.

ఆ సంద‌ర్భాల్లో ఎప్పుడూ క‌ర‌క‌ట్ట నిర్మాణాలు అక్ర‌మ‌మ‌ని జ‌న‌సేన గుర్తించ‌లేదే..? పోనీ, ఈ విష‌యాన్ని ఇప్పుడే ఎవరో కొత్త‌గా క‌నిపెట్టారా అంటే… అదీ లేదు! చంద్ర‌బాబు నాయుడు క‌ట్టిన ద‌గ్గ‌ర్నుంచీ అంద‌రూ చూస్తున్న‌దే. క‌ర‌క‌ట్ట నిర్మాణాలు ఎన్నోయేళ్లుగా క‌నిపిస్తున్న‌వే. నాడు ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా వైకాపా సీఎం నివాసం అక్ర‌మ నిర్మాణ‌మంటూ చాలా విమ‌ర్శ‌లు చేస్తూనే వ‌చ్చింది. జ‌న‌సేన కూడా అప్ప‌ట్లోనే ఇదే అంశంపై స్పందించి ఉంటే బాగుండేది. కానీ, ఇప్పుడు… దేశంలో ఎక్క‌డ చూసినా అక్ర‌మ నిర్మాణాలే అంటూ ప‌వ‌న్ జ‌న‌ర‌లైజ్ చేసి వ్యాఖ్యానిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న వీటిపై ఏదో ఒక పోరాట‌మో నిర‌స‌నో ధ‌ర్నా లాంటిది చేసుంటే, ఇప్పుడీ స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నా కొంత అర్థ‌వంతంగా వినిపించేదేమో క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com