భాజ‌పాతో క‌లిసి చంద్ర‌బాబుపై కుట్రను ఒప్పుకున్నట్టా..?

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పోరాటం చేస్తుంటే, అదే కేంద్రంతో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వైకాపా పాకులాడుతోంద‌న‌డానికి ఇది మ‌రో ఉదాహ‌రణ‌. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లూ వాయిదా అనంత‌రం వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నేను ప్ర‌ధాన‌మంత్రిని క‌లుస్తాను, మంత్రుల‌ని క‌లుస్తాను. ఏమైనా చేసే హ‌క్కు నాకు ఉంద’న్నారు. చంద్ర‌బాబు అవినీతికి పాల్ప‌డుతున్నార‌నీ, దాని గురించే ప్ర‌ధానిని క‌లుస్తున్నాన‌ని చెప్పారు. కేంద్రం నుంచి తెచ్చిన రూ. 1. 25 ల‌క్ష‌ల కోట్లు ఏమ‌య్యాయనీ, రాష్ట్రం నుంచి ప‌న్నుల రూపేణా వ‌చ్చిన రాబ‌డిని కూడా ఆయ‌న‌ జేబులో వేసుకున్నార‌ని ఆరోపించారు. హ‌వాలా ద్వారా విదేశాల‌కు డ‌బ్బు త‌ర‌లించార‌నీ, ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లాను అని చెప్పారు. చంద్ర‌బాబును బోనులోకి ఎక్కించే వ‌ర‌కూ, ఆయ‌న‌పై విచార‌ణ ఆదేశించి, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేవర‌కూ తాము చేయాల్సింది చేస్తామ‌ని విజ‌య‌సాయి రెడ్డి చెప్పారు.

ఓప‌క్క రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే తాము అహ‌ర్నిశ‌లూ పోరాటాలు చేస్తున్నామ‌ని చెప్పే వైకాపా నేత‌లు, ఢిల్లీలో కూర్చుని చేస్తున్న కుట్ర ఇద‌న్న‌మాట‌..! ఒక‌వేళ నిజంగానే చంద్ర‌బాబు అవినీతిపై ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్ర‌యించాలి. సీఎంని బోనులోకి ఎక్కించాలంటే అక్క‌డి నుంచి చ‌ర్య‌లు మొద‌లౌతాయి క‌దా! అంతేగానీ, ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం చుట్టూ విజ‌య‌సాయి చ‌క్క‌ర్లు కొడుతుంటే ఏమ‌ని అర్థం చేసుకోవాలి..? అవినీతిపై విచార‌ణ లాంటి ఆదేశాలు ఏవైనా వెలువ‌డాలంటే… వ‌యా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ద్వారా జ‌రుగుతాయా..? కానీ, విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌య‌త్నం అక్క‌డి నుంచే ఉంటోంది. అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన మ‌ర్నాడు ఉద‌య‌మే ఆయ‌న ప్ర‌ధాని కార్యాల‌యంలో ఉన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టి, మోడీపై ప‌రిపూర్ణ విశ్వాసం ఉంద‌ని చెప్పిందీ ఆయ‌నే. ఇక్కడ ద్వంద్వ వైఖ‌రి అవ‌లంభిస్తున్న‌ది ఎవ‌రు..? ఇప్పుడేమో… ఇదిగో ఇలా మోడీని క‌లుస్తాను, మంత్రుల్ని క‌లుస్తాను, చంద్ర‌బాబును బోనులో పెట్టే వ‌ర‌కూ క‌లుస్తాన‌ని అంటున్నారు. అంటే, మోడీతో క‌లిసి సీఎం చంద్ర‌బాబుపై కుట్ర చేస్తున్నార‌ని ఆయ‌న ఒప్పుకుంటున్న‌ట్టు అర్థం చేసుకోవాలా..?

అయినా, ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంటు ద‌గ్గ‌ర ప్రెస్ మీట్ పెట్టి… హోదా ఇవ్వ‌ని ప్ర‌ధాన‌మంత్రిని, ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంట్ ప‌ట్ల నిర్ల‌క్షపూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్రాన్ని వెన‌కేసుకుని రావ‌డం ఒక్క వైకాపాకు మాత్ర‌మే సాధ్య‌మైన రాజ‌కీయం. అంతేకాదు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంలో అధికార పార్టీతో ఉన్న పొత్తును తెంచుకుని.. రాష్ట్రంలో పార్టీని ప‌ణంగా పెట్టి కేంద్రంపై పోరాటం చేస్తున్న ముఖ్య‌మంత్రిపై మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేయ‌డ‌మూ వైకాపాకు మాత్ర‌మే సాధ్య‌మైన కుట్ర రాజ‌కీయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.