మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే…

ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ఊత పదం ఉంటుంది. చంద్రబాబు ఏం మాట్లాడినా వాక్యం చివరికి వచ్చేసరికి “ఆ రకంగా ముందుకు పోతుంటారు”. అలాగే వైఎస్ ఆ రోజులో అసెంబ్లీ లో మాట్లాడేటపుడు “అయ్యా…” అంటూ సాగదీసి సంభోదించే పద్దతి అందరి మస్తిష్కాల్లో అలా ప్రింటైపోయింది. అయితే ఇవన్నీ ఒక రకం ఊతపదాలు- ఆ వాక్యాలు అలా మళ్ళీ మళ్ళీ మాట్లాడి, వాళ్ళ సబ్ కాన్షస్ లో కొన్ని పదాలు గట్టిగా ఫీడ్ అయిపోయి, ఏం మాట్లాడినా “ఒక అసంకల్పిత చర్య” లాగా ఈ ఊతపదాలు మధ్యలో వచ్చి కూర్చుంటాయి. కానీ చిత్రంగా జగన్ కి ” మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే…” అన్న పదం ఊతపదం అయినట్టుంది.

జగన్ పాదయాత్ర డైరీ అంటూ సాక్షి లో ప్రతిరోజు జరిగిన పాదయాత్ర విశేషాలని ఒక ఆర్టికల్ గా ప్రచురిస్తున్నారు. ఇవాళ్టి ఎడిషన్ లో “ఈ సర్కారుకి నాదొక ప్రశ్న” అన్న ఆర్టికిల్ చూస్తే, మాటల్లోనే కాదు, రాతల్లోనూ జగన్ ఊతపదాన్ని వదలడం లేదనిపిస్తోంది. మొదటి పేరా ఉపోద్ఘాతం తర్వాత, రెండో పేరా లో వృద్దాప్య పింఛన్ అందని సారమ్మ, మరియమ్మ లతో మాట్లాడినట్టు వ్రాసారు. పేరా చివరికి వచ్చేసరికి – “మన ప్రభుత్వం ఏర్పడగానే ఇలాంటి అండలేని వాళ్ళందరికీ ఇళ్ళు కట్టిస్తానన్న” జగన్ హామీ తో పేరా ముగుస్తుంది. మళ్ళీ తర్వాతి పేరా లో రత్నాలు అనే నిరుద్యోగ యువతి మొర విన్న జగన్ “మన ప్రభుత్వం రాగానే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం” అన్న వాక్యం తో పేరా ముగించారు. తర్వాతి పేరాలోనూ ఇదే తంతు – “మన ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఆర్నెల్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టిస్తామన్న హామీ తో పేరా ముగించారు.

మొత్తానికి పాదయాత్ర స్పీచులతో పాటు డైరీ లోనూ మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే…అన్న ఊతపదం పదే పదే దర్శనమిస్తోంది. నిజానికి జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో “తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి అవ్వాలనుకుని అది కుదరకపోవడం తో స్వంతపార్టీ పెడుతున్నాడు” అని ఇతర పార్టీలు పదే పదే విమర్శిస్తే, ముఖ్యమంత్రి పదవి కోసం తాను పార్టీ పెట్టలేదని అంటూ కాంగ్రెస్ ఎంపీ గా రాజీనామా చేసాక వైసిపి తరపున కూడా ఎంపీ గానే పోటీ చేసారు జగన్. పులివెందుల ఎమ్మెల్యే గా పోటీ చేస్తే అ విమర్శలు మరింత పెరిగేవి. అలా చేయకపోవడం ద్వారా వాటిని త్రిప్పికొట్టిన జగన్ షుమారు 2013 ప్రాంతం లో ఈ “క్యాంపెయిన్” ప్రారంభించారు – “జగన్ ముఖ్యమంత్రి అయ్యాక”, “మన ప్రభుత్వం వచ్చాక” అంటూ. బహుశా అలా పదే పదే చెప్పడం ద్వారా ప్రజల మనసుల్లో అది ముద్రించుకుపోతుంది అని వారి పార్టీ వ్యూహకర్తల ఉద్దేశ్యం. కానీ 2014 మిస్సయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే వ్యూహం పాటిద్దాం అని జగన్ అనుకుంటూ ఉండొచ్చు. కానీ పదే పదే “మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే…” అని మాట్లాడటం తనకి చెరుపు చేస్తుందని జగన్ గుర్తించాలి. ఇది తనకి అధికార యావ ఎంత ఉందో అన్న మెసేజ్ తీసుకెళ్తుంది తప్ప కొత్తగా ఈ క్యాంపెయిన్ వల్ల వచ్చే ఉపయోగం లేదని అర్థం చేసుకోవాలి. పాదయాత్ర డైరీలో ఒక్కొక్క రోజుకే 4-5 సార్లు మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే…అంటూ కలవరిస్తే, చివరికి ఈ డైరీ ని సంకలనం చేసేసరికి (ఒక 200 రోజుల తర్వాత) కనీసం ఒక వెయ్యిసార్లు ఇదే పదం అందులో కనిపిస్తే, అది ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్తే ఆ తప్పు ప్రజలది మాత్రం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.