జ‌గ్గారెడ్డిని తెరాస అవ‌త‌లి ఒడ్డున కావాల‌నే ఉంచుతున్నారా..?

ఆయ‌న‌కి తెరాస‌లో చేరాల‌ని ఉన్న‌ట్టుగా ఉందేమో అన్న‌ట్టుంది, ఆయ‌న్ని పార్టీలోకి తీసుకున్నా ఫ‌ర్వాలేద‌న్న మూడ్ లో తెరాసకి కూడా ఉందేమో అన్న‌ట్టూ ఉంటుంది! ఆయ‌న ఎవ‌రంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. ఆయ‌న తీరు ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. కాసేపు, కేసీఆర్ పాల‌న బాగుందంటూ ఆయ‌నే పొగ‌డ్త‌లు ముంచేస్తారు! సీఎం కుమారుడు కేటీఆర్ ని కూడా ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఆ వెంట‌నే, హ‌రీష్ రావు ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి… తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తుంటారు. రాజ‌కీయాలు వేరు, పాల‌న వేరు అంటారు! త‌న నియోజ‌క వ‌ర్గానికి నిధుల‌ను రాబ‌ట్టుకోవ‌డం కోసం ప్ర‌భుత్వంతో ప‌నులు చేయించుకోవాలి కాబ‌ట్టి సానుకూలంగా ఉంటానంటారు! రాజ‌కీయం చేయాల్సి వ‌స్తే విమ‌ర్శ‌లు త‌ప్ప‌వంటారు.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… తెరాస‌లోకి రమ్మంటూ త‌న‌ని ఎవ్వ‌రూ ఆహ్వానించ‌లేద‌న్నారు. త‌న‌ను తెరాసలో చేర్చుకోర‌నీ, ఎందుకంటే తాను ఎవ్వ‌రి మాటా విన‌నీ, స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించేవాళ్లంటే తెరాస‌కు గిట్ట‌ద‌న్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎంత‌మంది నాయ‌కులు వెళ్లిపోతున్నా న‌ష్టం లేద‌నీ, ఐదేళ్ల త‌రువాత తెలంగాణ‌లో పార్టీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌న్నారు. ఆయ‌న‌కి నిజంగానే కేసీఆర్ నుంచి ఆఫ‌ర్ వ‌స్తే వెళ్లిపోతారా అనే సెన్స్ వ‌చ్చేలా మాట్లాడుతున్నారు! అయితే, తెరాస‌లో చేరితే ఇప్పుడు త‌న‌కు ఉన్నంత స్వేచ్ఛ ఉండ‌ద‌నీ, సొంత నియోజ‌క వ‌ర్గం ప‌నులు చేయించుకోవాల‌న్నా కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప‌డిగాపులు త‌ప్ప‌వ‌ని జ‌గ్గారెడ్డి అంటున్నారట‌.

జ‌గ్గారెడ్డి తీరుపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం ప్ర‌చారంలోకి వ‌స్తోంది! జ‌గ్గారెడ్డిని తెరాస‌లోకి తీసుకోవ‌డానికి పార్టీ రెడీగానే ఉంద‌నీ, అయితే.. ఆయ‌న్ని పార్టీ బ‌య‌ట ఉంచ‌డం ద్వారా కొన్ని ప్ర‌యోజ‌నాల‌ను కొంత‌మంది ఆశిస్తున్న‌ట్టు స‌మాచారం! ఒక‌వేళ జ‌గ్గారెడ్డి పార్టీలోకి వ‌చ్చేస్తే… హ‌రీష్ రావు మీద ఆయ‌న‌ తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉండ‌దు కాబ‌ట్టి, హ‌రీష్ పై విమ‌ర్శ‌లు దాడి చేసే నేత‌లు ఇతర పార్టీల్లో ఎవ్వ‌రూ లేరు కాబ‌ట్టి, కొన్నాళ్ల‌పాటు ఆ ప‌ని కొన‌సాగించాలంటూ కొంద‌రు ఆయ‌న‌కి ఉద్భోదించార‌ని వినిపిస్తోంది. అంటే, సొంత పార్టీ నేత‌లో హ‌రీష్ రావును టార్గెట్ చేసుకుని, జ‌గ్గారెడ్డి ద్వారా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిస్తున్న‌ట్టు! అందుకే, జగ్గారెడ్డిలో తెరాస అనుకూల ధోరణి ఎక్కువా కనిపిస్తోందన్నది కొంతమంది అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com