వారిని కాంగ్రెస్ గూటికి చేర్చ‌డ‌మే జైపాల్ రెడ్డి ల‌క్ష్య‌మా..?

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి… ఒక‌ప్పుడు కేంద్రంలో చ‌క్రం తిప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉండ‌గా కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు. కాంగ్రెస్ హైక‌మాండ్ ద‌గ్గ‌ర ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేకమైన గుర్తింపు ఉంది. ఒక‌ప్పుడు ఢిల్లీ నుంచే రాజ‌కీయాలు చేసిన జైపాల్ రెడ్డి, ఇప్పుడు స్థానికంగా బ‌లం పుంజుకునే ప‌నిలో ఉన్నార‌ని చెప్పుకోవ‌చ్చు. వచ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఎంపీగా పోటీ చేసి, గెలిచి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల‌పై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారు. అంతేకాదు, స్వ‌కార్యంతోపాటు స్వామి కార్యం కూడా పూర్తి చేసే ప‌నిలో… కాంగ్రెస్ లోకి ఇత‌ర పార్టీల నేత‌ల చేరికలను ప్రోత్స‌హించే బాధ్య‌త‌ను కూడా ఆయ‌నే భుజాన వేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో టీడీపీ దాదాపు క‌నుమ‌రుగు అయ్యే దశకు వ‌చ్చేసింద‌న్న‌ది ఒప్పుకోవాల్సిన వాస్త‌వం. మ‌రీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీడీపీ వీడిన త‌రువాత‌, ఆ పార్టీకి నాయ‌క‌త్వం లోటు ఏర్ప‌డింద‌నే చెప్పుకోవాలి. అయితే, టీడీపీ కేడ‌ర్ మాత్రం కొన్ని చోట్ల ఉన్న‌మాట వాస్త‌వ‌మే. ఇప్పుడా కేడ‌ర్ ను కాంగ్రెస్ వైపు మ‌ళ్లించేందుకు జైపాల్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. టీడీపీలో ప్ర‌స్తుతం ఉన్న‌వారిలో రావుల చంద్ర‌శేఖ‌ర్ పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఆయ‌న్ని కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు తెర వెన‌క చ‌క్రం తిప్పుతున్న‌ది జైపాల్ రెడ్డి అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, మాజీ మంత్రి నాగం జ‌నార్థ‌న్ రెడ్డి కూడా పార్టీ మారే క్ర‌మంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చి భాజ‌పాలో చేరిన ద‌గ్గ‌ర నుంచీ ఆయ‌న అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో త‌న‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌ని ఆయ‌నే స్వ‌యంగా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ని కూడా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ల‌క్ష్యంతో జైపాల్ రెడ్డి మంత్రాంగం న‌డుపుతున్న‌ట్టుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఇత‌ర పార్టీల నేత‌ల్ని ఆక‌ర్షించే బాధ్య‌త‌తోపాటు, సొంత పార్టీలోని అస‌మ్మ‌తిపై కూడా జైపాల్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టుగా వినిపిస్తోంది..! కాంగ్రెస్ లోకి కొత్త నేత‌లు వ‌చ్చి చేరుతూ ఉంటే, ఎప్ప‌ట్నుంచో పార్టీలో ఉన్న త‌మ సంగ‌తి ఏంటనీ, త‌మ‌కు ద‌క్కే ప్రాధాన్య‌త ఏముంటుంద‌నే అసంతృప్తిని కొంత‌మంది నేత‌లు ఇటీవ‌ల వ్య‌క్తం చేస్తున్నార‌ట‌! రేవంత్ రెడ్డి చేరిక సమ‌యంలో డీకే అరుణ వంటివారు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇప్పుడు నాగం జ‌నార్థ‌న్ రెడ్డి చేరిక కూడా మాజీ మంత్రి డీకే అరుణ‌తోపాటు కొంత‌మంది నాయ‌కులకు ఇష్టం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వారికి నాగం వ‌ల్ల చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌నే అంశాన్ని ఇటీవ‌లే అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వ‌ద్ద‌కు కొంత‌మంది టి. కాంగ్రెస్ నేత‌లు తీసుకెళ్లారు. ఇప్పుడా అంశం కూడా జైపాల్ డీల్ చేస్తున్నార‌నీ… కొత్త‌వారు ఎంత‌మంది వ‌చ్చినా, పార్టీకి మొద‌ట్నుంచీ సేవ‌లు చేస్తున్న‌వారికి స‌రైన గుర్తింపు ఉంటుంద‌నే భ‌రోసా ఆయ‌నే ఇస్తున్నార‌ట‌! పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌నీ, అధికారంలోకి వ‌చ్చాక అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని చెబుతున్నార‌ట‌. ఆయ‌న ఇంత చొర‌వ ఎందుకు తీసుకుంటున్న‌ట్టు అంటే… ఓడి చోట నుంచే మ‌రోసారి గెలిచి… ఢిల్లీ స్థాయిలో త‌న ప్రాధాన్య‌త‌ పెంచుకోవాల‌నేదే జైపాల్ రెడ్డి ల‌క్ష్యం అని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి, జైపాల్ వ్యూహాలు ఎంత‌వ‌ర‌కూ విజ‌య‌వంతం అవుతాయో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.