కేసీఆర్, జగన్ దూకుడు..! విభజన వివాదాలకు నెల రోజుల డెడ్‌లైన్..!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సమన్వయంతో.. విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే..హైదరాబాద్‌లోని ఏపీ భవనాల సమస్య పరిష్కారం అయింది. జలవివాదాలను… శరవేగంగా పరిష్కరించుకునేందుకు కేసీఆర్ ఉత్సాహం చూపిస్తున్నారు. జగన్ కూడా.. గతం.. గతహా అనుకుని.. భవిష్యత్ పై దృష్టి సారిస్తున్నారు. ఎగువ రాష్ట్రంతో కలిసి.. ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించుకుందామనుకుంటున్నారు. ఇవే కాదు.. మిగిలిన అన్ని సమస్యలపైనా… నెల రోజుల్లో ఓ పరిష్కారానికి రావాలన్న ఆలోచన చేస్తున్నారు.

ఉమ్మడి సంస్థలు సహా అన్నీ వివాదాలకూ నెలలో పరిష్కారం..!

రాష్ట్ర విభజన సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఏపీ, తెలంగాణ ఎదుర్కొంటున్న వివిధ అంశాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుమారు గంటన్నరపాటు చర్చలు జరిగాయి. సమస్యల పరిష్కారం దిశగా అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ముందుకుసాగాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. ప్రధానంగా విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థల విభజన ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థల మధ్య సమస్యలపై సీఎంల స్థాయిలో నిర్ణయం తీసుకోవాలన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల విభజన, విద్యుత్‌ బకాయిల పరిష్కారం కూడా నెలలో పూర్తవ్వాలన్న అంచనాకు వచ్చారు. ఏపీ ఓడరేవుల అభివృద్ధికి కలసి వచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇతర రాష్ట్రాలకు, దేశాలకు జరిగే ఎగుమతుల కోసం ఏపీలోని ఓడరేవులకు తెలంగాణ నుంచి సరకులను పంపిస్తామని హామీ ఇచ్చారు.

ప్రాజెక్టులపై ఫిర్యాదులన్నీ ఉపసంహరణ..!?

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేసీఆర్.. జగన్ కు వివరించారు. దాని వల్ల ఏపీకి ఒక్క చుక్క కూడా నీటి నష్టం ఉండదని.. చెప్పిటన్లు తెలుస్తోంది. అది పాత ప్రాజెక్టేనని వివరించినట్లు సమాచారం. ఆహ్వానంపై.. జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ తమను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నామని.. కచ్చితంగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తామని హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాలు నీటి గొడవలు పడటం వల్ల ప్రయోజనం ఉండదని నిర్ణయించుకుని.. రెండు రాష్ట్రాల తరపున ఉన్న పిటిషన్లు వెనక్కి తీసుకునే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై కూడా ఇరువురు సీఎంల మధ్య చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే ఓ కమిటీ వేశామని, ఈ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే విలీనానికి చర్యలు తీసుకుంటామని జగన్ వివరించారు.

పార్లమెంట్‌లో “హోదా పోరాటానికి ” మద్దతిస్తామన్న కేసీఆర్..!

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో జరిగిన విశేషాలను సీఎం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వివరించినట్లు సమాచారం. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన వాదనను వినిపించామని జగన్ చెప్పారు. పార్లమెంట్‌లో ప్రస్తావించినా మద్దతిస్తామని.. కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులతోపాటు తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ వినోద్, ఎంపీ సంతోష్, కేటీఆర్ తోపాటు ఏపీ నుంచి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి , వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి చేర్చుకోవటం, అక్కడ జరుగుతున్న వివాదాలు, ఇతరత్రా అంశాలపై కూడా నేతలు మాట్లాడుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com