బీఆర్ఎస్ లో ఎలాంటి పవర్ ఉండని అత్యున్నత పదవి సెక్రటరీ జనరల్. ఇతర పార్టీల్లో ఈ హోదా కనిపించదు. కానీ బీఆర్ఎస్ లో కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నేత కె. కేశవరావు సుదీర్ఘ కాలం పాటు ఈ పదవిలో కొనసాగారు. 2013లో ఆయన పార్టీలో చేరినప్పటి నుండి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తూ, జాతీయ రాజకీయాల్లో పార్టీ తరపున కీలక భూమిక పోషించారు. ఇటీవల ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కి ఈ పదవిని ఆఫర్ చేశారు కేసీఆర్.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం, తన అనుచరుడి హత్య ఉదంతంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. బీఆర్ఎస్ లో చేరే ముహుర్తం వెదుక్కుంటున్నారు. తనకు కాకుండా తన కోడలికి రాజకీయ భవిష్యత్ కల్పించాలని బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. తన కోడలు చరిష్మా రెడ్డి ని రాజకీయాల్లోకి తీసుకురావాలనే బలమైన వ్యూహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో తన రాజకీయ వారసురాలిగా చరిష్మా రెడ్డిని బరిలోకి దింపడానికి గ్రౌండ్ రెడీ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆమె క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ యాక్టివ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన అవమానాలకు ప్రతికారం తీర్చుకోవడమే కాకుండా, తన వారసురాలి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకే జీవన్ రెడ్డి ఈ బిగ్ స్కెచ్ వేశారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని ప్రకటించిన జీవన్ రెడ్డి, గులాబీ గూటికి చేరితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది.
