కెసిఆర్‌ మర్చిపోని నా నిజాం ప్రశ్న

పదేళ్ల కిందట నేను వేసిన ఒక ప్రశ్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఇప్పటికీ వెంటాడటం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.తాజాగా శాసనసభలోనూ పేరెత్తకుండా పరోక్షంగా పాక్షికంగా నన్ను ప్రస్తావించి ఆ అంశం తీసుకొచ్చారు.అది నిజాంకు సంబంధించింది. నిరంకుశ పాలనలో తెలంగాణలో వెట్టిచాకిరికి పేదల పీడనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని స్మరించుకోకుండా నిజాం నవాబును కీర్తించడం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రివాజుగా మారింది. ఈ సందర్భంగా ఆయన గోదావరి ఆనకట్ట నిర్మించిన కాటన్‌ను పోలిక తెస్తుంటారు.2008 మార్చిలో మొదటి సారి ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన సందర్భమది. ఆ రోజు ఒక గదిలో నేనూ నాగేశ్వర్‌ వుంటే మరో గదిలో కెసిఆర్‌ కూచుని స్పందిస్తున్నారు. ఇతర విషయాలు కూడా వచ్చాయి గాని నిజాంపై ప్రశ్న మీడియాలో సంచలనమైంది. అప్పుడే కెసిఆర్‌ నిజాం సమాధిని సందర్శించడమే గాక ఆయన ఘనతను కీర్తించి వచ్చారు. అదే నేను అడిగాను. తెలంగాణ వారసత్వంలో నిజాం వ్యతిరేక పోరాటం ముఖ్యభాగమైనప్పుడు మీరు ఆయననే కీర్తించడం ఏమిటి అని. పోయిన వారిని గౌరవించడం మర్యాద గనక వెళ్లానని మొదట చెప్పారు. వ్యక్తిగతంగా వెళ్లి నమస్కారం పెడితే అభ్యంతరం లేదు గాని ఉద్యమ నాయకుడుగా కీర్తనలు ఆలపించడం ఏమిటని అడిగితే గోదావరి జిల్లాల్లో కాటన్‌ను ఎందుకు పూజిస్తారు? అలాగే నిజాం మాకు ప్రాజెక్టులు కట్టారు గనక మేము పూజిస్తామని సమాధానమిచ్చారు. ఈ వాదనతో నేను నిరుత్తరడునైనానని మీతో మాట్లాడ్డం కష్టమని అన్నానని కెసిఆర్‌ చెబుతుంటారు. కాని నేనన్నది వేరు.ప్రజలు కాటన్‌ను పూజిస్తారు గాని ఎలిజిబెత్‌ రాణిని కాదు, మీరు కూడా నిజాం సాగర్‌ కట్టిన ఇంజనీర్‌ను పూజించవచ్చు ఈ పోలిక సరికాదని చెప్పాను. ఇలా వాదన నడుస్తుండగా నాగేశ్వర్‌ జోక్యం చేసుకుని దీనిపై వాదన ఎందుకు నిజాంలో ప్లస్‌లు ఎక్కువో మైనస్‌లు ఎక్కువో చెబితే సరిపోతుంది అని మధ్యేమార్గం సూచించారు.అప్పుడు కెసిఆర్‌ బుర్రవున్నవారెవరైనా మైనస్‌లు ఎక్కువనే అంటారని బదులిచ్చారు. అంతటితో నేనూ ఆ వాదన ముగించాను. అయితే ఈ పదేళ్లలోనూ అధికారంలోకి రాకముందే గాక వచ్చాక కూడా ఆయన ఈ సంఘటనను చెబుతూనే వున్నారు. అంతర్గత సమావేశంలోనైతే తెలకపల్లి రవి అడిగాడని చెబుతారు. లైవ్‌లోనైతే ఒక ఆంధ్ర జర్నలిస్టు అనో మరొకటనో అంటారు.శాసనసభలో ఆంధ్రా విలేకరి అన్నారు. ఈ తేడాలు ఎప్పుడూ నేను పాటించలేదు కాబట్టి ఏమన్నా పెద్ద స్పందించదలచలేదు. కాని నిజాంపై జరిగిన పోరాటాన్ని విస్మరించి ఆయననే కీర్తించడం సమంజసం కాదని నేనే గాక తెలంగాణలో చాలా మంది బాధపడుతుంటారు. మరి ముఖ్యమంత్రి ఎప్పటికైనా ఆలోచిస్తారో లేదో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.