రివ్యూ: కీడా కోలా

Keedaa Cola movie review

తెలుగు360 రేటింగ్ : 2.75/5

చేసిన రెండు సినిమాలతోనే తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకోగలిగారు దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైయింది.. ఈ రెండు చిత్రాలు కూడా దేనికవే ప్రత్యేకం. దాదాపు ఐదేళ్ళ విరామం తర్వాత ఇపుడు మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌డితే… త‌రుణ్‌పై, ఆయ‌న సినిమాపై ఫోక‌స్ ప‌డ‌కుండా ఎలా ఉంటుంది..? పైగా టైటిల్ కీడా కోలా. అక్క‌డే సినిమాపై ఆస‌క్తి మొద‌లైపోయింది. పెద్ద స్టార్ ఎట్రాక్షన్ లేని ఈ చిత్రం చుట్టూ బజ్ ఏర్పందంటే అది అది తరుణ్ భాస్కర్ మార్క్. ప్రచార చిత్రాలు సైతం ఆసక్తిని పెంచాయి. క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో త‌యారైన‌ ఈ చిత్రం ఎలాంటి వినోదాల్ని పంచింది? తరుణ్ భాస్కర్ తన మరోసారి తన విలక్షణతని చాటుకున్నారా? కీడా కోలాతో హ్యాట్రిక్ విజయం దక్కిందా ?

వాస్తు ( చైతన్యరావు) చిన్నప్పుడే తల్లి తండ్రుల పోగొట్టుకుంటాడు. తాత వరదరాజు(బ్రహ్మానందం) ద‌గ్గ‌ర‌ పెరుగుతాడు. తనకి టూరెట్ సిండ్రోం(మాటల్ని సరిగ్గా పలకలేకపోవడం) అనే స‌మ‌స్య‌ వుంటుంది. ఇది పుట్టుకతో వచ్చింది కాదు.. తన తల్లితండ్రుల ముందు చూపు కారణం వచ్చింది (ఈ ముందు చూపు ఏమిటనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది). వాస్తు మెడికల్ రిప్రజెంటర్ ఉద్యోగం చేస్తుంటాడు. చాలీ చాలని జీతంతో జీవితాన్ని కష్టంగా నడుపుతుంటాడు. వాస్తుతో పాటు అదే ఇంట్లో ఉంటాడు లంచం (రాగ్ మయూర్) ఇతనొక చెట్టుకింద ప్లీడర్ టైపు. జీవితంలో స్థిరపడాలంటే క‌చ్చితంగా డబ్బు వుండాలి. అది ఎలా సంపాయించిన ఫర్వాలేదనే ధోరణి తనది. సరిగ్గా ఇదే సమయంలో తాత వరదరాజు కోసం తెచ్చిన కూల్ డ్రింక్ బాటిల్ లో ఓ బొద్దింక కనిపిస్తుంది. దీనిపై వినియోగదారుల ఫోరంలో కేసు వేసి కోట్లు డిమాండ్ చేయోచ్చనే ఆలోచన ఇస్తాడు లంచం. వాస్తుకి కూడా డబ్బు కావాలి కాబట్టి సరే అంటాడు. కూల్ డ్రింక్ బిల్ తీసుకురావడానికి కొట్టువైపు వెళ్తున్న లంచం ను నాయుడు( తరుణ్ భాస్కర్) జీవన్ (జీవన్) సికిందర్ (విష్ణు) గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అసలు ఈ గ్యాంగ్ సీన్ లోకి ఎందుకు వచ్చింది? నాయుడు ఎవరు? తనకేం కావాలి? వాస్తు, లంచం .. డబ్బులు సంపాయించారా ? చివరికి ఈ కీడా కోలా కథ ఎలా ముగిసిందనేది తెరపై చూడాలి.

క్రైమ్ కామెడీ భలే గమ్మత్తయిన జోనర్.’ కీడాకోలా’ ని అంతే గమ్మత్తుగా తీయడానికి ప్రయత్నిం చాడు తరుణ్ భాస్కర్. ప్రీక్లైమాక్స్ షాట్ తో కథని ఓపెన్ చేయడం తరుణ్ స్టయిల్. ఈనగరానికి ఏమైయింది లో కూడా కథ యాక్సిడెంట్ సీన్ తో మొదలుపెడతారు. కీలా కోడా కూడా చివరి గన్ ఫైరింగ్ షాట్ తోనే ఓపెన్ చేశాడు. పాత్రలన్నీ స్లో మోషన్ తో తమ తమ పరిచయాలు ఇస్తూ కథలోకి తీసుకెల్తాయి. ఇలాంటి సినిమాలకు వరల్డ్ బిల్డింగ్ చాలా ముఖ్యం. కీడాకోలా లో అది బాగా కుదిరింది. లోకేషన్స్, పాత్రలు, మేకింగ్ ప్రేక్షకుడిని కీడాకోలా ప్రపంచంలోకి త్వరగానే తీసుకెళ్ళిపోతాయి.

వాస్తు, లంచం, వరదరాజు పాత్రల కోణంలో కథ మొదలౌతుంది. వాళ్ళ మధ్య వచ్చే సంభాషణలు నవ్విస్తాయి. పేషెంట్ సిమ్యులేటర్ నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా నవ్వులు పూయిస్తాయి. మరోవైపు జీవన్, నాయుడు పాత్రలు తెరపైకి రావడంతో ఇందులో డార్క్, క్రైమ్ కామెడీ వేగం పుంజుకుటుంది. జీవన్ పోస్టర్ డిజైన్, నాయుడు శ్వాస మీద ధ్యాస, రెండు గంటల పాటు ఇంగ్లీష్, సికిందర్ చెప్పే జాతర కథ, జీవన్ చెప్పే కుక్క పులి కథ.. ఇవన్నీ సరదాగా సాగిపోతాయి. రెండు గంటల సినిమా ఇది. విరామఘట్టం కూడా త్వరగానే వచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది.

సెకండ్ హాఫ్ లో అసలు సిసలు క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్ మొద‌ల‌వుతాయి. ‘కీడా.. ఇందులో వుంది తేడా’ అనే డైలాగ్ లానే.. తెరపైకి అన్నీ తేడాతేడా సన్నివేశాలు వచ్చి నవ్విస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఓపెన్ చేసిన క్యారెక్టర్ బ్రాకెట్ ని సెకండ్ హాఫ్ లో క్లోజ్ చేసే విధానం భలే గమ్మత్తుగా వుంటుంది. నాయుడు ప్రతిరోజు ఓ రెండు గంటలు ఇంగ్లీష్ మాట్లాడాలనే నియమం పెట్టుకుంటాడు. అది ఫస్ట్ ఆఫ్‌లో మొదలౌతుంది. దాన్ని మళ్ళీ వాడ‌తారని ప్రేక్షకుడి అర్ధమౌతునే వుంటుంది. అయితే ఆ మళ్ళీ వాడే సందర్భం ఎక్కడ వస్తుందని ఎదురుచూస్తున్న ప్రేక్షకుడు .. భలే టైమింగ్ లో వచ్చిందనే అనుభూతిని ఇస్తుంది. వాస్తు, నాయుడు గ్యాంగ్ ఎదురెదురుగా నిలబడి ‘సరెండర్’ అని సికిందర్ పాత్రతో చెప్పించే సన్నివేశం ఐతే .. హిలేరియస్ గా వుంటుంది. మరోపక్క జీవన్ కార్పొరేటర్ అవ్వాలని చేసే ప్రయత్నాలు, కోలా కంపెనీ ఓనర్, షాట్స్ పాత్ర, మురళీధర్ గౌడ్ పంపే షూటర్స్ గ్యాంగ్ .. ఇవన్నీ కావాల్సిన వినోదం పంచుతాయి.

అయితే కీడాకోలాలో కూడా కొన్ని ఎత్తుపల్లాలు వున్నాయి. చాలా చిన్న కథ ఇది. ఈ చిన్న కథ కూడా ముందు సాగుతునట్లుగా ఏమీ అనిపించదు. కథని ఒక పాయింట్ కే పరిమితం చేసి పాత్రల చుట్టూనే హ్యుమర్ పండించాలని ప్రయత్నించారు. కథతో పాత్రల ప్రయాణం చూడాలని ఆశించే వారికి ఇది అంత కనెక్టింగ్ గా అనిపించకపోవచ్చు. అలాగే ఇందులో చాలా పాత్రలు ఎదో ఒక వైకల్యం వున్నట్లు కనిపిస్తాయి. ఇలా వైకల్యం వున్న పాత్రలు చుట్టూ కామెడీ రాసి హుందాగా పండించడం కత్తిమీద సాము. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ పాత్రలని చాలా బ్యాలెన్స్ గా రాసుకున్నప్పటికీ యూరిన్ బ్యాగ్ మీద వేసిన జోక్స్, కళ్ళు చిదంబరం తరహ షూటర్స్ కామెడీ ని కొంత మంది స‌ర‌దాగా తీసుకోలేకపోవచ్చు. అలాగే ఈ కథలో ప్రతి పాత్రతో, దాని ఆర్క్ తో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. సినిమా చూస్తున్నపుడు ఎక్కడో చోట కనెక్షన్ కట్ అయితే మాత్రం మిగతాదంతా హాస్యం లేని అసంబద్ధ భావన కలిగే అవకాశం కూడా వుంది.
తరుణ్ భాస్కర్ చేసిన నాయుడు పాత్ర ఇందులో ప్రాధాన ఆకర్షణ. ఆ పాత్రని చాలా చక్కగా రాసుకొని అంతే చక్కగా చేశాడు. ఆ పాత్రలో ఒక స్వాగ్ వుంటుంది. ఆ పాత్ర డిజైన్ చాలా బావుంది. వాస్తు పాత్రలో చేసిన చైతన్యరావు కూడా ఆకట్టుకుంటాడు. తన పాత్ర పరిధిలో నవ్వించడానికి ప్రయత్నించాడు. రాగ్ మయూర్ చాలా సహజంగా కనిపించాడు. బ్రహ్మానందంకు క్రైమ్ కామెడీ లు కొత్త కాదు. కానీ వరదరాజు పాత్ర కొత్త. వీల్ చెయిర్ లో కూర్చునే హాస్యాన్ని పండించారు. తరుణ్ భాస్కర్ స్టయిల్ డైలాగులు ఆయన చెప్పడం కొత్తగా అనిపిస్తుంది. సికిందర్ గా చేసిన విష్ణు కూడా ఆకట్టుకుంటాడు. జీవ‌న్ కి కూడా మంచి పాత్ర దక్కింది. సంకల్పమో అసంకల్పమో గానీ ఇందులో ఇందులో స్త్రీ పాత్రలు వెదికినా కనిపించవు. పేషెంట్ సిమ్యులేటర్ నే స్త్రీ పాత్ర అనుకోవాలి. నాయుడు పాత్ర సీన్ లోకి వచ్చిన తర్వాత ఆ సిమ్యులేటర్ పాత్ర మరింతగా ప్రాణం పోసుకుంటుంది. ఆ పేషెంట్ సిమ్యులేటర్ క్యారెక్టర్ డిజైన్ లో అంతర్లీనంగా మంచి ఆర్క్ వుంటుంది. సెకండ్ హాఫ్ లో అది బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ర‌ఘు, ర‌వీంద్ర విజ‌య్ మిగతా పాత్రలన్నీ పరిధిమేర వున్నాయి. చివర్లో జైలు కబుర్లు చెప్పే ఓ పాత్ర అయితే కడుపుబ్బానవ్విస్తుంది.

చిన్న సినిమా ఇది. బ‌డ్జెట్ ప‌రిధులు క‌నిపిస్తూనే ఉంటాయి. అయినా స‌రే, టెక్నికల్ గా కూడా ఈ సినిమాని నిలిపే ప్ర‌య‌త్నం చేశాడు త‌రుణ్ భాస్క‌ర్‌. కెమెరా, సౌండ్ దేనికవే పోటీపడి పని చేశాయి. వివేక్ సాగర్ నేపధ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. కథలో భలే బ్లెండ్ అయ్యింది. ఎడిటింగ్ లో వంకపెట్టడానికి లేదు. తరుణ్ భాస్కర్ రాసుకున్న మాటలు చాలా వ‌ర‌కూ పేలాయి. డార్క్, క్రైమ్ కామెడీ అంటే తనకు ఎంత ఇష్టమో ఈ సినిమా చూస్తే అర్దమైపోతుంది. హెడ్ ఫోన్ లో స్వాతిలో ముత్యమంత పాట వచ్చినపుడు థియేటర్ ఊగిపోతుంది. ఆ సందర్భం అంత చక్కగా కుదిరింది.

క్రైమ్ కామెడీ జోన‌ర్ చాలా పాత‌ప‌డిపోయింది. అయితే దాన్ని రెగ్యుల‌ర్ గా కాకుండా కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఈ సినిమా అంద‌రికీ ఎక్క‌కపోవొచ్చు. కానీ ఈ జోన‌ర్ ని ఇష్ట‌ప‌డే వాళ్ల‌కు మాత్రం మంచి విందే!

తెలుగు360 రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close