కొమ్మినేని అడ‌గ‌లేదు.. జ‌గ‌న్ చెప్ప‌లేదు.!

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహన్ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర నెల‌రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సాక్షి మీడియా జ‌గ‌న్ తో ఓ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చేసింది. నిజానికి, ఈ ముఖాముఖీలో జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా, లేదా కొత్త‌గా చెప్పిన అంశాలేవీ లేవనే అనాలి. కాక‌పోతే… ప్ర‌జ‌ల్లో ఉన్న కొన్ని అనుమానాలు, జ‌గ‌న్ తీరుపై వ్య‌క్త‌మౌతున్న కొన్ని విమ‌ర్శ‌లు, చేతికి ఎముక లేద‌న్న‌ట్టుగా పాద‌యాత్ర‌లో ఇస్తున్న హామీల‌పై మాట్లాడారు, కానీ, మరింత స్ప‌ష్ట‌త ఇచ్చే విధంగా జ‌గ‌న్ ను నుంచి అభిప్రాయాలు రాబ‌ట్టి ఉంటే బాగుండేది. అలాంటి ప్ర‌య‌త్న‌మేదీ ప్ర‌శ్న‌లు అడిగిన ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని చెయ్య‌లేద‌నే చెప్పాలి. జ‌గ‌న్ చెప్పాల‌ని అనుకున్న‌వి మాత్ర‌మే అడిగిన‌ట్టు అనిపించింది. జ‌గ‌న్ ఎంత చెబితే అంతే చాలు అని ముందుగా అనుకున్నారో ఏమో తెలీదు మ‌రి!

అంశాల వారీగా తీసుకుంటే… పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి ఇటీవ‌లే పార్టీని వ‌దిలి వెళ్లిపోయారు. దీనిపై మీ స్పంద‌న ఏంట‌ని జ‌గ‌న్ ను ప్ర‌శ్నిస్తే.. బాధాక‌రం అన్నారు! టీడీపీ ప్ర‌లోభాల‌కు లొంగి వెళ్లిపోయార‌న్నారు. అక్క‌డి నుంచి ఫిరాయింపుల‌పై రెగ్యుల‌ర్ గా చేస్తున్న విమ‌ర్శ‌లే చేశారు. కానీ, గిడ్డి ఈశ్వ‌రి పార్టీ నుంచి వెళ్ల‌డానికి జ‌గ‌న్ తీరే కార‌ణ‌మ‌నీ, కుంభా రవిబాబు విష‌య‌మై మాట్లాడేందుకు ఆమె జ‌గ‌న్ ను క‌లిస్తే ‘అన‌వ‌స‌ర విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌’ని ఆయ‌న చెప్పార‌ని ఆమె అన్నారు. ఇది నిజ‌మా కాదా, ఇలాంటి ప‌రిస్థితి పార్టీలో ఉందా అని అంశంపై జ‌గ‌న్ నుంచి మ‌రింత స్ప‌ష్టత రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తే… ప్ర‌జ‌ల‌కు మ‌రింత క్లారిటీ వచ్చేది. కానీ, కొమ్మినేని ఇది అడ‌గ‌లేదే..!

నంద్యాల ఉప ఎన్నిక విషయ‌మే తీసుకుంటే… ఆ ఫ‌లితం ద్వారా ఏదైనా పాఠం నేర్చుకున్నారా అని జ‌గ‌న్ ను ప్ర‌శ్నించారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు భ‌య‌పెట్టార‌నీ, ఓటు వెయ్య‌క‌పోతే పెన్ష‌న్లు ఆగిపోతాయ‌నీ, అభివృద్ధి ప‌నులు నిలిచిపోతాయ‌నే భ‌యంతోనే ఓట్లేశార‌న్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌కీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కీ తేడా చాలా ఉంటుంద‌న్నారు. అంటే, నేర్చుకోవాల్సింది ఏం లేద‌ని ప‌రోక్షంగా చెప్పేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌ ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబు నాయుడును ఉద్దేశించి ‘కాల్చేస్తా, గుడ్డ‌లూడ‌దీస్తా’ వంటి అభ్యంత‌ర వ్యాఖ్య‌ల ప్ర‌స్థావ‌న కొమ్మినేని తీసుకొచ్చినా.. జ‌గ‌న్ ఆ అంశంపై స్పందించ‌లేదు. స‌రే, టీడీపీ అధికారంలో ఉంది కాబ‌ట్టి… నంద్యాల‌లో గెలుస్తుంద‌ని జ‌గ‌న్ కు ముందే తెలిస్తే… చంద్ర‌బాబు స‌ర్కారు ప‌త‌నం ఇక్క‌డి నుంచే మొద‌ల‌ని జ‌గ‌న్ ఎందుకు ప్ర‌చారం చేశారు..? సెమీ ఫైన‌ల్స్, కురుక్షేత్రం అని ఎందుకు అన్నారు…? కానీ, కొమ్మినేని ఇది అడ‌గ‌లేదే..!

జ‌గ‌న్ ఇస్తున్న హామీల గురించి… 45 ఏళ్లకే పెన్ష‌న్‌, అమ్మ ఒడి వంటి హామీలు పాదయాత్ర‌లో ఇచ్చుకుంటూ వెళ్తున్నారు క‌దా. వీటిపై కొన్ని విమ‌ర్శ‌లున్నాయ‌ని జ‌గ‌న్ ని అడిగారు. ఏపీ బ‌డ్జెట్ పెరుగుతూ పోతోంది కాబ‌ట్టి, ఈ హామీల అమ‌లు పెద్ద‌గా భారం కాద‌ని జ‌గ‌న్ చెప్పారు. ఇవ‌న్నీ చాలా చిన్న హామీల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేసే కార్య‌క్ర‌మాలు ప్ర‌క‌టిస్తే, టీడీపీ ఓర్చుకోలేద‌ని అన్నారు. అయితే, ఇంత‌వ‌ర‌కూ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఇచ్చిన హామీలు చేయాలంటే లక్షన్నర కోట్లు అవసరం లెక్క‌లు ఈ మ‌ధ్య వినిపించాయి. దీనికి తోడు రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీ ఆర్థికంగా చాలా వెన‌క‌బ‌డి ఉంది. దాదాపు ల‌క్ష కోట్లు అప్పుల్లో ఉంది. రెవెన్యూ లోటు భ‌ర్తీ కాలేదు. ఆర్థికంగా ఇంత భారం క‌నిపిస్తుంటే… అద‌నంగా ఇస్తున్న ఈ హామీల అమ‌లు ఎలా సాధ్యం..? ఏపీకి ఆదాయం పెంచే మార్గాలు ఎలా పెంచుతారు..? కానీ, కొమ్మినేని ఇది అడ‌గ‌లేదే..!

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యానికొస్తే… చంద్ర‌బాబు చేయ‌లేక‌పోయార‌నీ, ఈయ‌న చేత‌గాని త‌నాన్ని కేంద్రంపై నెట్టేస్తున్నార‌ని జ‌గ‌న్ విమర్శించారు. ప్రాజెక్టులో అడుగ‌డుగునా అవినీతి ఉంద‌న్నారు. మంత్రి వ‌ర్గంలో వారికీ, లేదా వారి బంధుమిత్రులకు పెద్ద ఎత్తున స‌బ్ కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టార‌నీ, అందుకే కేంద్రం భ‌య‌ప‌డిపోతోంద‌నీ వ్యాఖ్యానించారు. అయితే, నిజానికి పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టు క‌దా! ప్రాజెక్టు ఆల‌స్యం కావ‌డానికి కేంద్ర వైఖ‌రి కూడా కొంత కార‌ణం ఉంది క‌దా. రాష్ట్ర ప్ర‌జ‌ల విశాల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఆలోచించి, ఒక బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్షంగా పోల‌వ‌రం పనులు ముందుకు సాగేందుకు కేంద్రంపై వైపాకా చేసిన ఒత్తిడి ఏమైనా ఉందా..? కానీ, కొమ్మినేని ఇది అడ‌గ‌లేదే..!

రిజ‌ర్వేష‌న్ల విష‌యానికొస్తే… అసెంబ్లీలో కాపుల రిజ‌ర్వేష‌న్ల‌ను పాస్ చేసి కేంద్రానికి ఏపీ స‌ర్కారు పంపించింది. దీనిపై జ‌గ‌న్ స్పందిస్తూ… కాపుల రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌క‌పోవడాన్ని కూడా చంద్ర‌బాబు నాయుడు కేంద్రంపై నెట్టేస్తున్నార‌నీ, రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డంలో త‌న త‌ప్పేం లేద‌ని త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇది ఎన్నిక‌ల ముందు ఆయ‌న ఇచ్చిన హామీ, కాబ‌ట్టి ఆయ‌నే దీన్ని పూర్తి చేయాల్సింది పోయి.. భాజ‌పాపై నెపాన్ని నెడుతున్నార‌న్నారు. నిజానికి, కాపుల రిజ‌ర్వేష‌న్ల హ‌మీల‌పై అసెంబ్లీలో తీర్మానించ‌డం, ఆ త‌రువాత కేంద్రానికి నివేదించ‌డం, పార్ల‌మెంటులో చ‌ర్చించాక నిర్ణ‌యం తీసుకోవ‌డం… ఇది రొటీన్ ప్రాసెస్‌. దీనికి అతీతంగా ఎవ్వ‌రూ ఏం చేయ‌లేరు క‌దా! స‌రే, ఇప్పుడు అంశం కేంద్రం ద‌గ్గ‌ర ఉంది క‌దా, ప్ర‌తిప‌క్ష పార్టీ ఎంపీలు కూడా ఉన్నారు క‌దా, వారి ద్వారా కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై వెంట‌నే ఓ నిర్ణ‌యం తీసుకొండీ అంటూ కేంద్రాన్ని వారు కోరే అవ‌కాశం ఉంటుంది. ఆ ర‌కంగా వైకాపా కూడా ప్ర‌య‌త్నం చెయ్యొచ్చు. కానీ, కొమ్మినేని ఇది అడ‌గ‌లేదే..!

ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడుతూ… రాష్ట్రంలో యువ‌త‌కు ఉద్యోగాలు రావాలంటే హోదాతోనే సాధ్య‌మ‌ని జ‌గ‌న్ అన్నారు. ప‌రిశ్ర‌మ‌లు రావాలంటే హోదా ఉండాల‌న్నారు. క‌రెక్టే, కానీ ఇక‌పై దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్ర‌త్యేక హోదా ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని కేంద్రం ఎప్పుడో చెప్పేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు కార‌ణంగా చూపిస్తూ… హోదాకి బ‌దులు ఏపీకి ప్యాకేజీ ఇచ్చింది. ప్యాకేజీలో ఇస్తామ‌న్న‌వి కూడా ఇంకా కేంద్రం ఇవ్వ‌లేదు. వాటిపై ప్ర‌తిప‌క్షం పోరాటం ఏదీ..? స‌రే… హోదాతో మాత్ర‌మే ఏపీ అభివృద్ధి సాధ్య‌మ‌నుకున్న‌ప్పుడు… దాని సాధ‌న‌ కోసం వైకాపా ఏం చేసింది..? ఎంపీలు ఎందుకు ఇంకా రాజీనామాలు చేయించ‌లేక‌పోయారు..? కానీ, కొమ్మినేని ఇది అడ‌గ‌లేదే..!

అసెంబ్లీ స‌మావేశాల బ‌హిష్క‌ర‌ణ టాపిక్ మాట్లాడుతూ… ఎన్నిక‌ల అయ్యే వ‌ర‌కూ అసెంబ్లీకి వైకాపా వెళ్ల‌ద‌నే స్ప‌ష్ట‌త జ‌గ‌న్ ఇచ్చేశారు. ఫిరాయింపుదారుల‌పై ఎలాంటి చ‌ర్య‌లూ లేక‌పోతే, అలాంటి స‌భ‌లో ఎలా కూర్చుంటామ‌ని జ‌గ‌న్ చెప్పారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటామని అన్నారు, బాగానే ఉంది. ఫిరాయింపులను ప్రోత్స‌హించ‌డం ద్వారా ప్ర‌జ‌ల తీర్పును వెక్కిరించే రాజ‌కీయాల‌కు టీడీపీ పాల్ప‌డింది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాక‌పోతే, అదే ప్రజాతీర్పు ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు చ‌ట్ట‌సభ‌ను బ‌హిష్క‌రించ‌డం కూడా స‌రైన ప‌ద్ధ‌తి కాదు క‌దా. స‌మ‌స్య‌లు స‌భ‌లో చ‌ర్చిస్తారనే నమ్మకంతో ప్ర‌జ‌లు తీర్పు ఇస్తే… లేదు, జ‌నంలోనే ఉంటామ‌ని ఎమ్మెల్యేలు అన‌డం కూడా మంచి సంస్కృతి కాదు క‌దా. ఈ విమ‌ర్శ‌కు జ‌గన్ ద‌గ్గ‌రున్న స‌మాధాన‌మేంటి..? కానీ, కొమ్మినేని ఇది అడ‌గ‌లేదే..!

నిజానికి, పైన చెప్పుకున్న అంశాల‌పై మ‌రింత స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం ద్వారా జ‌గ‌న్ మాట‌ల‌కు మ‌రింత విలువ పెరుగుతుంది. విమ‌ర్శించేవారు త‌గ్గుతారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై వ‌క్రీక‌ర‌ణ‌కు ఆస్కారం లేకుండా చేసిన‌ట్టు అవుతుంది. ఈ సుదీర్ఘ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ద్వారా క్లారిటీ ఇవ్వొచ్చు. ఇవే ప్ర‌శ్న‌లు ఇత‌ర మీడియా సంస్థ‌లు అడిగితే జ‌గ‌న్ స‌మాధానం చెప్తారా..? అలాంటి ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి, సొంత మీడియాలోనే ప్ర‌స్తుతం వివిధ వర్గాల్లో వ్య‌క్త‌మౌతున్న అనుమానాల‌పైనా, భిన్నాభిప్రాయ‌ల‌పైనా మ‌రింత స్ప‌ష్ట‌త రాబ‌ట్టాల్సింది…! కానీ, కొమ్మినేని అడ‌గ‌లేదే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com