కృష్ణా బోర్డు పై ఆంధ్రా – తెలంగాణ తగాదా ఎందుకు?

  • కృష్ణా వాటర్ మేనేజిమెంటు బోర్డు కి తెలంగాణా అడ్డంకి!
  • విభజన చట్టం ప్రకారమే నీళ్ళు ఇవ్వాలి – ఆంధ్రప్రదేశ్ వాదన!
  • సాగర్ గేట్లు మేమే కంట్రోల్ చేస్తాం – దేవినేని ఉమ!
  • కుదరనే కుదరదు – హరీష్ రావు!
  • రెండు రాష్ట్రాల చర్చలు విఫలం!!
  • తెలుగురాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోతే కేంద్రం జోక్యం!
  • షెడ్యూలులో లేని 2 ఎత్తిపోతల పధకాలకోసమే తెలంగాణా పేచీ?

కృష్ణా జలాల పంపకాలపై , తెలంగాణ మంత్రుల మధ్య చర్చలు మళ్ళీ విఫలమయ్యాయి. రెండు రాష్ట్రాల మంత్రులు కేంద్రజల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్ జిత్ సింగ్ తో ఢిల్లీలో జరిపిన చర్చలు ఫలించలేదు. ఏ నిర్ణయమూ లేకుండానే రెండురోజుల సమావేశం గురువారం ముగిసింది. నాగార్జున సాగర్ కుడికాలువ గేట్లు తామే నిర్వహిస్తామని ఏపీ చెప్పగా..తెలంగాణ వ్యతిరేకించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్తామని హరీష్ రావు అంటుంటే… విభజన చట్టం ప్రకారమే తాము పోరాటం చేస్తున్నామని దేవినేని ఉమా మహేశ్వరరావు చెబుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ వ్యవహరించిన తీరును కేంద్రానికి నివేదించామన్నారు.

కృష్ణా జలాల వివాదాల్ని తెలుగురాష్ట్రాలు ఉమ్మడి చర్చల ద్వారా పరిష్కరించుకోడానికి నవంబరు 1 వరకూ కేంద్రం గడువు పెట్టింది. అప్పటికీ తగాదాలు పరిష్కారం కాకపోతే కేంద్రమే జోక్యం చేసుకుంటుందని కేంద్రజలవనరులశాఖ ప్రకటించింది .

తెలుగు రాష్ట్రాలలో కృష్ణా నదిపై నిర్మించబడి, వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల నియంత్రణను విభజన చట్టం మేరకు నది యాజమాన్య బోర్డుకు అప్పగించాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్ళయినా కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇప్పుడు ఆవైపు అడుగులు వేయడానికి బొర్డు చొరవ ప్రదర్శిస్తే, ఆ ప్రక్రియను అడ్డుకొనే పనిలో తెలంగాణ ప్రభుత్వం పడింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ఆర్.డి.యస్ ( రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ) వద్దే కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల రైతులు గొడవపడే వారు. రాష్ట్ర విభజన తరువాత శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద నీటి వినియోగంపై తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటున్నది. రెండు సార్లు రెండు రాష్ట్రాల పోలీసులే తన్నుకొనే దుస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసి, ఘర్షణలకు ఆస్కారం లేకుండా చూడాలన్న బాధ్యతను వొదిలేసింది.

ఎట్టకేలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో కాస్త చలనం వచ్చినట్లున్నది. బోర్డుకు అధికారాలను దఖలు పరిచే ముసాయిదా నోటిఫికేషన్ ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది…అంతే, రగడ మొదలయ్యింది. ముందరి కాళ్ళకు బంధం వేయాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అసంబద్ధమైన వాదనలు, ఆరోపణలతో బోర్డు పూర్తి స్థాయిలో పని చేయడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించే పనిలో పడింది.

కృష్ణా నది యాజమాన్య బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కనుసన్నల్లో పని చేస్తున్నదని ఆరోపిస్తూ, నోటిఫికేషన్ జారీ చేయవద్దని తెలంగాముఖ్యమంత్రి కెసిఆర్ , నీటి పారుదల మంత్రి హరీష్ రావు కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి కి ఫిర్యాదులు చేశారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఈ వివాదం విచారణలో వుందని, తెలంగాణ వాటా సంగతి తేలిన తరువాతనే నోటిఫికేషన్ జారీ చేయాలనే వాదనను ముందుకు తెచ్చారు.

బచావత్ ట్రిబ్యునల్ 75% నీటి లభ్యత ప్రామాణికంగా నికర జలాలను నిర్ధారించి, చేసిన పంపిణిని సమీక్షించే అవకాశం లేదని, ఆ కేటాయింపులను యధాతథంగా తన తీర్పులోనూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పొందుపరచింది. మిగులు జలాల వినియోగంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ స్వేచ్ఛ కల్పించింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ స్వేచ్ఛను హరించి వేసింది. 65% నీటి లభ్యత ప్రామాణికంగా అదనంగా 263 టియంసిలు, ఆపైన కూడా 4 టియంసిల మిగులు జలాలు లభిస్తాయని నిర్ధారించి కేచ్ మెంటు ఏరియా లోని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది.

ఇది తెలుగు ప్రజల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా భావించి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది. పర్యవసానంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయలేదు. ప్రస్తుతానికి బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమలులో ఉన్నది. దాని ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు నీటి వినియోగానికి సంబంధించిన కార్యాచరణను విభజన చట్టానికి అనుగుణంగా అమలు చేయాలి.

బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చేయబడ్డాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నందున బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకే నీటిని వినియోగించుకొనే హక్కు ఉంటుంది. నదీ జలాల వినియోగానికి సంబంధించి ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం. ట్రిబ్యునల్ తీర్పు ద్వారా సంక్రమించిన హక్కుల పరిరక్షణపై రాజీలేని పోరాటాన్ని రెండు రాష్ట్రాలు చేయవచ్చు. అందులో తప్పు పట్టాల్సిన పని లేదు. అయితే, వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం ఎవరు చేసినా చెల్లుబాటు కాదు.

బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 800 టియంసిల నికర జలాలను కేటాయించింది. ప్రాజెక్టుల వారిగా కేటాయింపులను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా డెల్టాకు 181.2 టియంసిలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 281(తెలంగాణ వాటా 106.2, ఆంధ్రప్రదేశ్ వాటా 174.8), మున్నేరు ప్రాజెక్టుకు 3.3, వికె పురం పంపింగ్ స్కీమ్ 2.6, గుంటూరు చానల్ 4, కోస్తాలో మైనర్ ఇరిగేషన్ పద్దు క్రింద 11.54, మొత్తం 377.47 టియంసిలను కేటాయించింది.

రాయలసీమ ప్రాంతంలోని కె.సి.కెనాల్ 39.9, తుంగభద్ర ఎగువ కాలువ 32.5, తుంగభద్ర దిగువ కాలువ 29.5, బైరవానితిప్ప 4.9, గాజులదిన్నె 2, మైనర్ ఇరిగేషన్ పద్దు క్రింద 13.9, మొత్తం 122.7 కేటాయించింది.

తెలంగాణలోని రాజోలి బండ మళ్ళింపు పథకానికి 15.9, జూరాల ప్రాజెక్టుకు 17.84, పాకాల్ లేక్ 2.6, వైరా 3.7, పాలేరు 4, డిండి 3.7, కోయిల్ సాగర్ 3.9, మూసి 9.4, లంకసాగర్ 1, కోటిపల్లివాగు 2, ఓకచెట్టివాగు 1.9, హైదరాబాదు త్రాగు నీరు 3.9, మైనర్ ఇరిగేషన్ పద్దు క్రింద 90.82, మొత్తం 266.83 టియంసిలను కేటాయించింది. మిగిలిన 33 టియంసిలను శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి పద్దు క్రింది పేర్కొనబడింది.

బచావత్ తీర్పు తదనంతరం ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం జరిగింది. కృష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే నీటిలో 20 టియంసిలను మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించబడుతున్న భీమా పథకానికి సర్దుబాటు చేశారు. పునరుత్పత్తి ద్వారా లభించే 11టియంసిలకు తోడు కెసి కెనాల్ ఆధునీకీకరణ ద్వారా లభించే 8 కలిపి మొత్తం 19 టియంసిలను యస్.ఆర్.బి.సి.కి కేటాయించి, నిర్మించుకోవడం జరిగింది. తుంగభద్ర జలాశయం నుండి కెసి కెనాల్ కు కేటాయించిన 10 టియంసిలను అనంతపురం జిల్లాలో నిర్మించబడిన పిఎబిఆర్ కు సర్దుబాటు చేసి, కెసి కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుండి 10 టియంసిలను సర్దుబాటు చేయడం జరిగింది.

వాస్తవాలు ఇలా ఉంటే ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులే జరగలేదని తెలంగాణా వాదిస్తున్నది.

విభజన చట్టంలో పేర్కొన్న మేరకు అపెక్స్ కౌన్సిల్, యాజమాన్య బోర్డులనైతే ఏర్పాటు చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు చైర్మన్ గా నియమించబడిన వ్యక్తి పదవీ విరమణ చేశారు. మరొకరిని ఇంకా నియమించ లేదు. పూర్తి కాలం పని చేసే కార్యదర్శిని కూడా నియమించలేదు. బోర్డు బాధ్యతలను వివరిస్తూ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ను జారీ చేయలేదు.

చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలి. అందుకు విరుద్దంగా తాత్కాలిక కార్యాలయాన్ని హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పని చేసే బోర్డుకు చట్టంలో పేర్కొన్న మేరకు బాధ్యతలను, అధికార పరిథులను నిర్ధేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి, పూర్తి స్థాయిలో పని చేయించడానికి చర్యలు చేపట్టలేదు. ఇందువల్లే శ్రీశైలం, సాగర్ జలాశయాల వద్ద ఘర్షణలతో కొన్ని చేదు అనుభవాలను చవి చూడవలసి వచ్చింది.

ఈ ఏడాది తీవ్రమైన నీటిఎద్దడి వుంది. శ్రీశైలం రిజర్వాయిర్ కు పై నుండి 65 టియంసిల నీళ్ళు కూడా రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్నితాత్కాలిక ప్రాతిపధికపై పరిష్కరించడానికి సమావేశాలు నిర్వహించి, త్రాగు నీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేస్తూ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వాటిని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నఆరోపణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది.

చట్టంలో పేర్కొన్న పై బాధ్యతలను బోర్డు నిర్వర్తించడానికి అనుగుణంగా వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం జారీ చేయాలి.

కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి, బోర్డుకు నియంత్రణ అధికారాలను దఖలు పరిస్తే తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బోర్డు, అపెక్ కౌన్సిల్, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా నిర్మించడం సాధ్యం కాదు. అందుకే నోటిఫికేషన్ జారీని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టమైపోతున్నది.

నికర జలాల కేటాయింపుకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులే శిరోధార్యమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నది. విభజన చట్టంలో కూడా నికర జలాల వినియోగంపై ట్రిబ్యునల్ తీర్పే ఫైనల్ అని పేర్కొన్నతరువాత కూడా లేని వివాదాన్ని దురుద్ధేశంతో లేవనెత్తి బోర్డుపై ఆరోపణలు చేయడం, నోటిఫికేషన్ జారీని అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం ఎంతవరకు కరెక్టు?

సుప్రీం కోర్టులో నడుస్తున్న కేసు పరిష్కారమై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి వస్తే, అప్పుడు మిగులు జలాల వినియోగంపై ట్రిబ్యునల్ తీర్పే శిరోధార్యమవుతుంది. దానికి అనుగుణంగా మిగులు జలాలను వాడుకోవలసి వస్తుంది. తదనుగుణంగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తు౦ది.

అపెక్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టకూడదు. ఒక వేళ దిక్కరించి నిర్మాణానికి పూనుకొంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొత్తది కాదని, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టని తెలంగాణ ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేస్తున్నది. జూరాల జలాశయం వద్ద నుండి ప్రతిపాధించబడ్డ ఆ పథకం యొక్క సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం కోసం మాత్రమే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత ఆ ప్రాజెక్టును శ్రీశైలం జలాశయం నుండి నీటిని తరలించే లక్ష్యంతో నిర్మించ తలపెట్టారు. దానికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జల సంఘం అనుమతి విధిగా తీసుకోవాలి.

పాలమూరు – రంగారెడ్డి పథకం నిర్మాణంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో లేదు. హంద్రీ-నీవా, తెలుగు గంగ, గాలేరు-నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులను మాత్రమే పదకొండవ షెడ్యూల్ లోని పదవ సంఖ్య క్రింద చేర్చారు. ఎందుకో మరి, నిర్మాణంలో ఉన్న యస్.యల్.బి.సి. ఈ జాబితాలో చేర్చలేదన్న విషయాన్ని కూడా గమనించాలి. ఆ ప్రాజెక్టును జాబితాలో చేర్చకపోయినా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిర్మాణంలో ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు.

రాష్ట్రం విడిపోయాక నీటి విషయంలో హక్కుల పోరాటమే గానీ, సర్దుబాట్లకు అవకాశాలే లేవు. దక్షిణ తెలంగాణ, రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల నీటి సమస్యను శాశ్వతంగా తీర్చాలనే చిత్తశుద్ధి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉంటే గోదావరి –కృష్ణా – పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని సత్వరం చేపట్టి, పూర్తి చేయాలి. ఈ పథకాన్ని నదుల అనుసంధానంలో భాగంగా జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడిగా కేంద్రప్రభుత్వాన్ని కోరాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com