రివ్యూ : కుమారి శ్రీమతి (అమెజాన్ వెబ్ సిరిస్)

కుటుంబకథా నేపధ్యంలో వెబ్ సిరిస్ చేసి అందరిని మెప్పించడం.. మిగతా జోనర్స్ కంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ మలుపులతో, మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ తో సంచలనాలు సృష్టించేసి, రానున్న ఎపిసోడ్స్ పై అమాంతం ఆసక్తిని పెంచేయడం కుదరదు. కుటుంబంలో సాధారణంగా ఏం జరుగుతుందో అది చూపించాలి. అందులోనే నవ్యత వెతుక్కోవాలి. మానసిక సంఘర్షణని పట్టుకోవాలి. కథలో కనిపించిన పాత్రలు మన చుట్టూ వున్నవే అనే భావన కలిగించాలి. స్వప్న సినిమాస్ ‘కుమారి శ్రీమతి’తో ఇలాంటి ఒక ఫ్యామిలీ సిరిస్ ని అందించే ప్రయత్నం చేసింది. శ్రీనివాస్ అవసరాల షో రన్నర్ గా, గోమటేశ్‌ ఉపాధ్యేయ దర్శకత్వంలో ఈ సిరిస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైయింది. ఏడు ఎపిసోడ్స్ గల ఈ ఫ్యామిలీ సిరిస్ ఎలాంటి వినోదాల్సి పంచింది ? ఇటుకలపూడి కుమారి శ్రీమతి ప్రయాణం ఎలా సాగింది ?

గోదావరి జిల్లాలో రామరాజులంక అనే పల్లెటూరు. ఆ ఊర్లో గోదావరి ఒడ్డున ఓ అందమైన ఇల్లు. ఆ ఇంటికి యజమాని ఇటుకలపూడి ప్రభాకర్ రావు (మురళి మోహన్) ఆయన భార్య శేషమ్మ( రామేశ్వరి). వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు విశ్వం (నరేష్) చిన్నకొడుకు కేశవ(ప్రేమ్ సాగర్). విశ్వం భార్య దేవిక (గౌతమి) వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కూతురు కుమారి శ్రీమతి అలియాస్ సిరి (నిత్యా మీనన్) చిన్న కూతురు కల్యాణి. కేశవకి ఇద్దరు అబ్బాయిలు.. మణి, ఫణి. ఎంతో కష్టపడి రెక్కలకష్టంతో కట్టుకున్న ఇల్లు అంటే ప్రభాకర్ రావుకి ఎంతో మమకారం. ఎన్నికష్టాలు వచ్చినా ఈ ఇల్లు అమ్మకూడదని మనవరాలు కుమారి దగ్గర చిన్నప్పుడే మాట తీసుకుంటాడు. కాలం గడుస్తుంది. ప్రభాకర్ రావు చనిపోతాడు. విశ్వం ఏవో వ్యాపారాలు చేసి దివాలా తీసి కుటుంబాన్ని వదిలి ఎక్కడికో పారిపోతాడు. మరిది కేశవ తీరు నచ్చక ఇద్దరు పిల్లతో పాటు అత్తగారు శేషమ్మతో కలసి ఆ ఇంటి నుంచి అద్దె ఇంటికి మారిపోతుంది దేవిక. శుభ కార్యాలకు పిండివంటలు చేస్తూ ఇద్దరి పిల్లల్ని పెంచుతుంది. పిల్లలు పెద్ద అవుతారు. కేశవ ఇంటిని అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆస్తిలో తమకీ వాటా వుందని, ఇల్లు అమ్మడానికి వీలు లేదని కుమారి కోర్టుని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తుంటుంది. ఇంతలో ప్రభాకర్ రావు రాసిన వీలునామా కేశవకి దొరుకుతుంది. అందులో ఆస్తులన్నీ కేశవ పేరుమీదే రాసినట్లువుంటుంది. వీలునామాని పరిశీలించిన కోర్టు.. ఆ ఇంటి విలువ 38 లక్షలుగా నిర్ణయిస్తుంది. కావాలంటే ఆ డబ్బు ఇచ్చి ఇంటిని సొంతం చేసుకోవచ్చని కుమారికి ఓ ఆరునెలలు గడువు ఇస్తోంది న్యాయస్థానం. నెలకి పదిహేను వేలు జీతం కోసం పని చేస్తున్న కుమారి ఆరు నెలల్లో అంత డబ్బుని ఎలా సంపాయిస్తుంది ? దాని కోసం కుమారి ఎలాంటి ప్రయత్నాలు చేసింది ? అసలు ప్రభాకర్ రావు అంత ఏకపక్షంగా వీలునామ ఎలా రాశాడు ? విశ్వం ఎక్కడికి వెళ్ళాడు ? చివరికి ఇల్లు కుమారి సొంతం అయ్యిందా లేదా ? అనేది తక్కిన కథ.

రజనీకాంత్, కలాం, ఇటుకలపూడి కుమారి శ్రీమతి… ఈ సిరిస్ మొదటి ఎపిసోడ్ టైటిల్ ఇది. పేరు చదవగానే ఓ నవ్వు విచ్చుకుంటుంది. ఈ సిరిస్ చూస్తున్నంత సేపు గడియారంలో సెకండ్ల ముల్లులా పెదవిపై ఓ చిరునవ్వు కదులుతూనే వుంటుంది. ఇటుకలపూడి కుమారి శ్రీమతి.. చివరి ఎపిసోడ్ వరకూ ప్రేక్షకుడిని తనతోపాటు సరదాగా తీసుకెళ్ళిపోతుంది.

ఈ సిరిస్ కథ రాసినప్పుడు కుటుంబంలోని ప్రతి పాత్ర గురించి రాయడం జరిగింది. ఈ కథని ‘’తాతకి ఇష్టమైన ఇంటిని సొంతం చేసుకోవాలని తపనపడే ఓ మనవరాలి కథ ఇది’ అని ఒక్క లైన్ లో సింపుల్ గా చెప్ప్పొచ్చు. కానీ ఈ కథకు ఆ కుటుంబమే అసలైన అందాన్ని తీసుకొచ్చింది.

తాతల ఆస్తుల కోసం న్యాయపోరాటం చేసే కథలు బోలెడు వచ్చాయి. ఇందులో కూడా కుమారి బాబాయ్ పై పోరాటం చేస్తుంది. కానీ ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. కుమారి మమకారం ఇంటిపై కానీ ఆస్తిపై కాదు. అలా అని ఇందులో ఏ ఎమోషన్ కూడా బలవంతంగా వుండదు. అన్నీ సహజంగా కుదిరిపోతాయి. తొలి ఎపిసోడ్ లో కుమారి కుటుంబం పరిచయం అవుతుంది. అందులో పాత్రలన్నీ పరిచయంలోనే నచ్చేస్తాయి.

బేసిగ్గా ఒక వెబ్ సిరిస్ కథల్లో ఎమోషన్ ప్రేక్షకులకు పట్టడానికి రెండు మూడు ఎపిసోడ్స్ తీసుకుంటాయి. కానీ కుమారిలో మాత్రం ఒక మ్యాజిక్ జరిగింది. ఇల్లు ఇక కుమారికి వచ్చే అవకాశం లేదని కోర్టులో తెలిసినపుడు.. ఇంటికి ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది కుమారి. అది చూస్తునపుడు.. ప్రేక్షకుడి కళ్ళలో కూడా నీళ్ళు తిరిగేస్తాయి. బహుసా కంటెంట్ తో పాటు నిత్య మీనన్, గౌతమి, రామేశ్వరి వంటి బలమైన నటులు దీనికి కారణం కావచ్చు.

తాజ్ మహల్ బార్ అండ్ రెస్టారెంట్.. ఈ కథలో మరో ఆసక్తికరమైన కోణం ఇది. ఆరు నెలల్లో 38 లక్షలు సంపాయించడం.. ఇలాంటి టైం టాస్క్ లు ఛాలెంజ్ సినిమా నుంచి జనాలు చూస్తున్నవే. కానీ కుమారిలో ఒక ప్రత్యేకత వుంది. చాలా సంక్లిష్టమైన ఒక అంశాన్ని చాలా లైటర్ వెయిన్ లో డీల్ చేస్తుంది ఈ కథ. దాదాపు నాలుగు ఎపిసోడ్స్ తాజ్ మహల్ బార్ అండ్ రెస్టారెంట్ అండ్ రెస్టారెంట్ చుట్టూ తిరుగుతాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి.. ఎడిపిస్తాయి.. అలోచింపజేస్తాయి.

ఈ కథలో చర్చించిన ఒక లోతైన అంశం ఏమిటంటే… ఒక దేశ రాజ్యాంగం, ప్రభుత్వాలు, న్యాయసస్థానాలు పెట్టె రూల్స్ కాకుండా సమాజంలోని మనుషులు పెట్టుకునే రూల్స్ కొన్ని వుంటాయి. అవి బయటికి కనిపించవు. ప్రింట్ రూపంలో ఎక్కడా దొరవు. కానీ మనిషి ఆలోచన పొరల్లో బలంగా ప్రింట్ అయిపోయింటాయి. ఈ కథనే పరిశీలిస్తే.. కుమారి హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటుంది. హోటల్స్, రెస్టారెంట్, బార్స్ లో హుందాగా పని చేయడం ఆమె వృత్తి. ఆమె స్వతహాగా వ్యాపరం పెట్టుకోవాలంటే.. తన చదువకున్న నేపధ్యంలోనే ఆలోచిస్తుంది. ఈ క్రమంలో బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుకొని తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటుంది. అయితే అమ్మాయిలు బార్ అండ్ రెస్టారెంట్ లు నడపడం ఏమిటి ? మరేం పనులు కనిపించలేదా ? అని ఇరుగుపొరుగు మాట్లాడుకుంటారు. ఇవన్నీ భరించి వాటిని ఎదుర్కొని తన లక్ష్యాన్ని చేరుకుతుంది కుమారి.

లోతుగా ఆలోచిస్తే.. హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న కుమారికి కుట్టు మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు కదా అని సలహా ఇవ్వడం ఎంత సంకుచితమో అర్ధమౌతుంది. ఆలోచన పొరల్లో ముద్రపడిపోయిన కొన్ని పడికట్టు నియమాలని చెరిపేయాలనిపిస్తుంది. ఒక అమ్మాయి బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుకోవడం స్త్రీ సాధికారత కాదు.. దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. అది సమానహక్కు అని ఫీలయితే ఈ కథ సారాన్ని అర్ధం చేసుకున్నట్లే.

కథలో ప్రతిపాత్రని రాసుకున్న తీరు చాలా బావుటుంది. ప్రతి డిటెయిల్ కి ఒక ప్రయోజనం వుంటుంది. ఇందులో కుమారికి హీరో నాని అంటే ఇష్టం. నాని సినిమాలే చూస్తుంది. సడన్ గా ఒక రోజు నాని ఆమె ముందు ప్రత్యేక్షమౌతాడు. ఆ సన్నివేశం కొంచెం సినిమాటిక్ లిబార్టీ అనిపించినా ముందు నుంచి ఆ పాత్రని నడిపిన తీరు సహజత్వాన్ని జోడిస్తుంది. సడన్ గా మనకి ఇష్టమైన హీరో కనబడితే.. మన మాటపడిపోతుంది. మీరు అంటే నాకు అభినమానం అని చెప్పడం తప్ప మరో మాట రాదు. ఆ స్థితిని ఇందులో చాలా బాగా చూపించారు. పైగా నాని రాకతో కుమారి ప్రయాణంలో కూడా ఒక ప్రయోజనం చేకూరుతుంది.

ప్రతి ప్రయాణంలో ఎత్తుపల్లాలు వునట్లే ఇందులో కూడా కొన్ని లోటుపాట్లు వున్నాయి. బార్ చుట్టూ నడిపిన సన్నివేశాలు కొన్ని రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మహిళలు బార్ పై దాడి చేయడం, వాళ్ళకి తగిన నిమయమాలతో బార్ నడపటం అనవసరమైన వివరాలుగా అనిపిస్తాయి. అలాగే అభి ( తిరువీర్) కుమారికి మధ్య నడిచే సన్నివేశాలు ఫిదా సినిమా లాంటి సంఘర్షణతో వుంటాయి. అలాగే శ్రీరామ్ ( నిరుపమ్) ట్రాక్ కూడా కాస్త అయోమయంగానే వుంటుంది. ఈ రెండు పాత్రలకు సరైన ముగింపు సెకండ్ సీజన్ లో ఉంటాయో చూడాలి. ఇందులో కొన్ని పాటలు వున్నాయి కానీ అవి పెద్ద ప్రత్యేకతని తీసుకురాలేదు. బార్ లో పాడుకున్న పాట ఎదో మోడరన్ టచ్ లో చేద్దామని అనుకున్నారు అది సింక్ అవ్వలేదు. పైగా అప్పటివరకూ ఎంతో సహజంగా వున్న వాతావరణంను ఇలాంటి పాట పెట్టి ఎందుకు పాడు చేస్తున్నారనే ఫీలింగ్ కూడా కలిగిస్తుంది.

వెబ్ సిరిస్ ని నడపాలంటే సస్పెన్స్ ని హోల్డ్ చేసే నేర్పు వుండాలి. ఇది ఫ్యామిలీ సిరిస్ అయినప్పటికీ ఇందులో విశ్వం పాత్ర రూపంలో పెద్ద సస్పెన్స్ ని నడిపారు. ఎక్కడికెళ్ళాడో తెలియని మనిషి సడన్ ప్రత్యేక్షమౌతాడు. కుటుంబం అంటే చాలా ఇష్టం అని చెబుతాడు. నిజంగా వాడిని నమ్మాలా వద్దా అనే అనుమానం కుటుంబంలోనే కాదు ప్రేక్షకుడిలో కూడా కలుగుతుంది. చివరి ఎపిసోడ్ ని ఇదే సంఘర్షణతో సెకండ్ సీజన్ పై ఆసక్తిని పెంచారు. అంతేకాదు తాతరాసిన అసలైన వీలునామా కుమారికి దొరుకుతుంది. అందులో ఏముందో అనేది సస్పెన్స్. ఈ రెండు సెకండ్ సీజన్ పై కావాల్సిన క్యురియాసిటీని పెంచాయి. నిజానికి థ్రిల్లర్ సిరిస్ ల ఇలాంటివి కుదురుతుంటాయి. కానీ ఫ్యామిలీ కథలో కూడా ఇలాంటి సస్పెన్స్ ని పట్టుకోవడం బావుంది.

నిత్యామీనన్ నటన ఈ సిరిస్ కి ప్రత్యేక ఆకర్షణ. సిరిస్ అంతా తన చుట్టూనే తిరుగుతుంది. కుమారి పాత్ర దాటి ఆమె బయటికి రాలేదు. కుమారి పాత్రని వోన్ చేసుకున్న తీరు చాలా బావుంది. గౌతమి పాత్ర మరో ఆకర్షణ. దేవిక పాత్రని చాలా హుందా, సహజంగా చేశారామె. సీమంతంలో తన కూతురు గురించి చెప్పే సీన్ కన్నీళ్లు తెప్పిస్తుంది. అలాగే రామేశ్వరి కూడా. బాబాయ్ కేశవ పాత్రలో చేసిన ప్రేమ్ సాగర్ భలే గమ్మత్తుగా చేశాడు. వాళ్ళ అబ్బాయిలుగా చేసిన మణి ఫణి కూడా చాలా నవ్విస్తారు. వాళ్ళు అమాయకులు అనుకోవడం ప్రేక్షకుడి పొరపాటు అవుతుంది. వాళ్ళు ఎంత మాయకులో చివర్లో భలే గమ్మత్తుగా తెలుస్తుంది. తిరువీర్, నిరుపమ్ పాత్రలు పద్దతిగా వుంటాయి. దొరబాబు ( గవిరెడ్డి శ్రీనివాస్) పాత్ర అయితే కనిపించగానే నవ్వొస్తుంది. గోదారి యాసని భలే పట్టుకున్నాడు. మహేష్ ఒక పాత్ర చేశాడు. ఫస్ట్ నైట్ డ్రీమ్ సీన్ అయితే పగలబడి నవ్వేలా వుంటుంది. అంతేకాదు ఇందులో కొన్ని డ్రీమ్ సీన్స్ వుంటాయి. అవన్నీ భలే సరదాగా వర్క్ అవుట్ అయ్యాయి. చివర్లో వచ్చిన నరేష్ పాత్ర సెకండ్ సీజన్ పై ఆసక్తిని పెంచుతుంది.

సాంకేతికంగా సిరిస్ బావుంది. మంచి నేపధ్య సంగీతం వుంది. కెమారపనితనం నీట్ గా వుంది. గోదావరి, లాంచీ, ఆ ఇల్లు .. భలే కుదిరాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. శ్రీనివాస్ అవసరాల మాటలు. భలే అందంగా వున్నాయి. తెలుగుని ఇంత అందంగా రాయొచ్చు అనేలా వున్నాయి. ఇందులో మాటల స్పెషాలిటీ ఏమిటంటే.. నవ్విస్తాయి, కితకితలు పెడతాయి, వెంటనే కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చేస్తాయి. ఒక్కటని చెప్పడానికి లేదు.. చాలా మంచి తెలుగు మాటలు వున్నాయి. మాటలకు మంచి ప్రవాహం వుంటుంది. కొన్ని పాత్రలు మాట్లాడినప్పుడు శ్రీనివాస్ అవసరాల కళ్ళముందు కదులుతాడు కూడా. స్వప్న సినిమాస్ నిర్మాణ విలువలు ఈ సిరిస్ కి మరో ప్రధాన ఆకర్షణ. చాలా సహజంగా ఈ సిరిస్ ని తీశారు. క్యాలిటీలో ఎక్కడా రాజీపడినట్లు అనిపించలేదు.

వెబ్ సిరిస్ మాట పక్కన పెడితే అచ్చ తెలుగు సినిమా వచ్చి చాలా కాలమైయింది. అచ్చ తెలుగు ముద్రతో స్వప్న సినిమాస్ నిర్మించిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో కూడా కాస్త పాశ్చాత్య ధోరణి కనిపిస్తుంది. కానీ కుమారి శ్రీమతి అచ్చమైన అచ్చ తెలుగు కథ. తెలుగులో చాలా వెబ్తె సీరిస్ లు వచ్చాయి. వాటిలో ఇది బెస్ట్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు దనంతో మనసు ఆహ్లాదాన్ని ఇచ్చే కథ. తీరిక సమయంలో కాదు సమయం కుదుర్చుకొని చూడదగ్గ సిరిస్ కుమారి శ్రీమతి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close