మ‌హాస‌భ‌ల ప్ర‌చారం ఘ‌నం.. ఏర్పాట్లు గంద‌ర‌గోళం!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా ఘ‌నంగా చేయాల‌నుకుంటారు. ఏం చేసినా భారీ ఎత్తున ప్ర‌చారం రావాల‌ని ఆశిస్తారు. ఇదే రీతిలో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌ను కూడా అత్యంత ప్ర‌తిష్ఠాత్మంగా, ఘ‌నంగా, అంగ‌రంగ వైభవంగా, అత్యంత ఆర్భాటంగా నిర్వ‌హించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అంటే, ఏర్పాట్లు ఏస్థాయిలో ఉండాలి..? స‌భ‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌ణాళిక ఎంత ప‌క‌డ్బందీగా ఉండాలి..? త‌ర‌లి వ‌చ్చే ప్ర‌ముఖ క‌వులూ క‌ళాకారులూ భాషాభిమానుల‌కు స‌రైన రీతిలో స్వాగ‌త స‌త్కారాలూ, వారి ప్ర‌సంగాల‌కు అనువైన స‌మ‌యాల కేంటాయింపు, ఇత‌ర సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ప్ర‌ణాళిక‌… ఇలా చాలా ఉంటాయి క‌దా. అయితే, ఇప్పుడు వీటి గురించి చ‌ర్చ ఎందుకంటే… స‌భ‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌నుకునే స‌ర్కారువారు, ఏర్పాట్ల‌ విషయంలో గంద‌ర‌గోళానికి గురౌతున్నార‌ట‌! మ‌హాస‌భ‌లు నిర్వ‌హించేస్తామ‌ని మ‌హా ప్ర‌చారం చేసుకుంటున్నారుగానీ, ఏర్పాట్ల‌లో స‌ర్కారు వారికే స్ప‌ష్ట‌త లేద‌ని కొంత‌మంది ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ స‌భ‌ల ఏర్పాట్ల‌ను తెలంగాణ తెలుగు అకాడ‌మీ ప‌ర్య‌వేక్షిస్తోంది. అయితే, ఏ ద‌శ‌లోనూ ఏర్పాట్ల‌లో స్ప‌ష్ట‌త క‌నిపించ‌డం లేదు! పెద్ద ఎత్తున క‌వుల‌నూ పండితులనూ స‌భ‌ల‌కు ర‌మ్మంటూ ఆహ్వానాలు అయితే పంపించేశారు. కానీ, వారు ఏరోజు స‌భ‌కి రావాలీ, ఏ అంశంపై మాట్లాడాలీ, వ‌రుస క్ర‌మంలో మాట్లాడేవారికి కేటాయించిన స‌మ‌య‌మేంటీ.. ఇవేవీ ఇంకా ఫిక్స్ కాలేద‌ట‌! దీంతో స‌ద‌రు ఆహ్వానితులు తీవ్ర గంద‌ర‌గోళానికి గురౌతున్నారు. అంటే, ఏరోజు ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌న్న స్ప‌ష్ట‌త నిర్వాహకులే లేద‌న్న‌మాట‌! ఇక‌, స‌భ‌కు స‌రిగ్గా మూడంటే మూడు రోజుల ముందు వ‌ర‌కూ కార్య‌క్ర‌మాల బుక్ లెట్ విడుద‌ల చేయ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం! కొంత‌మంది నాయ‌కులు, ఉన్న‌తాధికారులూ ఈ కార్య‌క్ర‌మ షెడ్యూల్ త‌యారీలో మితిమీరిన జోక్యం చేసుకోవ‌డంతోనే ఈ ఆలస్యానికి కార‌ణం అని తెలుస్తోంది. అయితే, ఎట్ట‌కేల‌కు బాగా క‌స‌ర‌త్తు చేసి కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణా విధివిధాల‌ను ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి విడుద‌ల చేశారు. తీరా, ఆ బుక్ లెట్ తెరచి చూస్తే… అందులో ఇంగ్లిష్ ప‌దాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ట‌! అంటే, ఈ క‌ర‌ప‌త్రం రూప‌క‌ల్ప‌న‌లో వారు చూపించిన శ్ర‌ద్ధ ఏంట‌నేది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు.

ఇక‌, ఆహ్వానాల విష‌యానికొస్తే… 13 మంది జ్ఞాన‌పీఠ్ అవార్డు గ్రహీత‌ల‌ను స‌భ‌ల‌కు ఆహ్వానిస్తే, ఇంత‌వ‌ర‌కూ ముగ్గురు మాత్ర‌మే వ‌స్తున్న‌ట్టు త‌మ ద‌గ్గ‌ర స‌మాచారం ఉంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ఆహ్వానితులు.. త‌మ షెడ్యూల్ ఏంట‌ని తెలంగాణ సాహిత్య అకాడ‌మీకి ఫోన్ చేస్తే.. వివ‌రాలు వెబ్ సైట్ లో ఉన్నాయీ చూసుకోండ‌ని చెబుతున్నార‌ట‌! దీంతో వారు గంద‌ర‌గోళానికి గురౌతున్నారని స‌మాచారం. తెలుగు భాష ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం క‌ట్టాం, కంక‌ణం క‌ట్టుకున్నాం అంటూ గొప్ప‌లు చెప్పుకునే కేసీఆర్ స‌ర్కారు వారు… మ‌హా స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌లో చూపుతున్న శ్ర‌ద్ధ ఎంత‌నేది అర్థ‌మౌతూనే ఉంది. ఆహ్వానితుల విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు, క‌ర‌ప‌త్రంలో స్ప‌ష్ట‌త లేదు, కార్య‌క్ర‌మ షెడ్యూల్ లో స్ప‌ష్ట‌త లేదు… ఓవ‌రాల్ గా ఈ ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌లో స‌ర్కారువారి చిత్త‌శుద్ధి ఏంట‌నేది ప్ర‌శ్నార్థ‌కంగానే క‌నిపిస్తోంది. ఇక, సభలు నిర్వహణ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.