త‌మిళ సినిమా గుండెల్లో” రైడ్లు”…

భ‌య‌ప‌డే అంద‌రి గుండెల్లో రైళ్లు ప‌రిగెడ‌తాయేమో గాని, త‌మిళ సినిమా జీవుల గుండెల్లో రైడ్లు ప‌రిగెడుతున్నాయి. ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడినా, అధికార పార్టీ నేత‌ల్ని విమ‌ర్శించినా… వెంట‌నే అధికారుల‌కు స‌ద‌రు విమ‌ర్శించిన వ్య‌క్తి తాలూకు స‌క‌ల ప‌న్ను బ‌కాయిలు గుర్తొస్తాయి. దానితో పాటే అప్ప‌టిక‌ప్పుడు వారి విధులు, బాధ్య‌త‌లు కూడా. ఇది మ‌న దేశఃంలో ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న,. చోటు చేసుకుంటున్న అధికారిక బ్లాక్‌మెయిలింగ్ అన్నా త‌ప్పులేదేమో… నాటి ఇందిర అయినా నేటి న‌రేంద్రుడైనా… అధికారాన్ని ధిక్క‌రించే హ‌క్కును, ప్ర‌శ్నించే నోటిని మూయించాల‌నే ప్ర‌య‌త్నిస్తారు త‌ప్ప‌… స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త త‌మ మీద ఉంద‌నే విష‌యం గుర్తించ‌రు అనే వాస్త‌వానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు మ‌న‌కు త‌ర‌చు క‌న‌ప‌డుతూనే ఉన్నాయి.

ఇప్పుడు కూడా త‌మిళ‌నాడులో జ‌రుగుతోంది అదే. హీరో విజ‌య్ సినిమా మెర్స‌ల్ ప్ర‌భుత్వం మీద కాసిన్ని విమ‌ర్శ‌లు చేయ‌గానే అగ్గిమీద గుగ్గిలం అయిన అధికార పార్టీ నేత‌లు విజ‌య్‌కి కుల‌పిచ్చి సైతం అంట‌గ‌ట్ట‌డం తెలిసిందే. ఆ గొడ‌వ అలా ఉంచితే… ఆ క్ర‌మంలోనే బిజెపీ నేత రాజా మెర్స‌ల్ సినిమాను ఇంట‌ర్నెట్‌లో చూశా అని చెప్ప‌డం పై హీరో విశాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. అంత ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కుడు పైర‌సీ చూడ‌డం స‌బ‌బు కాద‌ని హిత‌వు ప‌లికాడు. క‌ట్ చేస్తే… ఒక్క రోజు వ్య‌వ‌ధిలో…

ఆదివారం విశాల్ కార్యాల‌యాల‌పై దాడులు జ‌రిగాయి. ఇవి జీఎస్టీకి సంబంధించిన దాడుల‌ని మీడియా కోడై కూసింది. మ‌ధ్యాహ్నం 2గంట‌ల స‌మ‌యంలో ఈ దాడులు జ‌రిగితే… సాయంత్రం 8గంట‌ల స‌మ‌యంలో అధికారులు ఈ వార్త‌ల‌ని ఖండించారు. మీడియాలో ప్ర‌చార‌మ‌వుతున్న‌ట్టుగా విశాల్ ఆఫీసుల‌పై తామేమీ జిఎస్టీ దాడులు నిర్వ‌హించ‌లేద‌ని వారు వివ‌ర‌ణ ఇచ్చారు. దీనిపై విశాల్ మాత్రం స్పందించ‌లేదు. అయితే ఆయ‌న కార్యాల‌య వ‌ర్గాలు మాత్రం అవి సాధార‌ణ త‌నిఖీలే త‌ప్ప దాడులు కావ‌ని సోమ‌వారం తెలియ జేశారు. ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించిన సాధార‌ణ ప‌రిశీల‌న మాత్ర‌మే జ‌రిగింద‌న్నారు.

స‌రే… ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా… మెర్స‌ల్ వివాదంలో ఆ సినిమాకు, విజ‌య్‌కు మ‌ద్ధ‌తుగా మాట్లాడిన వారంద‌రికీ ఇప్పుడు ప‌న్నుపోటు భ‌యం చుట్టుకుంద‌ని స‌మాచారం. మ‌న‌సుకు అనిపించింది వెంట‌నే అనేసిన ద‌ర్శ‌కుడు రంజిత్ లాంటివారు ఇంక వెన‌క్కు తీసుకునే ఛాన్సు లేక‌పోయినా… మ‌రికొంద‌రు మెర్స‌ల్‌కు జై అనే బాట‌లో ప‌య‌నించకుండా ఈ దాడుల వార్త బాగానే ప‌నిచేస్తుంద‌ని అనుకోవ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.