మంత్రులతో మోదీ – పార్టీతో షా…కలసి పనిచేయాలి

నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక సజావుగా సాగుతున్న పార్లమెంటు సమావేశాలు ఇవే…ఇది ప్రతిపక్షంతో కలసి పనిచేయవలసిన అవసరాన్ని మోదీ గ్రహించిన ఫలితం. విశ్లేషకుల ముందస్తు అంచనా ప్రకారమే బీహార్ ఓటమి తరువాత గాని మోదీకి ఈ ‘గ్రహింపు’ రాలేదు.

జి.ఎస్.టి బిల్లుకు పార్లమెంటు ఆమోదం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో మోదీ సుధీర్ఘ చర్చలు జరపటం విశేషపరిమాణం. మొదటి నుంచీ ఆయన ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటే ఇంతవరకూ జరిగిన పార్లమెంటు సమావేశాల్లో సమయం వృధా అయ్యేదికాదు.

ప్రభుత్వ నిర్వహణలో మోదీ, పార్టీ నిర్వహణలో అమిత్ షా ఒకేశైలితో వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ ఆదేశాలు ఇచ్చేవారుతప్ప కలిసి కూర్చుకి చర్చించేవారు కాదు. ఇద్దరూ కూడా స్వపక్షాన్ని దూరంగా వుంచి నాయకులుగా కాక, సిఇవొ లు అన్నట్ట కేంపెయిన్ చేయడమే బీహార్ ఓటమికి ఒక కారణం.

ప్రధానమంత్రి కార్యాలయం చాలా శక్తివంతమైనది. సమాచారంకోసమో, సమన్వయం కోసమో అన్ని శాఖలతో నిరంతరం టచ్ లో వుంటుంది. శక్తివంతమైన లాబీలు రంగంలో దిగితే ఈ కార్యాలయం ఇతర మంత్రిత్వ శాఖలను ఒక ఆట ఆడిస్తుంది కూడా! మోదీ ప్రధాని అయ్యాక అన్ని శాఖల పరిపాలననూ ప్రధాని కార్యాలయమే చేస్తోందన్నది ప్రధానవిమర్శ.

ఇంతవరకూ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన ప్రకటనలు, ప్రారంభోత్సవాలే జరిగాయి తప్ప అవి ఆశించిన స్థాయిలో అమలు కావటం లేదు. మంత్రులకు తమ శాఖలపై స్వయంప్రతిపత్తి లేకపోవటం వల్లనే అభివృద్ది పథకాలు ఆశించిన స్థాయిలో అమలు కావటం లేదని కూడా మోదీ గ్రహించాలి. విదేశీ పర్యటనకు వెళుతూ విదేశాంగ మంత్రిని దూరం పెట్టటం సరైన పని కాదు. మంత్రులందరిని కలుపుకుని పని చేస్తే దేశాభివృద్ది త్వరితంగా సాధ్యమవుతుందుంది.

మోదీ ప్రతిపక్షంతో చర్చించినట్టే, అమిత్ షా- మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ప్రభుత్వాన్ని, పార్టీకి ముందుకు నడిపించాలి. ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్నా బి.జె.పి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలకు ఇంత వరకు గుర్తింపు లేదు. పార్టీ విజయం కోసం ఆహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నా వేలాది పదవుల్లో నియమించే ప్రక్రియ చేపట్టడానికి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పూనుకోవాలి అందుకు ముందుగా ఆయన పార్టీతో మమేకం కావాలి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com