అలా విమ‌ర్శించాలంటే ప‌వ‌న్ కు మోహ‌మాట‌మా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. కొన్ని విష‌యాల్లో బాగానే స్పందిస్తారు. ప్ర‌శ్నించడానికే తాను ఉన్నాను అన్న‌ట్టుగా సూటిగా మాట్లాడ‌తారు! కానీ, మ‌రికొన్ని అంశాల‌పై మాత్రం సూటిగా స్పందించ‌డానికి ఆలోచిస్తున్నారేమో అనిపిస్తోంది. ఆంధ్రాకి కేంద్రం చేసిన అన్యాయం గురించి గ‌తంలో చాలాసార్లు సూటిగానే కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా విష‌య‌మై టీడీపీ ఎంపీలు చేసిన ప్ర‌య‌త్నాన్ని కూడా గ‌తంలో ముక్కుసూటిగానే త‌ప్పుబ‌ట్టారు. అయితే, తాజాగా ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. దాని లోపించింది ఈ ముకుసూటి త‌న‌మే! ఇంత‌కీ ఆ ట్వీట్ ఏంటంటే.. ‘అశోక్ జ‌గ‌ప‌తిగారికి ప‌వన్ క‌ల్యాణ్ ఎవ‌రో తెలీదు. మంత్రి పితాని గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏంటో తెలీదు.. సంతోషం’!

ఏ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ ట్వీట్ చేశార‌నేది అంద‌రి తెలిసిందే. కొద్ది రోజుల కింద ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో భూదందాపై స్పందించారు. అది కూడా ట్విట్ట‌ర్ లోనే అనుకోండి! ఈ మ‌ధ్య కొంత‌మందికి భూ దాహం ఎక్కువైపోతోంద‌నీ, ఎంత సంపాదిస్తున్నా స‌రిపోవ‌డం లేద‌నీ ఓ మాట అనేసిన సంగ‌తి తెలిసిందే. నిజానికి దీనికి త‌లాతోకా లేదు! ఎవ‌రిని ఉద్దేశించి ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశార‌నే స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. టీడీపీ స‌ర్కారును ఉద్దేశించే ఇలా వ్యాఖ్యానించి ఉంటార‌ని కొంత‌మంది అనుకున్నారు. ఎందుకంటే, అభివృద్ధి కార్య‌క్ర‌మాల పేరుతో ఏపీ స‌ర్కారు పెద్ద ఎత్తున భూసేక‌ర‌ణ చేప‌డుతోంది క‌దా. ఏదైతేనేం, ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలితో టీడీపీ నేత‌లు కాస్త హ‌ర్ట్ అయిన‌ట్టున్నారు! ఆ అసంతృప్తి మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్య‌ల్లో బ‌య‌ట‌ప‌డింది. రాబోయే ఎన్నిక‌ల గురించి ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఏంటో తెలీద‌ని ఆయ‌న చెప్పారు. ఈ మాట‌కు బ‌దులుగా ప‌వ‌న్ తాజా ట్వీట్ అనుకోవ‌చ్చు. ఇక, అశోక్ జ‌గ‌ప‌తి ప్ర‌స్థావ‌న ఎందుకు తీసుకొచ్చారో తెలిసిందే. గ‌తంలో ఆయ‌న కూడా ఓసారి… ప‌వ‌న్ అంటే ఎవ‌రో తెలీద‌న్నారు క‌దా!

నాడు అశోక్ చేసిన వ్యాఖ్య‌ల‌పై, తాజాగా మంత్రి పితాని అభిప్రాయంపై ప‌వ‌న్ ఇలా ట్వీట్ చేసి మాట‌కు మాట బ‌దులు తీర్చుకున్నారు అనుకోచ్చు. సంతోషం! కానీ, ఇంత‌కీ ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యం ఏంటీ… భూదందా గురించే క‌దా! అదేంట‌నేది ప‌వ‌న్ క‌ల్యాణ్ సూటిగా స్ప‌ష్టంగా నాడే ట్వీట్ చేసి ఉంటే బాగుండేది. ఇన్నాళ్లూ అంశాల ప్రాతిప‌దిక‌నే జ‌న‌సేనాని మాట్లాడేవారు! కానీ, ఇప్పుడు ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు వ్య‌క్తిగ‌త‌మైపోయాయి. ఉద్దానం విష‌యంలోగానీ, వ్య‌వ‌సాయ విద్యార్థుల విష‌యంలోగానీ, ప్ర‌త్యేక హోదాపైగానీ అంత క్లియ‌ర్ గా స్పందించిన జ‌న‌సేనాని.. ఇప్పుడీ భూదందా విష‌యానికి వ‌చ్చేస‌రికి సూటిగా ఎందుకు స్పందించ‌డం లేద‌నే ప్ర‌శ్న కొంత‌మంది నుంచీ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అంటున్న ప‌వ‌న్ కు ఏదో మొహ‌మాటం అడ్డుప‌డుతోందా..? ఇలా అయితే రేప్పొద్దున్న ఎన్నిక‌ల్లో అధికార పార్టీని విమ‌ర్శించాల్సి వ‌స్తే ప‌రిస్థితి ఏంటీ..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.