నిండు సభలో అశ్లీలచిత్రాలు

నిండు కౌరవసభలో ద్రౌపది వలువలూడ్చాడు దుశ్శాసనుడు. అలా చేయడం తప్పని పెద్దలు వాదించారు. కానీ దుర్యోధనాదులు మాత్రం `ఇది సరైనదే..’ అంటూ ప్రతివాదనకు దిగారు. ఎవరివాదన వారిది, చివరకు సభలో నానా రభస జరిగింది. సరిగా అలాంటి సన్నివేశాలనే నేడు కలియుగంలోనూ చూస్తున్నాము. సభామర్యాద మంటగలిసిపోతున్నా, వెనకేసుకువచ్చే విచిత్ర పోకడలను గమనిస్తూనే ఉన్నాము.

చట్టసభ జరుగుతుండగానే మహిళలతో అసభ్యంగా మాట్లాడటం, చీరకొంగు పట్టుకుని లాగడం, నడుంమీద చేయివేయడం.. వంటి ఘోరాలు జరిగిపోతూనే ఉన్నాయి. వీటికితోడుగా గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు చూస్తూ ఆనందపడిపోతున్నప్పటికీ ముక్తకంఠంతో ఖండించాల్సిందిపోయి, పార్టీలపరంగా వెనకేసుకురావడం సిగ్గుచేటు. తప్పు చేసినవాడు తలవొంచుకోవాల్సిందిపోయి, అడ్డంగా వాదించే రోజులొచ్చాయి. ఎందుకు ఇలా చేశావని అడిగితే, `ఇందులో తప్పేముందీ, తోచక ఏదో చూస్తున్నాం’ అంటూ తేలిగ్గాతీసిపారేస్తున్నారు. ఇంకొంతమంది `అబ్బే నాకసలు స్మార్ట్ ఫోన్ సరిగా ఆపరేట్ చేయడమే రాదు. ఏదో పొరపాటున నొక్కితే నీలి చిత్రాలు కనిపించాయి. అంతే…’ అంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండో తరహా పెద్దాయన గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం.

ఒడిశాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీలో తన సీట్లో కూర్చుని ఫోన్ లో బూతుబొమ్మలు చూస్తూ అడ్డంగా దొరికిపోయారు. దీంతో సభలో అధికార పార్టీ బిజెడీ మండిపడింది. ఇక అసెంబ్లీలోని మహిళా సభ్యులు విరుచుకుపడ్డారు. దీంతో సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాబా కిషోర్ దాస్ ను స్పీకర్ వారంరోజుల పాటు సస్పెన్డ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటికీ అప్పగించారు.

మూడేళ్ల క్రిందట కర్నాటక అసెంబ్లీలో ఏం జరిగిందో సరిగా అదే ఇప్పుడు ఒడిశా శాసనసభలో పునరావృతమైంది. ఝార్సుగూడా శాసనసభ్యుడు దాస్ అసెంబ్లీలో అశ్లీల చిత్రాలను చూడటానికి సంబంధించిన దృశ్యాలను ప్రైవేట్ ఛానెళ్లలో ప్రసారంచేయడంతో తీవ్ర నిరసన భగ్గుమంది. ఒడిశా అసెంబ్లీలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ప్రధమం. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఇలా ప్రవర్తించడాన్ని తోటి ఎమ్మెల్యేలే నిరసిస్తున్నారు. 53ఏళ్ల దాస్ ఏమాత్రం కంగారుపడకుండా, పొరపాటున తన చేతివేళ్లు యుట్యూబ్ యాప్ మీదకు వెళ్ళాయని, దీంతో యుట్యూబ్ తెరుచుకుని అశ్లీల చిత్రాలను చూపించిందని అంటున్నారు. ఆయనగారి వాదన వింటుంటే, తప్పంతా యుట్యూబ్ కంపెనీదే గానీ తనది కాదన్నట్లుంది. జరిగిందానికి సిగ్గుపడటంలేదు, పైగా తనకు యాండ్రాయిడ్ ఫోన్లు ఎలా ఆపరేట్ చేయాలో సరిగా తెలియలేదనీ, జరిగిన సంఘటన మాత్రం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు.

అసెంబ్లీలో తన సీట్లో కూర్చుని మొబైల్ ఫోన్లో నీలిచిత్రాన్ని చూస్తున్న ఎమ్మెల్యే దాస్ కు తనవెనుకనే ఉన్న మీడియా కెమేరాలు ఇదంతా చిత్రీకరిస్తున్నాయన్న సంగతి తెలియదు. ప్రశ్నోత్తరాల సమయంలో కీలక అంశాలపై చర్చ జరుగుతుండగా దాస్ మాత్రం ఇలా `కీలక’మైన పనిలో పడిపోయారంటూ మీడియా కోడై కూసింది.

సభాకార్యక్రమాలు సాగుతున్నప్పుడు సభ్యులెవరూ మొబైల్ ఫోన్లను వాడకూడదంటూ గతంలో స్పీకర్ రూలింగ్ ఇచ్చిన విషయాన్ని న్యాయశాఖ మంత్రి అరుణ్ సాహూ గుర్తుచేశారు. మాజీ మంత్రి, ప్రస్తుత బిజెడీ ఎమ్మెల్యే ప్రమీలా మల్లిక్ మొదటిగా ఈ అంశం సభలో లేవనెత్తారు. దాస్ సభాగౌరవాన్ని దిగజార్చారని ఆరోపించారు. ఈ సంఘటనతో ఆయనకు మహిళల పట్ల ఏపాటి గౌరవం ఉన్నదో అర్థమవుతున్నదని ఆక్షేపించారు. అశ్లీల చిత్రాలు చూసిన ఎమ్మెల్యేపై చర్యతీసుకోవాలంటూ మోజువాణి ఓటుతో తీర్మానం ఆమోదించిన దరిమిలా, స్పీకర్ సదరు ఎమ్మెల్యేను వారంరోజుల పాటు సస్పెండ్ చేశారు. అయితే, స్పీకర్ చర్య పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పూర్తి వివరణ కోరకుండానే దోషిగా నిర్ధారణ కాకుండానే సస్పండ్ చేయడం సరైన పద్దతి కాదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రతిపక్ష డిమాండ్లను స్పీకర్ పట్టించుకోలేదు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. బిజెపీ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేశారు.

గౌరవ సభ్యుల అసభ్యధోరణిని రాజకీయాలకు అతీతంగా ఖండించకుండా, పార్టీలపరంగా చూస్తూ అడ్డంగా వాదించడం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]