ప‌వ‌న్ – కొర‌టాల‌.. అయ్యే ప‌నేనా??

కాంబినేష‌న్ల విష‌యంలో ఇండ్రస్ట్రీలో ర‌క‌ర‌కాల ఫీల‌ర్లు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. ఆ హీరో – ఆ ద‌ర్శకుడు – నిర్మాత అంటూ వెబ్ మీడియాలో కాంబినేష‌న్ల గురించి విస్ర్కృత ప్రచారం జ‌రుగుతుంటుంది. అందులో అన్నీ ప‌క్కన పెట్టేయ‌లేం. అలాగ‌ని అన్నీ న‌మ్మేయ‌లేం. కొన్ని కాంబినేష‌న్లు మాత్రం ‘క‌లిస్తే బాగుంటుంది క‌దా’ అనిపించేలా ఉంటాయి. అలాంటిదొక‌టి ప‌వ‌న్ క‌ల్యాణ్ – కొర‌టాల శివ‌. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ .. ఇలా ఒక‌దాన్ని మించి మ‌రో విజ‌యాన్ని అందుకొంటూ దూసుకుపోతున్నాడు కొర‌టాల శివ‌. ఇప్పుడాయ‌న ఓకే అంటే అడ్వాన్సులు ఇవ్వడానికి కనీసం ప‌ది మంది నిర్మాత‌లు క్యూలో ఉన్నారు. హీరోలూ రెడీనే. మ‌రోవైపు ప‌వ‌న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప‌వ‌న్ సినిమా అంటే కొబ్బరికాయ్ కొట్టక‌ముందే బిజినెస్ షురూ అయిపోతుంది. ఆయ‌న రేంజ్ అలాంటిది. వీరిద్దరూ క‌లిస్తే ఇక బాక్సాఫీసుకు పండ‌గే. ప‌వ‌న్ – కొర‌టాల కాంబోలో ఓ సినిమా వ‌స్తోందంటూ విస్క్రృతంగా ప్రచారం మొద‌లైంది. క‌లిస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. మ‌రి క‌లిసే ఛాన్సుందా..?? ఉంటే ఎంత‌?

జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత సినిమా ఏమిట‌న్న విష‌యంలో కొర‌టాల ద‌గ్గర క్లారిటీ ఉంది. మ‌హేష్ బాబు కోసం ఓ క‌థ రెడీ చేస్తున్నారాయ‌న‌. ఆ సినిమా పూర్తయ్యేస‌రికి 2017 గ‌డిచిపోతుంది. ఆ త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ రెడీగా ఉన్నాడు. చ‌ర‌ణ్‌తో సినిమా త‌ప్పకుండా ఉంటుంద‌ని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాడు కొర‌టాల. అంటే… 2018 వ‌ర‌కూ కొర‌టాల బిజీనే. మ‌రోవైపు ప‌వ‌న్ ప‌రిస్థితి చూద్దాం. కాట‌మ‌రాయుడు పూర్తయిన వెంట‌నే త్రివిక్రమ్‌తో సినిమా మొద‌లెట్టేస్తాడు ప‌వ‌న్. ఆ త‌ర‌వాత దాసరి బ్యాన‌ర్‌లో ఓ సినిమా ఉంటుంది. అందుకోసం దాస‌రి క‌థ కూడా రెడీ చేసుకొని, టైటిల్ కూడా రిజిస్టర్ చేయించేశారు. మ‌రొక‌రి క‌థ‌తో కొర‌టాల డైరెక్షన్ చేయ‌డం అన్నది సాధ్యమ‌య్యే విష‌యం కాదు. ఎందుకంటే కొర‌టాల ద‌గ్గర ఆల్రెడీ ప‌ది క‌థ‌లు బౌండెడ్ స్ర్కిప్ట్‌తో రెడీగా ఉన్నాయ‌ట‌. అందులో ఓ క‌థ ప‌వ‌న్ కి చెప్పాల‌ని ఎదురుచూస్తున్నాడ‌ట‌. కొర‌టాల రెడీగా ఉన్నా.. ప‌వ‌న్ ఖాళీ అవ్వడానికి మ‌రో రెండేళ్లు ప‌డుతుంది. ఈలోగా స‌మీక‌ణాలు ఎన్నయినా మారొచ్చు. ఒక‌వేళ త్రివిక్రమ్ డ్రాప్ అవ్వడ‌మో, లేదంటే దాస‌రి క‌థ‌కు కొర‌టాల ఓకే అన‌డమో, లేదంటే దాస‌రి త‌న క‌థ ప‌క్కన పెట్టి కొర‌టాల క‌థ‌తో ప్రొసీడ్ అవ్వడానికి రెడీ అవ్వడ‌మో జ‌రిగితే అప్పుడు ప‌వ‌న్ – కొర‌టాల సినిమా ముందుకెళ్లే ఛాన్సుంది. లేదంటే.. ఈ కాంబినేషన్ వార్తల‌కే ప‌రిమితం కావ‌ల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com