ఉత్థానం, భూ సేకరణ…మాటలు అదుర్స్…చేతలు ఎక్కడ పవన్?

విపరీతంగా బుక్స్ చదువుతానంటాడు, అధ్యయనం చేస్తానంటాడు, ఏం మాట్లాడినా ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడతానంటాడు, ఒక సారి మాట ఇస్తే ప్రాణం పోయినా మాట మీద నిలబడతానంటాడు…ఇంకా ఎన్నెన్నో మాటలు చెప్తాడు పవన్. అన్నీ కూడా సినిమాలలో ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ కంటే ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఎంతైనా వపర్ స్టార్ కదా. కానీ చేతల్లో మాత్రం అస్సలు ఏమీ ఉండదు. రాజధాని భూ సేకరణ ప్రక్రియలో బాధితులవుతున్న రైతుల దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. చాలా ఆవేశంగా మాట్లాడాడు. ప్రభుత్వం తప్పు చేస్తే తుప్పు రేగ్గొడతాననే రేంజ్‌లో ఏదో మాట్లాడేశాడు. అస్సలు ఊరుకోను….ఉద్యమమే చేస్తానన్నాడు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం భూ సేకరణ విజయవంతంగా చేసేసింది. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆ విషయంపై మాట్లాడింది లేదు. ఇప్పుడు చట్టంలో మార్పులు చేసి మరోసారి భూ సేకరణకు తెరలేపింది చంద్రబాబు ప్రభుత్వం. భూ సేకరణ బాధితులందరూ కూడా జగన్ కంటే పవన్‌నే ఎక్కువ నమ్ముతున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు పట్టుకుని పోరుబాట పడుతున్నారు. వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ వస్తాడని నమ్ముతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కనీసం ట్విట్టర్‌లో కూడా స్పందించడం లేదు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ…తనకు బాగా ఇష్టమైన ఉత్తర-దక్షిణ భారతాల మధ్య గొడవలు పెట్టే విషయం అయితే మాత్రం కనీసం ట్విట్టర్‌లో అయినా స్పందిస్తున్నాడు పవన్. మరి ఈ బాధిత రైతుల గోడు అంత ఇంపార్టెంట్ కాదని పవన్‌ అనుకుంటున్నాడో ఏమో తెలియదు.

ఇక ఉత్థానం బాధితులను పరామర్శించిన సందర్భంలో కూడా ఏవేవో మాట్లాడేశాడు పవన్. తాను పరామర్శించడం వళ్ళే ప్రభుత్వం స్పందించింది అని క్లెయిమ్ చేసుకోవడానికో ఏమో తెలియదు కానీ …ఉత్థానం కిడ్నీ బాధితుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించేసింది అనే స్థాయిలో ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాడు. ఆ విషయం పక్కన పెడితే ఉత్థానం పర్యటన సందర్భంగానే నిపుణులతో ఓ కమిటీ వేస్తానని….ఆ కమిటీ తనకు పదిహేను రోజుల్లో రిపోర్ట్ ఇస్తుందని…ఆ తర్వాత నుంచీ ఉద్యమస్థాయిలో పోరాటం చేసి ఉత్థానం సమస్యను శాశ్వితంగా పరిష్కరించేలా చేస్తానని ఆవేశంగా మాట్లాడేశాడు పవన్. పవన్ చెప్పిన పదిహేను రోజులు అయిపోయి నెలల కాలం గడిచిపోతోంది. కనీసం కమిటీని నియమించిన పాపాన కూడా పోలేదు పవన్. ఇక రిపోర్ట్ ఎక్కడ? పవన్ పోరాటం ఎక్కడ? అలాగే హోదా విషయంలో కూడా ఆ మధ్య ఓ సారి పోరాట ప్రణాళికను వివరించాడు పవన్. ఆ తర్వాత ఓ రెండు మూడు సభలు కూడా నిర్వహించాడు. అంతటితో సరి. తాను చెప్పిన హోదా ఉద్యమ ప్రణాళిక కనీసం పవన్‌కి అయినా గుర్తుందో లేదో తెలియదు.

ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పుడు కూడా ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రేంజ్‌లో వచ్చేవి. ఆ తర్వాత మాత్రం చతికిలపడిపోయేవి. ఇప్పుడు పవన్ చేస్తున్న ఉద్యమాలు కూడా అలానే ఉన్నాయి. ఓపెనింగ్ మాత్రం అదిరిపోతోంది. ఆ ఆరంభాన్ని చూసి…పవన్ పలుకులను చూసి ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు…ఆ తర్వాత మాత్రం ఆ ఓపెనింగ్‌తోనే సరిపెట్టుకోవాల్సివస్తోంది. పవన్ ఉద్యమాలు మాటల్లో నుంచి చేతల్లోకి ఎప్పుడు రూపాంతరం చెందుతాయో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com