సీరియస్ పొలిటీషియన్ గా టర్న్ అవ్వడం కోసం కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు వవన్ కల్యాణ్. ఇక జనసేన 100 % స్ట్రయిక్ రేట్ తో గెలిచాక, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరవాత.. ఆయన సినిమాలకు దూరం అవుతారన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేశాక, పవన్ సినిమాలకు దూరం అవుతారని ఫ్యాన్స్ కూడా అనుకొన్నారు. అందుకే ‘ఓజీ’, ‘ఉస్తాద్’ షూటింగుల్ని త్వరిత గతిన పూర్తి చేశారు. అప్పుడెప్పుడో అడ్వాన్స్ అందుకొన్న సినిమా (సురేందర్ రెడ్డి దర్శకత్వంలో) కూడా వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి సినిమానే పవన్ చేసే ఆఖరి సినిమా అనుకొంటోంది టాలీవుడ్.
అయితే.. పవన్ నిర్ణయాలు క్రమంగా మారుతున్నాయేమో అనిపిస్తోంది. ముఖ్యంగా ‘ఉస్తాద్’ సినిమా పూర్తయిన వేగం చూశాక పవన్ లో మరిన్ని సినిమాలు చేయొచ్చన్న నమ్మకం కలుగుతోంది. ఈ విషయాన్ని ‘ఉస్తాద్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవనే చెప్పుకొచ్చారు. ‘ఉస్తాద్’ కోసం పవన్ ఇచ్చిన కాల్షీట్లు కేవలం 40 మాత్రమే. 40 రోజుల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాని పూర్తి చేసినప్పుడు.. పవన్ ఏడాదికి రెండు సినిమాలు చేసినా తప్పేం కాదు. మిగిలిన రోజుల్లో ఎలాగూ రాజకీయాలతో బిజీగా ఉంటారు. సరిగ్గా ప్లాన్ చేసుకొంటే.. పవన్ కు కథలు చెప్పి ఒప్పిస్తే – ఏడాదికి వవన్ రెండు సినిమాలు చేసుకొంటూ వెళ్లొచ్చు. మొన్నామధ్య హరీష్ శంకర్ కూడా ‘పవన్ లాంటి హీరోలు సినిమాలకు దూరం అవ్వకూడదు. ఆయన కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలి. ఆ డబ్బులు ఆయన కోసం ఉంచుకోరు. మళ్లీ ప్రజా సేవకే ఖర్చు పెడతారు. అందుకోసమైనా పవన్ తో సినిమాలు చేయించాలి’ అన్నారు. అందుకోసమైనా పవన్ ఇప్పట్లో సినిమాలకు దూరం అయ్యే ఛాన్సే లేదు. దానికి తోడు పవన్ కూడా ‘నన్ను సినిమాల నుంచి దూరం చేయలేరు. సినిమా నాలో నరనరాన జీర్ణించుకుపోయింది’ అనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. సో.. పవన్ అభిమానులు బెంగ పడాల్సిన అవసరమే లేదు.
