తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ప్రకటించిన ఆయన, ప్రస్తుతం నిధుల విడుదల లేక పనులు ఆగిపోతుండటంతో తన వేదనను బయటపెట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకే మంత్రులు ఫోన్ ఎత్తడం లేదు, ఇక రాజకీయాలు చేసి ఏం లాభం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అభివృద్ధికి నిధులు ఇస్తారన్న నమ్మకంతోనే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చామని, తీరా వచ్చాక పెండింగ్ బిల్లులు రాకపోవడంతో నియోజకవర్గాల్లో పనులు స్తంభించిపోయాయని పోచారం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి, నియోజకవర్గ సమస్యల కోసం మంత్రులను సంప్రదిస్తే కనీస గౌరవం దక్కడం లేదని ఆయన ఆవేదన చెందారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన తమకు ఈ పరిస్థితి ఎదురైతే, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనే ప్రశ్న ఆయన మాటల్లో వినిపించింది.
గతంలో స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించిన తన వంటి సీనియర్ నేతకే ఫోన్ కాల్స్ రెస్పాన్స్ లేకపోవడంపై పోచారం తీవ్రంగా మండిపడ్డారు. కేవలం తన నియోజకవర్గ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అధికార పార్టీలో చేరినప్పుడు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆశించామని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన విమర్శించారు. అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వకపోతే రాజకీయాల్లో కొనసాగడం నిరర్థకమని ఆయన అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి ముసుగులో పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన కాంగ్రెస్, ఇప్పుడు సొంత నేతలకే నిధులు ఇవ్వలేకపోతోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పోచారం వంటి సీనియర్ నాయకుడే బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయించిన నేతల పరిస్థితి అలా ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.


