తానా ప్రధాన కార్యదర్శిగా పొట్లూరి రవి

  1. వాషింగ్టన్ డీసీ లో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభల ముగింపు రోజున తానా ప్రధాన కార్యదర్శిగా పొట్లూరి రవి పదవీబాధ్యతలు స్వీకరించారు. తానాలో ఎన్నికలు జరిగే పదవుల్లో రెండో పెద్ద పదవి కార్యదర్శి, ఈ పదవికి పొట్లూరి రవి మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు కి చెందిన పొట్లూరి రవి ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన ప్రోత్సాహంతో 2004 నుండి పొట్లూరి రవి తానాలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 2007 వాషింగ్టన్ డీసీ మహాసభలలో స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ గా, 2011 లో అప్పటి తానా అధ్యక్షులు కోమటి జయరాం ఆధ్వర్యంలో కర్నూలు వరద భాదితులకు పక్కా గృహాలు నిర్మించే ప్రాజెక్ట్ పర్యవేక్షకుడిగా, 2013 నుండి 15 తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధిగా, 2015 నుండి 2017 తానా సంయుక్త కార్యదర్శిగా, 2017 నుండి 2019 తానా కోశాధికారిగా వివిధ భాద్యతలు సమర్ధవంతంగా నిర్వహించారు. 2014 లో న్యూజెర్సీ లో జరిగిన తానా ఉమెన్స్ కాన్ఫరెన్స్, హుధుద్ తుఫాను భాదితుల విరాళాల సేకరణ, 2015 లో గంగాధర్ నాదెళ్ళ ఆధ్వర్యంలో జరిగిన డిట్రాయిట్ తానా మహాసభలు, 2016 లో న్యూయార్క్ లో జరిగిన తానా 40వ సంవత్సర వేడుకలు, 2017లో ఫిలడెల్ఫియా లో జరిగిన ప్రాంతీయ మహాసభలు, 2019 వాషింగ్టన్ డీసీ 22వ తానా మహాసభల్లో కీలకపాత్ర పోషించి విజయవంతం అవటానికి విశేషకృషి చేసారు.

తానా పత్రికకు విరాళాల సేకరణ, ప్రముఖ సంగీత విద్వాంసులు శోభారాజు, రామాచారి తదితరులతో శిక్షణాశిబిరాలు, ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో భారీ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఇలా పొట్లూరి రవి కి పని అప్పగిస్తే ఎలాగైనా విజయవంతం చేస్తారనే పేరు సంపాదించుకున్నారు. మాజీ ఎంపీ మూర్తి బృందం అలస్కా లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పుడు అప్పటి అధ్యక్షుడు సతీష్ వేమనతో కలిసి కొన్ని గంటల్లోనే ప్రమాదస్ధలికి చేరుకుని కార్యక్రమాలు పర్యవేక్షించారు. అమెరికాలోనే కాకుండా 2016లో కర్నూలు లో తానా ఆధ్వర్యంలో మూడురోజులపాటు జాతీయస్థాయి నాటకపోటీలు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కర్నూలు నగరంలోని పదహారు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్ లో డిజిటల్ క్లాసురూములు ఏర్పాటు చేశారు. మహిళాపోలీసుల కోసం రెండులక్షలతో ఎలక్ట్రిక్ సైకిల్స్ అందజేశారు. కర్నూలు గోశాల కు విరాళం అందజేశారు. కర్నూలు జిల్లాలో ముఠాతగాదాల్లో నష్టపోయిన ఫ్యాక్షన్ బాధిత గ్రామం కప్పట్రాళ్ళను దత్తత తీసుకుని స్వంత నిధులు, తానా అధ్యక్షులు సతీష్ వేమన, మాజీ అధ్యక్షులు జంపాల చౌదరి సహకారంతో దాదాపు అరవై లక్షలతో మహిళలకోసం స్త్రీ శక్తి భవనం నిర్మించారు. పదోతరగతితో చదువు ఆపేసిన కప్పట్రాళ్ళ విద్యార్థినిని దత్తత తీసుకుని ఉన్నతచదువులు చదివిస్తున్నారు. కప్పట్రాళ్ళ విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం లక్షరూపాయలకు పైగా స్కాలర్షిప్స్ అందజేయటమే కాకుండా డిజిటల్ క్లాసురూమ్, లైబ్రరీ, క్రీడాపరికరాలు, కంప్యూటర్స్ ఏర్పాటు చేయటం, 2019 జనవరిలో పదిలక్షలకు పైగా వెచ్చించి తానా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహంచడం ఇలా ఎన్నో కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు.

నందమూరి బాలకృష్ణకు అమెరికాలో అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పొట్లూరి రవి 2013 లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ అధ్యక్షుడిగా టి.ఏ.జి.డి.వి. 40 సంవత్సరాల వేడుకలు దాదాపు మూడున్నర వేలమందితో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నందమూరి బాలకృష్ణ స్వయంగా హాజరయ్యారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి స్వంతంగా విరాళాలు ఇవ్వటమే కాకుండా 2012లో నలభైవేలకు పైగా విరాళాలు సేకరించి బాలకృష్ణకు అందజేశారు.ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 2018 ఆగస్టులో రెండు లక్షల విరాళం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు.

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు – రవి పొట్లూరి

నాలుగు దశాబ్దాల తానా ప్రస్థానంలో ఎందరో పెద్దలు సంస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు వారి అడుగుజాడల్లో నడుస్తూ అందరి సహకారంతో భాద్యతలు నిర్వరిస్తాను. పూర్వాధ్యక్షులు కోమటి జయరాం, గంగాధర్ నాదెళ్ళ, వేమన సతీష్ ల స్పూర్తితో ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి ఆధ్వర్యంలో ప్రస్తుత నాయకత్వ బృందం, దాతలు, సభ్యుల సహకారంతో తానా ను ముందుకు తీసుకువెళ్తాము.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com