ప్రొ.నాగేశ్వర్: ఢిల్లీపై సుప్రీంకోర్టు తీర్పు..! ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకే సర్వాధికారాలు..!!

ఢిల్లీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించేంత తీర్పును సుప్రీంకోర్టును వెలువరించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో… లెఫ్టినెంట్ గవర్నర్.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద పెత్తనం చెలాయిస్తున్నారు. తనకు విచక్షణాధికారాలు ఉన్నాయని వాదించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అడ్డుపడుతున్నారు. కేంద్ర ఎజెంట్‌గా పని చేస్తున్న లెఫ్టిగవర్నర్ వాదన ఏమింటే.. ఢిల్లీకి అసెంబ్లీ ఉన్నా.. రాష్ట్ర హోదా లేదు. రాష్ట్ర హోదా లేనప్పుడు… అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. లెఫ్టినెంట్‌గవర్నర్‌కే అధికారాలు ఉంటాయని వాదిస్తున్నారు.

కేజ్రీవాల్‌ను పని చేయనివ్వని లెఫ్టినెంట్ గవర్నర్..!
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి అధికారంలో వస్తాయి. ఆ హామీలను అమలు చేయడానికి.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్డుపడితే ఎలా..?. అరవింద్ కేజ్రీవాల్ మొహల్లా క్లీనిక్‌ల పేరుతో.. కాలనీల్లో ఆస్పత్రులు ఏర్పాటు చేయాలనుకున్నారు. రేషన్ సరుకుల్ని డోర్ డెలివరి చేయాలనుకున్నారు. అక్రమంగా ఏర్పడిన కాలనీల్లో ఉండే ప్రజలకు కూడా మౌలిక సదుపాయాలను కల్పించాలనుకున్నారు. కానీ ప్రతీ దానికి లెఫ్టినెంట్‌ గవర్నర్ అడ్డుపడుతూ వస్తున్నారు. ఏ పని చేయనివ్వడం లేదు. వ్యక్తిగతంగా.. కేజ్రీవాల్‌కు… లెఫ్టినెంట్‌ గవర్నర్ కు మధ్య ఏ గొడవలు ఉండవు. కానీ లెఫ్టినెంట్‌ గవర్నర్ కేంద్ర ప్రతినిధి కాబట్టి… బీజేపీ రాజకీయ అవసరాల కోసం… కేజ్రీవాల్‌ని పని చేయనివ్వకుండా చేస్తున్నారు.

ఢిల్లీలో గండికొట్టారనే కేజ్రీవాల్‌పై మోడీకి కోపం..!
2015లోనే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత … కేంద్ర హోంశాఖ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏ ఉద్యోగిపైనా.. క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం ఉండదని ఆ ఆదేశాల సారాంశం. ఈ అధికారాలన్నీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కేంద్ర హోంశాఖ కట్టబెట్టింది. అంటే అర్థం ఏమిటి.. ప్రభుత్వం ఉంటుంది.. కానీ అధికారులతో పని చేయించుకోలేదు. అన్ని రకాలుగా కేజ్రీవాల‌్ ప్రభుత్వాన్ని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతూ వస్తోంది. దీనికి రెండు కారణాలున్నాయి. 2015లో కేజ్రీవాల్ భారీ మెజార్టీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు. 70స్థానాల అసెంబ్లీలో 67 స్థానాలను ఆప్ గెలుచుకుంది. బీజేపీ దీన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సీట్లనూ బీజేపీ గెలుచుకుంది. ఏడాదిలోనే బీజేపీని పూర్తిగా తిరస్కరించారు. నిజానికి బీజేపీకి ఢిల్లీలో జనసంఘ్ కాలం నుంచి పలుకుబడి ఉంది. ఇప్పుడా పలుకుబడి ఆమ్‌ఆద్మీకి రావడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఎలాగైనా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాలని బీజేపీ అనుకుంటోంది. రాజకీయాల్లో ఏం జరుగుతుందన్నది ప్రజలకు తెలియదు. ఏ పనీ జరగకపోతే.. ప్రజలు ప్రభుత్వం మీద తిరగబడతారు. అందుకే కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డు పెట్టుకుని అన్ని పనులను నిలిపి వేస్తోంది.

ప్రజాప్రభుత్వానికే సర్వాధికారాలు..!
ఇక్కడ మౌలికమైన సమస్య ఏమిటంటే… అధికారం ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిదా..? లెఫ్టినెంట్ గవర్నర్‌దా..?. ఇది చాలదన్నట్లు బీజేపీ ఆమ్‌ఆద్మీ పార్టీలో చీలికలు తీసుకు వచ్చింది. చివరికి… ఈసీని వాడుకుని ఇరవై మంది ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిపై చేశారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. ఈసీ తీరును ఢిల్లీ హైకోర్టు విమర్శించింది. ఈ వివాదాల మధ్య సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. స్పష్టంగా చెప్పింది. ఎన్నికైన ప్రభుత్వాలకు మాత్రమే అధికారాలు ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేటెడ్ వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ప్రజలు ఎన్నుకున్నపై ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది.

మూడు తప్ప అన్ని అంశాల‌్లో అధికారం ప్రజాప్రభుత్వానిదే..!
భారతరాజ్యాంగంలో 69వ సవరణ ద్వారా 1991లో ఆర్టికల్ 239AA, ఆర్టికల్ 239AB ని చేర్చారు. దీని ద్వారా ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతాన్ని దేశ రాజధాని ప్రాంతంగా ప్రకటించాయి. దీనికి శాసనసభ, ముఖ్యమంత్రి, మంత్రిమండలిని ఇచ్చారు. ఏ అధికారాలు లేకపోతే.. ఇవన్నీ ఎందుకు..?. ప్రతి దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడుతూంటే.. ఈ రాజ్యాంగంలో అధికరణాల ద్వారా ఉపయోగం ఏమిటి..?. భూమి, పోలీస్, శాంతిభద్రతలు.. ఈ మూడు విషయాల్లో మాత్రమే.. ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఈ మూడు విషయాల్లో మాత్రమే అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మిగతా పాలన మొత్తం.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ద్వారానే నడుస్తుంది. ఢిల్లీ ఉద్యోగులు… ప్రభుత్వ పరిధిలో ఉంటారు కానీ..లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో ఉండరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇప్పటికైనా కేంద్రం తీరు మారాలి..!
ఏదైనా విషయం ప్రభుత్వం పరిధిలో ఉంటుందా..? లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో ఉంటుందా అన్న అనుమానం వస్తే దాన్ని రాష్ట్రపతికి రిఫర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే.. రాష్ట్రపతి మసలుకుంటాడు. అంటే అర్థం ఏమిటి..? కేంద్రం నిర్ణయమే ఫైనల్ అవుతుంది. విషయంలోనూ సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. ప్రతి విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్ రాష్ట్రపతికి రిఫర్ చేయకూడదని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన పరిస్థితుల్లో మాత్రమే రిఫర్ చేయాలని స్పష్టం చేసింది. అంటే లెఫ్టినెంట్‌గవర్నర్ చెలాయిస్తున్న అనధికారిక అధికారాన్ని కట్ చేసింది. ప్రజా ప్రభుత్వానికి పూర్తి అధికారం కల్పించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.